ఔటర్‌పై ‘ఈగల్‌’ toll వేట.. రెండేళ్లలో 879.75 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2021-12-30T13:45:39+05:30 IST

ఔటర్‌పై ‘ఈగల్‌’ toll వేట.. రెండేళ్లలో 879.75 కోట్ల ఆదాయం

ఔటర్‌పై ‘ఈగల్‌’ toll వేట.. రెండేళ్లలో 879.75 కోట్ల ఆదాయం

  • మళ్లీ టోల్‌ వసూలు బాధ్యతలు
  • ఏడాదికి రూ.414 కోట్లకు ఖరారు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై టోల్‌ వసూళ్ల బాధ్యతలను ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థ మళ్లీ దక్కించుకుంది. ఇతర సంస్థల కంటే అత్యధిక బిడ్‌ (ఏడాదికి రూ.414 కోట్లు) కావడంతో ఈ సంస్థకు టెండర్‌ ఖరారు చేసినట్లు హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఎండీ సంతోష్‌ తెలిపారు. త్వరలోనే సంబంధిత సంస్థతో ఒప్పందం చేసుకుంటామని, కేవలం టోల్‌ వసూలు బాధ్యతలను సంస్థకు అప్పగించామని, నిర్వహణ తామే చూసుకుంటామని వెల్లడించారు.


హైదరాబాద్‌ సిటీ : ఔటర్‌పై టోల్‌ వసూలు కోసం అక్టోబర్‌ మొదటి వారంలోనే అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఏడాదికి రూ.500 కోట్లుగా ధర నిర్ణయించారు. నవంబర్‌ లోపు టెండర్లు దాఖలు చేయాల్సి ఉండగా, ఒకే ఒక్క సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఔటర్‌పై టోల్‌ వసూళ్లు చేస్తున్న ఈగల్‌ సంస్థ కూడా టెండర్‌ బిడ్‌ దాఖలు చేయలేదు. దీంతో మరోసారి ఏడాదికి రూ.380 కోట్లను సరాసరి ఆదాయంగా నిర్ణయించి 18 నెలలకు టెండర్లను ఆహ్వానించారు. ఈసారి సహకార్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌, ప్రకాష్‌ అస్ఫాల్టింగ్స్‌ అండ్‌ టోల్‌ హైవేస్‌ సంస్థ, ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థలు పోటీ పడ్డాయి. ఏడాదికి అత్యధికంగా రూ.414 కోట్లను చెల్లించేందుకు బిడ్‌ దాఖలు చేసిన ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థకు టెండర్‌ను ఖరారు చేశారు.


రెండేళ్లలో 879.75 కోట్ల ఆదాయం

టెండర్‌ దక్కించుకున్న ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థ నెలకు రూ.34.5 కోట్ల మేర హెచ్‌ఎండీఏకు చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలలకు గాను రూ.621 కోట్లను చెల్లించాలి. ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు టోల్‌ వసూలు చేయడానికి ఈగల్‌కు గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో 25 శాతం  అధికం అంటే మొత్తంగా రూ.43.12 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. 2022 జనవరి నుంచి ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థతో ఒప్పందం చేసుకుంటే 2023 డిసెంబర్‌ వరకు  ఈ సంస్థ ఔటర్‌పై టోల్‌ వసూలు చేయనుంది. రెండేళ్లలో హెచ్‌ఎండీఏకు రూ.879.75కోట్ల ఆదాయం రానుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఏటా వాహనాలు పెరుగుతున్నాయి. 2016లో ఆరు వేల వాహనాలు ప్రయాణిస్తే, 2021లో సగటున 1.22 లక్షల నుంచి 1.23 లక్షల వాహనాలు ప్రయాణించాయి. 

Updated Date - 2021-12-30T13:45:39+05:30 IST