యూఎస్ ఇమ్మిగ్రేషన్‌పై 17 రాష్ట్రాలు దావా!

ABN , First Publish Date - 2020-07-14T22:57:47+05:30 IST

అమెరికాలో ఆన్‌లైన్ ద్వారా క్లాసులకు హాజరయ్యే అంతర్జాతీయ విద్యార్థులు దే

యూఎస్ ఇమ్మిగ్రేషన్‌పై 17 రాష్ట్రాలు దావా!

వాషింగ్టన్: కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు పూర్తిగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మారితే అంతర్జాతీయ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మార్గదర్శకాలపై అమెరికాలోని రెండు ప్రముఖ యూనివర్సిటీలు కోర్టులో దావా వేయగా.. ఇప్పుడు మరో 17 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెక్కాయి. మశాచూసెట్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో ఈ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూటమి ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా దావా వేశాయి. అంతర్జాతీయ విద్యార్థులను దేశం నుంచి పంపించేయాలని యూఎస్ ఇమ్మిగ్రేషన్ తీసుకున్న నిర్ణయం క్రూరమని, చట్టవ్యతిరేకమైన చర్య అని 17 రాష్ట్రాలు కోర్టుకు తెలిపాయి. కొలరాడో, కనెక్టికట్, డెలవేర్, ఇల్లినోయి, మేరీల్యాండ్, మశాచూసెట్స్, మిచిగాన్, మిన్నెసొటా, నెవాడా, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, ఆరెగాన్, పెన్సిల్ వేనియా, రోడ్ ఐల్యాండ్, వెర్మాంట్, వర్జీనియా, విస్కాన్సిన్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలలోని అటార్నీ జనరల్స్ కూటమిగా ఏర్పడి కోర్టులో దావా వేయడం జరిగింది. 


ట్రంప్ ప్రభుత్వం బలవంతంగా స్కూళ్లను, యూనివర్శిటీలను తెరిపించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఇప్పటికే అమెరికాలోని అనేక రాష్ట్రాలు, యూనివర్సిటీలు ఆరోపిస్తూ వచ్చాయి. దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరిచేలా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తామని ట్రంప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్‌ నూతన విధానం అమెరికా అర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని, ఈ విధానాన్ని తాము అంగీకరించబోమని అమెరికా చట్ట సభల సభ్యులు థామ్సన్‌, కథ్లీన్‌ రైస్‌ సైతం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క భారత వీదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఇదే అంశంపై యూఎస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ స్టేట్‌ సెక్రటరీ డేవిడ్‌ హేల్‌తో ఇటీవల ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. భారతీయ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతామని డేవిడ్‌ హేల్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-14T22:57:47+05:30 IST