అగాధాల్లో ప్రజాస్వామ్య ఆరాటాలు

ABN , First Publish Date - 2021-01-26T07:00:18+05:30 IST

రాజకీయ స్వేచ్ఛకు సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యాలు తోడయినప్పుడే మన ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. 1949 నవంబర్ 25న రాజ్యాంగసభలో...

అగాధాల్లో ప్రజాస్వామ్య ఆరాటాలు

రాజకీయ స్వేచ్ఛకు సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యాలు తోడయినప్పుడే మన ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. 1949 నవంబర్ 25న రాజ్యాంగసభలో డాక్టర్ అంబేడ్కర్ ఇలా ఉద్ఘాటించారు: ‘1950 జనవరి 26న వైరుధ్యాల జీవితంలోకి మనం ప్రవేశించనున్నాం. రాజకీయాల్లో మనకు సమత్వం ఉంటుంది. సామాజిక, ఆర్థిక జీవితంలో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో గుర్తింపు పొందిన సూత్రం: ఒక మనిషి- ఒక ఓటు; ఒక్క ఓటు- ఒక విలువ. మన సామాజిక, ఆర్థిక జీవితంలో మన సామాజిక, ఆర్థిక వ్యవస్థల కారణంగా ఒక మనిషి- ఒక విలువ అనే సూత్రాన్ని అంగీకరించకపోవడం కొనసాగుతోంది. మనం ఇలా ఎంతకాలం వైరుధ్యాల జీవితాన్ని గడపాలి? ఎంతకాలం సామాజిక ఆర్థిక జీవితాల్లో సమానతను తిరస్కరిస్తూ బతకాలి? ఇలా దీర్ఘకాలం తిరస్కరిస్తూ ఉంటే మన రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ అసమానతలను మనమంతా సమైక్యమై వీలైనంత త్వరలో రూపుమాపకపోతే ఈ సాంఘిక, ఆర్థిక అసమానతల ద్వారా బాధింపబడే ప్రజానీకంలో సహనం నశించిపోయి వారు తిరుగుబాటు చేయడం తప్పదు. ఒకవేళ అలాంటిదే సంభవిస్తే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి మనం నిర్మించిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ తునాతునకలైపోతుంది’.


సామాజిక, ఆర్థిక జీవితంలో సమానత్వాన్ని నెలకొల్పడమే భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. సర్వత్రా జాతి సమతుల్య పురోగతికి దోహదం చేసే రాజ్య పాలనాపద్ధతిని నిరంతరం అనుసరించేందుకు సామాజిక, ఆర్థిక సమత్వాలు తప్పనిసరి అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ నిర్దేశించారు. మరి మన ప్రజాస్వామ్య గతిశీలత ఎలా ఉంది? రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే దేశ పాలన సాగుతోందా? ఈ అంశాలను నిశితంగా పరీక్షించుకోవాల్సిన సమయమిది. అంతేకాదు, సరైన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడంలో దేశ పౌరుల పరిణతిని కూడా మూల్యాంకనం చేయవలసిన అవసరముంది. ‘విలువల ఆధారిత రాజకీయాలను మన రాజకీయపార్టీలు త్యజించాయి. ఏ విధంగానైనా సరే అధికారాన్ని సాధించుకుని, నిలుపుకోవడమే వాటి లక్ష్యమైపోయింది. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సైతం అవకాశవాద రాజకీయాలు తప్పించుకోగలుగుతున్నాయంటే మన రాజకీయాల్లో విలువల పాటింపు ఎంత అల్పంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న పార్టీలు, నాయకులు ఏ చట్టాన్ని అయినా సరే తమకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. 


కొవిడ్ మహమ్మారితో దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైపోయింది. కోట్లాది ప్రజలు ఉద్యోగాలు, ఉపాధులను కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పూనుకోవడం సమంజసమేనా? పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఏముంది? సభ్యుల సంఖ్య పెరిగినంత మాత్రాన చర్చల స్థాయి మెరుగుపడుతుందా? ఇప్పటికే అర్థవంతమైన చర్చలు చారిత్రక స్మృతులుగా మిగిలాయి. ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. వివేచనారహితంగా దుర్భాషలకు పాల్పడుతున్నారు. అధికార వ్యవస్థలో భాగంగా కొనసాగేందు కోసం పార్టీ అధినేతలకు భజనపరులవుతున్నారు. ప్రజలకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని తర్కించడమే లేదు. జనాకర్షక నేతల పట్ల అపరిమిత ఆరాధనా భావాన్ని ప్రజల మనస్సుల్లో నెలకొల్పుతున్నారు. రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ చేసిన మరో హెచ్చరికను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుంది. ‘ఇండియాలో భక్తి లేక ఆరాధన లేక వీరపూజ రాజకీయాలలో పాలు పంచుకుంటోంది. ఈ భక్తి ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రపంచంలో మరే దేశ రాజకీయాల్లోనూ దానికి సమానమైన ప్రభావం ఉండదు. మతంలో భక్తి, మోక్ష మార్గమవచ్చేమో కానీ రాజకీయాల్లో ఆరాధన నియంతృత్వానికి దారితీసే బాట’. వివేచన కోల్పోయిన ప్రజలు సరైన నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతారు? ఈ ధోరణులు కొనసాగితే మన ప్రజాస్వామ్యం సమున్నతమవుతుందా?


సమాజంలోని దుర్బలవర్గాల వారిపై దాడులు, దౌర్జన్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. పాలకులు సంకుచిత వైఖరులను విడనాడడం లేదు. సమర్థపాలన అందించడంలో విఫలమవుతున్నారు. కాలం చెల్లిన చట్టాల ప్రభావంతో ప్రజలు సంప్రదాయాలకు భిన్నంగా, స్వేచ్ఛాయుత ఆలోచనలు చేయలేకపోతున్నారు. ప్రజలు తమకు తాముగా ఎదిగేందుకు రాజకీయ పక్షాలు తోడ్పడడం లేదు. ఎంతసేపూ వారు తమపై ఆధారపడిఉండేలా చేయడమే పాలక, ప్రతిపక్షాల లక్ష్యంగా ఉంది. మరి సమాజంలోని అట్టడుగువర్గాలలో వ్యవస్థాపనా సామర్థ్యం ఎలా వృద్ధి చెందుతుంది? నిర్వహణా నైపుణ్యాలు కొరవడినవారు ఆర్థిక అభ్యున్నతిని ఎలా సాధించగలుగుతారు? అట్టడుగువర్గాల వారికి ఆర్థిక సమానత్వాన్ని సమకూర్చడమనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. తక్షణ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వని దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారానే నిజమైన ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుంది. అయితే రాజకీయపార్టీలు దుర్బలవర్గాల వారిని తమ ఓటు బ్యాంకులుగా మాత్రమే పరిగణించడం పరిపాటి అయిపోయింది పన్నుల రూపేణా ప్రజలు చెల్లించే సొమ్మును సంక్షేమ కార్యక్రమాల పేరిట విచక్షణారహితంగా వ్యయపరుస్తున్నారు. దీనివల్ల సదరు ప్రజలకు నిజమైన సంక్షేమం సమకూరకపోగా ఆర్థికవ్యవస్థ మొత్తంగా నష్టపోతోంది. దేశానికి ఇదేమంత శుభస్కరం కాదు. 


మన స్వతంత్ర ప్రస్థానం ప్రజాస్వామ్య బాటలో సాగాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ విషయంలో మన జాతి ఏ విధమైన పురోగతిని సాధించిందో నిర్థారించేదెవరు? ప్రజలను చైతన్యపరిచి, అధునాతన ఆర్థిక కార్యకలాపాలలో, నవీన సామాజిక రీతుల్లో పరిపూర్ణ భాగస్వాములు అయ్యేలా వారిని తీర్చి దిద్దేదెవరు? రాజకీయ స్వార్థపరత్వాన్ని అదుపుచేసేదెవరు? ఇవన్నీ బృహత్తర బాధ్యతలు. అవి సమస్త దేశ పౌరుల కర్తవ్యాలు. మరీ ముఖ్యంగా ఆ విధ్యుక్త ధర్మనిర్వహణలో ‘మీడియా’ ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ‘ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలనకు వార్తాపత్రికలే ప్రాథమిక ప్రాతిపదికలు’ అని అంబేడ్కర్ అన్నారు. ప్రజలను చైతన్యపరిచే బాధ్యతలను పత్రికలు సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా వర్ధిల్లుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రతి పౌరుడూ ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశ పురోగతిలో పౌరులందరూ భాగస్వాములు అయినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుంది. వృద్ధిరేటు వెంపర్లాటలో సమాజంలోని అట్టడుగువర్గాల వారి అభ్యున్నతిని నిర్లక్ష్యం చేస్తే అసమానతలు పెచ్చరిల్లిపోవడం ఖాయం. ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థాయికి అధిరోహించగల సామర్థ్యాలను చరిత్ర వంచితులైన అభాగ్యులకు సమకూర్చడమే జాతి సాధించే సమస్త విజయాలకు ప్రామాణికం కావాలి. సామాజిక అవరోధాలను రూపుమాపి, సమున్నత లక్ష్యాల దిశగా జాతి సంఘటితమయ్యేందుకు దోహదం చేసే చట్టాల నిర్మాణం మాత్రమే అంబేడ్కర్ ఆశించిన, నిర్దేశించిన రాజ్యపాలనా పద్ధతికి తార్కాణమవుతుంది.

డాక్టర్ ఆలూరి సుందర్ కుమార్ దాస్

విశ్రాంత ఐపిఎస్ అధికారి

Updated Date - 2021-01-26T07:00:18+05:30 IST