Abn logo
Aug 4 2021 @ 01:11AM

మళ్లీ పంజా!

వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్‌ హరికిరణ్‌ సమీక్ష

జిల్లాలో మళ్లీ పెరుగుతోన్న పాజిటివ్‌ కేసులు

కాకినాడ జీజీహెచ్‌లో క్రమేపీ పడకలకు రద్దీ

ప్రస్తుతం 172మంది బాధితులకు ఆక్సిజన్‌ పడకలపై చికిత్స

395కు చేరిన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు.. వీరిలో ఇప్పటివరకు 61 మంది మృతి

కాకినాడ జేఎన్టీయూలో నాలుగు పాజిటివ్‌లతో వందలాది విద్యార్థినుల్లో గుబులు

మరోపక్క కేసులు పెరుగుతుండడంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరిక

కొవిడ్‌ ఆసుపత్రులకు అనుబంధంగా ట్రాన్సిట్‌ ఆసుపత్రులు పెంచాలని ఆదేశాలు

ఇకపై పాజిటివ్‌ వచ్చిన ఇంటికి కంటైన్మెంట్‌ స్టిక్కర్లు అతికించనున్న అధికారులు

మాస్కు లేకున్నా, గుమిగూడి ఉన్నా ఫోటోలు తీసి జరిమానా విధింపు

వివాహాలకు 150 మందిని అనుమతించే విషయంలోనూ మళ్లీ ఆంక్షలు 

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది.   తగ్గినట్లే తగ్గి తిరిగి పంజా విసురుతోంది. దీంతో రోజువారీ   బులిటెన్‌లో జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువవుతోంది. ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్‌కు బాధితుల సంఖ్య రోజు  రోజుకు పెరుగుతోంది. దీనికితోడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కూడా  ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు ఇకపై మాస్కులు లేనివారు, ప్రజలు గుమిగూడిన ప్రాంతాల్లోను ఫోటోలు తీసి జరిమానాలు  పెంచాలని కలెక్టర్‌ మంగళవారం ఆదేశించారు. కేసులు ఒక్కసారిగా పెరిగి పడక దొరక్క మరణాలు చోటుచేసుకోకుండా ఉండేలా కొత్తగా ట్రాన్సిట్‌ ఆసుపత్రులు సిద్ధం చేయాలని సూచించారు. కొవిడ్‌ సోకిన ఇంటి వద్ద స్టిక్కర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. ఈనెల 11 నుంచి  వివాహాలు ఉన్నందున 150 మంది కంటే తక్కువకు పరిమితం   చేసేలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఒకపక్క దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ పంజా విసురుతోంది. పాజిటివ్‌ రేటు పది శాతానికి మించి ఉన్న జిల్లాల్లోను పరిస్థితి ముదిరిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పాజిటివిటీ రేటు పది శాతానికిపైన ఉన్న 46 జిల్లాల్లో తూర్పుగోదావరి కూడా ఉండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు కట్టుతప్పితే మరోసారి నష్టం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రోజువారీ పాజిటివ్‌లు జిల్లాలో పెరుగుతుండడంపైనా కలవరపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా లో 400 వరకు కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా అయిదు మండలాల్లో పాజిటివ్‌ల తీవ్రత అధికంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనాకు వచ్చింది. దీంతో రోజురోజుకు కాకినాడ జీజీహెచ్‌కు కొవిడ్‌ బాధితులు పెరుగుతున్నారు. గతవారం వరకు పది మంది వరకు ఇన్‌పేషెంట్లు గా చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 25కు పెరిగింది. ప్రస్తుతం జీజీహెచ్‌లో 172 మంది కొవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ పడకలపై ఉన్నారు. వీరందరికీ శ్వాస సమస్యలు ఎక్కువగా ఉండడంతో వైద్యం కొనసాగుతోంది. దీనికితోడు కాకినాడ జేఎన్టీయూ మహిళా వసతిగృహంలో మంగళవారం నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌ సోకింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆగమేఘాలపై వీరికి వసతిగృహంలో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. ఒకరకంగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో మళ్లీ కేసులు క్రమేపీ పంజా విసరుతున్నాయి. అటు గ్రామాల్లోను పాజిటివ్‌లు ఎక్కువవుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే బ్లాక్‌ఫంగస్‌ కేసులు కూడా పంజా విసురుతున్నాయి. కొవిడ్‌ బారిన పడ్డ వారిలో 395 మందికి ఇది వ్యాపించింది. వీరిలో ఇంతవరకు 61 మంది కన్నుమూశారు. గడచిన ఒక రోజులో నలుగురు ఈవ్యాధి బారిన పడ్డారు. 60 మందికి ఇంకా జీజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులను నియంత్రించకపోతే పరిస్థితి సెకండ్‌ వేవ్‌ తరహాలో చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నట్టు తాజాగా అధికారులు గుర్తించారు. మరోవైపు శ్రావణమాసం ప్రారం భం కానుండడంతో ఈనెల 11వ నుంచి పెద్దఎత్తున వివాహాలకు ముహూర్తాలు ఉన్నందున అనుమతుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ హరికిరణ్‌ మంగళవారం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇంతపెద్ద జిల్లాలో వివాహాలకు భారీగా అతిథులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పేర్కొ న్న 150 మందే హాజరయ్యేలా చూడాలని సూచించారు. అయితే ఈ సంఖ్య కూడా చాలా ఎక్కువని, దీన్ని మరింత తగ్గించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేలా మాట్లాడతానని పేర్కొన్నారు. అటు కేసులు ఎక్కువ ఉన్న చోట్ల కంటైన్మెంట్‌ జోన్లలో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు పాజిటివ్‌ వచ్చిన ఇంటి వద్ద స్టిక్కర్లు అతికించాలని ఆదేశించారు. ప్రస్తుత ఇది కొనసాగుతున్నా మరింత పక్కాగా అమలు చేయాలన్నారు. తద్వారా కాంటాక్ట్‌ కేసులు తగ్గుతాయని పేర్కొన్నారు. అటు మాస్క్‌లు లేకుండా తిరిగే వారిపైనా, గుంపులుగా తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని పోలీసుశాఖను ఆదేశించారు. సెకండ్‌ వేవ్‌లో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. అనేకమంది బాధితులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా పడక దొరకలేదు. దీంతో అనేకమంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో యాభై పడకలకు మించి ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులకు సమీపంలో ఏదైనా ప్రభుత్వ భవనంలో ట్రాన్సిట్‌ ఆసుపత్రుల కింద పడకలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

బ్లాక్‌ ఫంగస్‌ కేసులూ.. ఆందోళనకరం

జీజీహెచ్‌(కాకినాడ)ఆగస్టు3: బ్లాక్‌ఫంగస్‌ కేసులు చాపకిందనీరులా పెరుగుతున్నాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మంగళవారానికి 395కు చేరుకోగా, ఇప్పటిదాకా వారిలో 61 మంది మృత్యువాతపడ్డారు. బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఇప్పటివరకూ 222 శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అలాగే పూర్తిగా కోలుకున్న 243 మంది డిశ్చార్జ్‌అయ్యి ఇళ్లకు వెళ్లినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి తెలిపారు. 

పాజిటివిటీ పెరుగుతోంది..అప్రమత్తంగా ఉండాలి!

కాకినాడ సిటీ, ఆగస్టు 3: కేరళ, మహారాష్ట్రలలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో, అలాగే జిల్లాలోని కొన్ని మండలాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున అప్రమత్తతతో వ్యవహరించాలని, మండల, డివిజన్‌ స్థాయిలో వారానికి కనీసం రెండుసార్లు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని కోర్టు హాల్‌ నుంచి వర్చువల్‌ విధానంలో జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, ఎ.భార్గవ్‌తేజ్‌, జిల్లా స్థాయి అధికారులతో కలిసి మండల, డివిజనల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖలు సమన్వయంతో వ్యవహరించి కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలన్నారు. కొవిడ్‌ నిబంధలు ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల సహకారంతో జరిమానా విధింపులు జరిగేలా చూడాలన్నారు. 50, ఆ పైన పడకలున్న కొవిడ్‌ ఆసుపత్రులకు అనుబంధం గా ట్రాన్సిట్‌ ఆసుపత్రుల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. 10 తర్వాత ముహూర్తాలు ఉన్నందున వివాహాలకు తహశీల్దార్‌ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, 150 కంటే ఎక్కువమంది వివాహ కార్యక్రమానికి హాజరుకా కుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్‌.సత్తిబాబు, సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, డీపీవో ఎస్‌వీ, నాగేశ్వర్‌ నాయక్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాధ్‌, మెప్మా పీడీ కె.శ్రీరమణి, జేడీ ఎన్‌.విజయ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ వీరేశ్వరప్రసాద్‌ పాల్గొన్నారు.