విస్తృత సంప్రదింపుల తర్వాతే ‘అగ్నిపథ్’ ప్రకటన : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-06-18T20:53:40+05:30 IST

అగ్నిపథ్ పథకం (Agnipath Scheme)పై నిరసనలు తీవ్రమవుతుండటంతో

విస్తృత సంప్రదింపుల తర్వాతే ‘అగ్నిపథ్’ ప్రకటన : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం (Agnipath Scheme)పై నిరసనలు తీవ్రమవుతుండటంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. మాజీ సైనికులతో సహా అనేక మందితో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ పథకాన్ని ప్రకటించామని చెప్పారు. కేవలం రాజకీయ కారణాలతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 


రాజ్‌నాథ్ సింగ్ ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో శనివారం మాట్లాడుతూ, సైనికుల నియామక ప్రక్రియలో ఈ పథకం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. ఈ పథకం క్రింద రక్షణ దళాల్లో నియమితులయ్యేవారికి శిక్షణ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని చెప్పారు. దీని గురించి తప్పుడు భావాలను కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది కొత్త పథకం కాబట్టి కొందరికి అయోమయంగా ఉండి ఉండవచ్చునని తెలిపారు. 


దాదాపు రెండేళ్ళపాటు మాజీ సైనికులతోపాటు అందరితో చర్చించిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఏకాభిప్రాయంతో ఈ పథకాన్ని ప్రకటించినట్లు చెప్పారు. దేశం పట్ల ప్రజలకు క్రమశిక్షణ భావం ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. రాజకీయ ఆలోచనలతో ఈ పథకంపై కొన్ని నిరసన కార్యక్రమాలు జరుగుతుండవచ్చునన్నారు. ఏ రాజకీయ పార్టీనైనా చెడుగా చూపించేందుకు అనేక అంశాలు ఉండవచ్చునని తెలిపారు. అయితే మనం చేసే రాజకీయాలు ఏమైనప్పటికీ, అవి దేశం కోసమేనని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా రాజకీయ పార్టీలు చేసే రాజకీయాలు దేశం కోసమేనని తెలిపారు. 


దేశంలోని సైనికుల ఆత్మస్థయిర్యం క్షీణించేలా చేద్దామా? అని ప్రశ్నించారు. ఇది న్యాయం కాదన్నారు. ఈ పథకం క్రింద నియమితులైనవారికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారామిలిటరీ దళాలు చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాల్లో కూడా వీరికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అగ్నివీర్ అంటే రక్షణ దళాల్లోకి కొత్తవారిని తీసుకురావడం మాత్రమే కాదని, వారికి ప్రస్తుతం సైనికులకు ఇస్తున్న నాణ్యమైన శిక్షణతో సమానమైన శిక్షణను ఇస్తామని చెప్పారు. శిక్షణాకాలం తక్కువ అయినప్పటికీ, నాణ్యత విషయంలో రాజీ ఉండబోదని వివరించారు. 


అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత రూ.11.71 లక్షల చొప్పున ఇవ్వడం గురించి మాట్లాడుతూ, వారు కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటే, అవసరమైన రుణం తక్కువ వడ్డీ రేటుతో లభించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. నాలుగేళ్ళ సర్వీసు పూర్తయిన తర్వాత వీరికి ఉపాధి లభించే విధంగా పథకాలను తమ ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. 


అగ్నిపథ్ పథకంలో భాగంగా రక్షణ దళాల్లో నియమితులయ్యేవారిని అగ్నివీరులని పిలుస్తారు. సైనిక సిబ్బంది సగటు వయసును తగ్గించడం, జీతాలు, పింఛన్ల బిల్లులను తగ్గించుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలనే విమర్శలు వస్తున్నాయి. 


Updated Date - 2022-06-18T20:53:40+05:30 IST