Apr 11 2021 @ 11:40AM

మళ్ళీ థియేటర్లలో 50శాతం నిబంధన

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా గత యేడాది కాలంగా సినిమా థియేటర్లు మూసివేశారు. గత యేడాది మార్చి నెలలో మూసివేసిన థియేటర్లను గత నవంబరు నెలలో తెరిచారు. ఆ సమయంలో థియేటర్లకు వచ్చి సినిమాలను వీక్షించే ప్రయాణికులు కనిపించలేదు. కానీ, సంక్రాంతికి ‘మాస్టర్‌’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘మాస్టర్‌’ సినిమా చూసేందుకు థియేటర్‌కు ప్రేక్షకులు క్యూకట్టారు. ఆ తర్వాత పలు చిత్రాలు విడుదలయ్యాయి. కానీ వాటికి ప్రేక్షకులు లేక పలు షోలను కూడా రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీన కార్తీ హీరోగా నటించిన ‘సుల్తార్‌’ విడుదలైంది. అలాగే, గత శుక్రవారం ధనుష్‌ హీరోగా నటించిన ‘కర్ణన్‌’ చిత్రం విడుదలైంది. ఈ రెండు చిత్రాలకు మంచి పాజిటివ్‌ టాక్‌ లభించింది. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తున్నారు. 

ఇంతలోనే రాష్ట్రంలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా పలు ఆంక్షలు విధించారు. అలాంటివాటిలో ఒకటి థియేటర్లలో సినిమాలను కేవలం 50 శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శించాలన్న నిబంధన. ఈ నిబంధన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మున్ముందు తేలనుంది. ఒకవైపు కరోనా, మరోవైపు సరైన సినిమాలు లేక థియేటర్లు బోసిబోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన మరిన్ని కష్టాలకు లోనుచేసేలావుంది.