గుంతకల్లులో మొట్టమొదటి సీఎన్‌జీ స్టేషన్‌ను ప్రారంభించిన ఏజీ అండ్ పి ప్రథమ్

ABN , First Publish Date - 2022-05-04T01:17:31+05:30 IST

దేశంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో అగ్రగామి సంస్థ అయిన ఏజీ అండ్ పి ప్రథమ్ అనంతపురం

గుంతకల్లులో మొట్టమొదటి సీఎన్‌జీ స్టేషన్‌ను ప్రారంభించిన ఏజీ అండ్ పి ప్రథమ్

గుంతకల్లు:  దేశంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో అగ్రగామి సంస్థ అయిన ఏజీ అండ్ పి ప్రథమ్ అనంతపురం జిల్లా గుంతకల్లులో హెచ్‌పీసీఎల్ సహకారంతో దేవి దేవేంద్ర ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించింది. జిల్లాలో ఇది నాలుగో సీఎన్‌జీ స్టేషన్. సీఎన్‌జీకి ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ఓ మెగా సీఎన్‌జీ ఎక్సేంజ్‌ మేళాను నిర్వహించింది.


దీనిద్వారా అనంతపూర్‌ జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ఆటోలను సీఎన్‌జీ ఆటోలుగా అతి తక్కువ  ధరలో మార్చుకునే అవకాశం కల్పించింది. తమ ఆటోలను సీఎన్‌జీలుగా మార్చుకోవడం ద్వారా నెలకు దాదాపు రూ. 10 వేలకు ఆదా అవుతుందని సంస్థ తెలిపింది. మేళాలో భాగంగా ఆటో డ్రైవర్లకు రూ. 15వేల విలువైన ప్రయోజనాలను అందించింది.


సీఎన్‌జీ ద్వారా చేకూరే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘గ్రీన్‌ వీల్స్‌ ఆన్‌ సీఎన్‌జీ’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. హనుమాన్‌ సర్కిల్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ గుంతకల్లు నగరంలో 5 కిలోమీటర్ల మేర జరిగింది.  ఓఈఎం డీలర్‌షిప్స్‌ అయిన బజాజ్‌, పియాజ్జియో, మారుతీ సుజుకీ వంటి వాటి సహకారంతో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో అనంతపురం ఎంపీ డాక్టర్ టి. రంగయ్య, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు వై.వెంకటరామిరెడ్డి, ఏజీ అండ్ పి ప్రథమ్ రీజనల్ హెడ్ జీఏ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ఏజీ అండ్ పి ప్రథమ్ రీజనల్ హెడ్ వెంకటేష్ మాట్లాడుతూ.. సీఎన్‌జీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గుంతకల్లులో సీఎన్‌జీ స్టేషన్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. సీఎన్‌జీతో వాహన యజమానులకు ఆర్థిక ప్రయోజనం లభించడంతోపాటు పెరిగిపోతున్న కాలుష్యానికి  చెక్ పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో ఏజీ అండ్ పి నెట్‌వర్క్ వ్యాపించి ఉందన్నారు. ఏపీలో  అనంతపూరం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.  

Read more