ఏజీ ప్రెస్‌మీట్‌ దుస్సంప్రదాయం

ABN , First Publish Date - 2020-05-31T08:46:20+05:30 IST

‘న్యాయ నిపుణుడు(ఏజీ) హైకోర్టు తీర్పుపై విలేకరుల సమావేశం పెట్టడం తన 40 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా చూస్తున్నానని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఏజీ ప్రెస్‌మీట్‌ దుస్సంప్రదాయం

  • హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ మీడియా సమావేశమా?: యనమల

అమరావతి, హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): ‘న్యాయ నిపుణుడు(ఏజీ) హైకోర్టు తీర్పుపై విలేకరుల సమావేశం పెట్టడం తన 40 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా చూస్తున్నానని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హైకోర్టు తీర్పులో పేర్కొన్న స్టాండ్‌ రీస్టోర్డ్‌ అనే పదాన్ని ప్రస్తావిస్తూనే దానికి వక్రభాష్యాలు వల్లించడం దారుణం. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని నియమించేది గవర్నర్‌. అలాంటిది ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. గవర్నర్‌ ఇచ్చిన ఆర్డినెన్స్‌ 5ను కొట్టివేసింది. ఆర్డినెన్స్‌ తర్వాత ఇచ్చిన 617,618,619  జీవోలను కూడా రద్దు చేసింది. కొత్త ఎన్నికల ప్రధానాధికారి జీవో 619 కూడా రద్దయింది. ఆర్డినెన్స్‌ 5 రద్దయిన తక్షణం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ విధుల్లోకి వచ్చినట్లు. అలాంటి దాన్ని కూడా వక్రీకరించడం ద్వారా తిమ్మిని బమ్మిని చేయాలని ఏజీ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ దురుద్దేశాలను ఏజీ ద్వారా చెప్పించాలనే తాపత్రయం కనిపిస్తోంది. స్టాండ్‌ రీస్టోర్డ్‌ అంటే ఆటోమేటిక్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి పదవిలోకి తెచ్చినట్లే. ఇవి ఏజీకి తెలియనివి కావు. ఈసీకి  సహకరించవద్దని ప్రభుత్వం ఎలా చెప్తుంది? హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌ ఎలా పెడతారు? ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదా?’ అని యనమల ప్రశ్నించారు.


వింతగా ఏజీ వాదన: సీపీఐ నారాయణ

కాగా, నిమ్మగడ్డ విషయంలో అడ్వకేట్‌ జనరల్‌ వాదన వింతగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఓ ప్రకటనలో విమర్శించారు. ‘హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నట్లే కదా! ఇదే విషయాన్ని ప్రకటిస్తే అది కోర్టు ధిక్కరణ ఎలా అవుతుంది? హైకోర్టు తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయే హక్కు ఉంది. అయితే, ఇంతలోనే అడ్వకేట్‌ జనరల్‌ సహనం కోల్పోయి వ్యవహరిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు.

Updated Date - 2020-05-31T08:46:20+05:30 IST