మళ్లీ.. మొదటికే

ABN , First Publish Date - 2022-01-18T06:03:52+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగడంతో మళ్లీ పరిస్థితి మొదటికే వస్తోంది. గత పక్షం రోజుల వరకు పరిస్థితి బాగానే ఉన్నా.. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. సోమవారం ఒకేరోజు 58 పాజిటివ్‌ కేసులు రావడం ఆందోళన రేపు తోంది. జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 5లక్షల 69వేల 710టెస్టులు చేయగా,

మళ్లీ.. మొదటికే
కలెక్టరేట్‌లో రెవెన్యూ సిబ్బందికి బూస్టర్‌ డోసు ఇస్తున్న వైద్య సిబ్బంది

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకే మొగ్గు
పండుగ తర్వాత పైపైకి వస్తున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య
సోమవారం ఒకేరోజు 58 కేసులు
సరిహద్దు కట్టడిపై దృష్టి సారించని జిల్లా యంత్రాంగం
మరికొన్నాళ్ల పాటు అప్రమత్తంగా ఉండాలన్న వైద్య అధికారులు

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 5.69 లక్షలకు పైగా టెస్టులు చేయగా, 16.63 వేలకు పైగా పాజిటివ్‌ కేసుల నమోదు

ఆదిలాబాద్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగడంతో మళ్లీ పరిస్థితి మొదటికే వస్తోంది. గత పక్షం రోజుల వరకు పరిస్థితి బాగానే ఉన్నా.. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. సోమవారం ఒకేరోజు 58 పాజిటివ్‌ కేసులు రావడం ఆందోళన రేపు తోంది. జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 5లక్షల 69వేల 710టెస్టులు చేయగా, 16వేల 638 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో కొంత భయమే కనిపించినా.. సెకండ్‌వేవ్‌లో భారీగా మరణాలు సంభవించాయి. థర్డ్‌వేవ్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితి ఉధృతం గా మారుతోంది. కొత్తగా ఒమైక్రాన్‌ వేరింట్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. కాని కరో నా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. గత వారంలోనే  పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండింతలు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మరి కొన్నాళ్ల పాటు వైరస్‌ పట్ల అప్ర మత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫ మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులు
కరోనా ఉధృతి పెరుగడంతో ప్రభుత్వం జనవరి 16 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెల వులను ప్రకటించింది. అయితే, మళ్లీ 30వరకు సెలవులను పొడగిస్తూ ఆదివారం ప్రభుత్వం ప్రకటించడంతో మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. గతంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంతో జిల్లాలోని విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. పరిస్థితి చక్కబడిందని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగడంతో బడులకు సెలవులను పొడగించక తప్పడం లేదు. మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ ఇబ్బందులు, ఎం తోమంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మళ్లీ బ డులు ఎప్పుడు ప్రారంభమవుతాయో? చెప్పలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2021-22 విద్యా సంవత్స రం ముగిసే సమయం దగ్గర పడుతున్నా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సెలబస్‌ పూర్తికాలేదు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. వార్షిక పరీక్షలు సమీపించడంతో విద్యార్థులు అయో మయానికి గురవుతున్నారు. ఈ యేడు కూడా విద్యా సంవత్సరం ఒడిదుడుకు ల మధ్యనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఫ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు
జిల్లాలో సంక్రాంతి పండుగ తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరుగడంతో విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పండుగకు రాకపోకలు పెరిగిపోవడం కూడా కరోనా ఉధృతికి ప్రధాన కారణమంటున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించినట్లు కనిపించడం లేదు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించక పోవడం వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం, ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ రెండో డోసు పూర్తికాక పోవడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీనేజర్స్‌కు వ్యాక్సినేషన్‌ ప్రారంభించినా.. అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగడం లేదు. థర్డ్‌వేవ్‌తో పెద్దగా ముప్పు లేకున్నా.. వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతున్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే రాత్రిళ్లు కర్ఫ్యూ విధించే అవ కాశాలు లేకపోలేదు. ఇప్పటికే మాస్కు ధరించని వారికి పోలీసులు రూ.వెయ్యి  జరిమానా విధిస్తున్నా.. ప్రజల్లో మార్పు కనిపించడం లేదు.
ఫ పొంచి ఉన్న ‘మహా’ముప్పు
జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. అయిన జిల్లాకు యథేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి. ఆర్టీసీ ప్రయాణంతో పాటు రైలు మార్గం గుండా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ప్రైవేట్‌ వాహనాలు కూడా సరిహద్దులను దాటి జిల్లాకు వస్తున్నాయి. ఆసుపత్రులు, ఇతర పనుల నిమిత్తం జిల్లావాసులు మహారాష్ట్రలోని యవత్‌మాల్‌, కిన్వట్‌, చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌, తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. గతంలో కరోనా కట్టడికి జిల్లా సరి హద్దుల్లో ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు. దీంతో కొంత మేరకు వైరస్‌ను కట్టడి చేయగలిగారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులపై అధికారులు అలాంటి కట్టడి చర్యలు తీసుకోక పోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాకు వచ్చిపోయే ప్రయాణికులను ఏమాత్రం పరిశీలించకుండానే అనుమతించడంతో ‘మహా’ముప్పు పొంచి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఒమైక్రాన్‌ కేసులు కూడా భారీగానే వస్తున్నా.. జిల్లా అధికారులు కట్టడి చర్యలపై దృష్టి సారించడం లేదంటున్నారు. ఇకనైనా సరిహద్దుల్లో నిఘా సారిస్తే కొంత మేరకైనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
ఫ మరింత అప్రమత్తంగా ఉండాలి
: డా.రాథోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌వో
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలను పాటించాలి. మాస్కును ధరిస్తూ భౌతికదూరాన్ని పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా వైరస్‌తో ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు కాలేదు. కాని కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

Updated Date - 2022-01-18T06:03:52+05:30 IST