ప్రతిసారీ ఈ సాకులేంటి..? YS Jagan సర్కార్‌పై హైకోర్టు సీరియస్

ABN , First Publish Date - 2021-08-04T19:24:51+05:30 IST

వైఎస్ జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది...

ప్రతిసారీ ఈ సాకులేంటి..? YS Jagan సర్కార్‌పై హైకోర్టు సీరియస్

అమరావతి : వైఎస్ జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. బుధవారం నాడు ఉపాధి హామీ పథకం బిల్లులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ విచారణలో ప్రభుత్వాధికారులు పలు విషయాలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల మాటలు విన్న హైకోర్టు.. ప్రభుత్వం ప్రశ్నల వర్షం కురిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,794 కోట్లకుగానూ 413 కోట్లు చెల్లించామన్న ఏపీ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే.. కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని డిఫెన్స్ న్యాయవాదులు చెప్పారు. పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.


జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..!

అసలు పూర్తి డేటాతో అధికారులు ఎందుకు రాలేకపోతున్నారని ఏపీ హైకోర్టు నిలదీసింది. అధికారులంతా హాజరుకావాలని చెప్పినా ఒకరు ఎందుకు రావడంలేదని న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ప్రతిసారి సాకులు చెప్పడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మీటింగ్ అని ఒకసారి, ఆర్బిటేషన్ అని మరోసారి న్యాయవాది సాకులు చెప్పడంపై కోర్టు కన్నెర్రజేసింది.!. మీరు (న్యాయవాది) చెప్పే సాకులు కౌంటర్‌లో కూడా లేవని ధర్మాసనం పేర్కొన్నది. ఏపీ ప్రభుత్వం ఇలానే చేస్తే సీరియస్‌గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది.


20% ఏం చేస్తున్నారు..!?

ప్రతి బిల్లులో 20శాతం ఎందుకు మినహాయిస్తున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. మినహాయించిన డబ్బును ఎక్కడ ఉంచుతున్నారు?.. అసలు ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని ధర్మాసనం నిలదీసింది. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇదే పరిస్థితి మాత్రం పునారవృతమైతే ఉపేక్షించబోమని విచారణ చివర్లో మరోసారి హైకోర్టు హెచ్చరించింది. అనంతరం ఈ విచారణను ఆగస్టు 18కి కేసును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Updated Date - 2021-08-04T19:24:51+05:30 IST