విడాకుల తర్వాత...మెలిండా పయనం ఎటువైపు?

ABN , First Publish Date - 2021-05-15T05:30:00+05:30 IST

మెలిండా గేట్స్‌! మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సతీమణిగా ప్రపంచానికి ఈమె సుపరిచితం. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట గుడ్‌ బై చెప్పడంతో, విడిపోయిన తర్వాత మెలిండా పయనం ఎటు వైపు? అని ప్రపంచమంతా ఆలోచనలో పడింది

విడాకుల తర్వాత...మెలిండా పయనం ఎటువైపు?

మెలిండా గేట్స్‌! మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సతీమణిగా ప్రపంచానికి ఈమె సుపరిచితం. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట గుడ్‌ బై చెప్పడంతో, విడిపోయిన తర్వాత మెలిండా పయనం ఎటు వైపు? అని ప్రపంచమంతా ఆలోచనలో పడింది. కానీ బిల్‌తో  విడాకులు మెలిండాను బిలియనీర్‌ను చేశాయి. ఆ డబ్బును ఆవిడ ఎలా వెచ్చించే అవకాశాలు ఉన్నాయో, మున్ముందు మెలిండా ఎలాంటి కార్యక్రమాలతో బిజీగా ఉండబోతున్నారో ప్రపంచ ప్రఖ్యాత వార్తాసంస్థ సి.ఎన్‌.ఎన్‌  కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. 


‘‘ఎంతో మధనపడి, ఎన్నో సమాలోచనలు చేసి, అంతిమంగా మేం విడిపోవడానికి నిశ్చయించుకున్నాం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మకంగా, ఆరోగ్యవంతంగా ఎదిగేలా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా తోడ్పడ్డాం. దంపతులుగా విడిపోయినా బిల్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను జంటగానే కొనసాగిస్తాం.’’ అంటూ గేట్స్‌ దంపతులు తమ విడాకుల నిర్ణయాన్ని అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ వార్తతో ప్రపంచ దృష్టి హఠాత్తుగా మెలిండా గేట్స్‌ మీదకు మళ్లింది. విడాకుల తర్వాత ఆవిడ ఎటు వైపు అడుగులేస్తారనే ఆలోచనలూ మొదలయ్యాయి. అయితే అత్యంత ధనికుడైన బిల్‌ గేట్స్‌తో విడిపోయిన తర్వాత కూడా మెలిండా ధనికురాలే!


మిలియన్ల కొద్దీ డాలర్లు!

విడాకులు తీసుకున్న వెంటనే బిల్‌ పెట్టుబడి పెట్టిన కాస్కేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి మెలిండాకు 2.4 బిలియన్‌ డాలర్లు సెక్యూరిటీ రూపంలో అందాయి. వాటికి తోడు ఆటో నేషన్‌, కెనడియన్‌ నేషనల్‌ రైల్వే కంపెనీల నుంచి 16.95 మిలియన్ల షేర్లు ఆమెకు దక్కాయి. వీటి విలువ ఏకంగా 309 మిలియన్ల డాలర్లు. ఇవి కాకుండా బిల్‌ మెలిండాకు మెక్సికోకు చెందిన కోకొకోలా ఫెమ్సా నుంచి 25.8 మిలియన్ల షేర్లు, మెక్సికన్‌ బ్రాడ్‌కాస్టర్‌ గ్రూపోటెలివీసా నుంచి 155.4 మిలియన్ల షేర్లు పంచాడు. వీటి మొత్తం విలువ 406 మిలియన్‌ డాలర్లు. ఇలా విడాకుల తర్వాత షేర్లు బదిలీ జరిగే ఏర్పాటు, ఈ దంపతుల విడాకుల ఒప్పందంలోనే ఉండి ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే కేవలం బిల్‌ గేట్స్‌తో వివాహం జరగడం వల్లనే మెలిండా ప్రపంచం దృష్టిలో పడిందనుకుంటే పొరపాటు. బిల్‌ గేట్స్‌ సతీమణిగా అంతులేనంత ఆస్థిని దక్కించుకోగలిగినా, దాతృత్వం, సేవా నిరతిలో ఆమె పెళ్లికి ముందు నుంచీ ధనికురాలే! దృఢమైన వ్యక్తిత్వం కలిగిన మెలిండా కంప్యూటర్‌ కెరీర్‌లో ఎదిగిన తీరు, దాతృత్వం, సేవా ధృక్పథాలను చాటుకున్న వైనం సమస్తం ఎంతో ఆసక్తికరం.


ఆ జంటను సాఫ్ట్‌వేర్‌ కలిపింది!

మెలిండా ఆన్‌ ఫ్రెంచ్‌! టెక్సాస్‌లో పుట్టిన మెలిండా 14 ఏళ్ల వయసులోనే కంప్యూటర్‌ విద్య పట్ల ఆసక్తి పెంచుకుని, కంప్యూటర్‌ గేమ్స్‌, బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ల మీద పట్టు సాధించింది. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ సాధించి, ఎమ్‌బిఎ ముగించి ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ మొదలుపెట్టిన మెలిండా అంతిమంగా మైక్రోసాఫ్ట్‌లో స్థిరపడింది. ఆ క్రమంలో 1987లో, న్యూయార్క్‌లో ఓ ట్రేడ్‌ ఫెయిర్‌లో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన మెలిండాకు బిల్‌ గేట్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రణయంగా మారి, 1994లో ఇద్దరూ వైవాహిక బంధంతో ఒకటయ్యారు. పెళ్లికి ముందు నుంచే మహిళల అభ్యున్నతి, స్వావలంబనల గురించి గళాన్ని స్పష్టంగా వినిపిస్తూ వచ్చిన మెలిండా, అందుకు తోడ్పడే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పెళ్లి తర్వాత బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు నడిపించారు. 


మహిళల స్వయం స్వావలంబన!

స్త్రీపురుషుల సమానత్వం గురించి తన అభిప్రాయాలను స్పష్టంగా, ముక్కుసూటిగా వ్యక్తం చేసే మెలిండా మహిళల స్వయంస్వావలంబన కోసం నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నారు. స్త్రీపురుషుల మధ్య కొనసాగుతున్న నిర్మాణాత్మక అసమానత్వాన్ని రూపుమాపడం కోసం, 2015లో పివోటల్‌ వెంచర్స్‌ అనే ఇంక్యుబేషన్‌ కంపెనీని స్థాపించారామె. ఈ కంపెనీ ద్వారా ప్రజా సేవలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు తోడ్పాటు అందించడంతో పాటు, మహిళోద్ధారణకు తోడ్పడే అంశాలకు చేయూతనందించారు. ప్రపంచంలో పేదరికం అంతం కావాలంటే, మహిళలకు కాంట్రాసెప్టివ్స్‌ అందుబాటులో ఉండాలని కూడా మెలిండా బలంగా వాదించారు. 


కొవిడ్‌ - 19 వ్యాక్సిన్‌!

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్‌ పాండమిక్‌ వ్యాప్తికి బ్రేక్‌ పడాలంటే వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరిన మెలిండా.. కేవలం ధనిక దేశాలకే వ్యాక్సిన్‌ పరిమితమైతే, వ్యాధి ఎంత త్వరగా అదుపులోకి వస్తుందో, అంతే త్వరగా తిరగబెట్టడం ఖాయమని కూడా అభిప్రాయపడ్డారు. కాబట్టి మున్ముందు మెలిండా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటయ్యే పలు కార్యక్రమాల్లో పాల్గొనే వీలూ లేకపోలేదు.

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST