స్టే తరువాత?

ABN , First Publish Date - 2021-01-13T06:41:03+05:30 IST

రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు మంగళవారం నాడు...

స్టే తరువాత?

రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు మంగళవారం నాడు తాత్కాలికంగా నిలిపివేసింది. సమస్యకు పరిష్కారం కనుగొనడానికి నలుగురు వ్యవసాయరంగ నిపుణులతో ఒక కమిటీని నియమించింది. ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సోమవారం నాడే అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ ప్రతిపాదనలలో కమిటీ ఏర్పాటుకు సుముఖత ప్రకటించిన ప్రభుత్వం, చట్టాలపై స్టేను వ్యతిరేకించింది. అమలు నిలుపుదలను స్వాగతించిన రైతు సంఘాలు, కమిటీ ద్వారా సంప్రదింపులను వ్యతిరేకిస్తున్నాయి. బహుశా, గణతంత్ర దినోత్సవం నాడు తలపెట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌తో సహా రైతుల నిరసన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగే అవకాశమే ఎక్కవగా కనిపిస్తోంది. 


నెలన్నరకు పైగా సాగుతున్న రైతాంగ ఉద్యమం విషయంలో సుప్రీంకోర్టు జోక్యానికి ఉన్న పరిమితులు, డిమాండ్ల విషయంలోను, పరిష్కార ప్రయత్నాలలోను ప్రభుత్వ వైఖరి ఈ సందర్భంగా చర్చలోకి వస్తున్నాయి. నిలకడగా తాము చేస్తున్న పోరాటానికి లభించిన సంకేతాత్మక గుర్తింపుగా సుప్రీంకోర్టు ‘స్టే’ ను రైతులు పరిగణిస్తున్నారు. అదే సమయంలో, ఈ మొత్తం పరిణామాలు తాము అనుసరిస్తున్న దృఢవైఖరిని సడలింపజేయడానికి ఉపయోగపడతాయోమోనని ఉద్యమకారులు సందేహిస్తున్నారు. ఎడతెగని చర్చల ప్రక్రియలోకి దారిమళ్లించి, దేశరాజధాని వీధుల నుంచి తమను తరిమివేస్తారేమోనన్న భయం కూడా వారికి ఉన్నది. స్టే ఇవ్వడంలో సుప్రీంకోర్టు సత్సంకల్పాన్ని గుర్తిస్తూనే, వ్యవసాయ చట్టాలకు గట్టి సమర్థకులైన నలుగురితో కమిటీని ఏర్పాటు చేయడంపై అసంతృప్తి ప్రకటిస్తున్నారు. 


నిజానికి, ఈ చట్టాల విషయంలో సుప్రీంకోర్టు చేయగలిగింది చాలా తక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను సమూలంగా మార్చివేసిన సందర్భాలలో కూడా రాజ్యాంగ బద్ధతకు ఎటువంటి లోటూ లేకపోయింది. అనేక కీలక విధాన నిర్ణయాలు సైతం కేవలం పరిపాలనా సంబంధమైనవిగా పరిగణన పొందుతున్నాయి. ప్రభుత్వం చేసే శాసనాలను మదింపు వేసేటప్పుడు న్యాయస్థానాలు, ఆ శాసనాలను ఆమోదించడంలో రాజ్యాంగ విహిత ప్రక్రియలను అనుసరించారా లేదా అన్న ప్రశ్నను, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నదా లేదా అన్న ప్రశ్నను మాత్రమే అధికంగా పరిశీలిస్తారు. వాటిని మించి రాజ్యాంగ స్ఫూర్తిని, నైతికతను కూడా పరిగణనలోకి తీసుకుని తీర్పులు ఇచ్చిన చారిత్రాత్మక సందర్భాలు స్వతంత్ర భారత చరిత్రలో లేకపోలేదు కానీ, దురదృష్టవశాత్తూ, అతి సమీప గతంలో అటువంటి అరుదైన విశేషాలు నమోదుకాలేదు. ఆశించడం కూడా కష్టతరమవుతున్నది. ఇప్పుడు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు, అంతిమంగా చట్టాలను రద్దుచేయగలదా? బహుశా, చేయలేదు. ప్రజాస్వామికమైన ప్రక్రియను అనుసరించకపోయినప్పటికీ, సాంకేతికంగా అన్ని పద్ధతులూ పాటించిన తరువాతనే చట్టాల ఆమోదం జరిగింది. దేశంలోని ఏ రంగాన్ని అయినా ప్రైవేటీకరించడాన్ని గానీ, కార్పొరేటీకరించడాన్ని గానీ రాజ్యాంగ వ్యతిరేకమనలేము. అయినా, సుప్రీంకోర్టు ఎందుకు కల్పించుకున్నది? కమిటీని నియమించకుండా తమను ఎవరూ ఆపలేరని భీషణంగా ప్రకటించవలసిన అగత్యమేమిటి? సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ఎటువంటి ప్రతిపత్తి ఉంటుంది? కమిటీ సిఫార్సులను అమలుచేసి తీరవలసిన కట్టుబాటు ప్రభుత్వానికి ఉంటుందా? ఇవన్నీ ప్రశ్నలు. 


సోమవారం నాటి విచారణ సందర్భంగా, ఆందోళనకారులను వారు బైఠాయించిన చోటు నుంచి జరపడం గురించిన ప్రస్తావన కూడా సుప్రీంకోర్టు చేసింది. కరోనా వ్యాప్తి, వాతావరణం, ఆందోళనకారుల మరణాలు వంటి అనేక అంశాలను న్యాయస్థానం ప్రస్తావించింది. తాను సమస్యను స్వీకరించి, పరిష్కారప్రయత్నం చేస్తున్నది కాబట్టి, ఆందోళనకారులు తమ సూచనలు పాటించి, స్వస్థలాలకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం చెబుతుందా? అట్లా చెప్పినప్పుడు ఉద్యమకారులు దానిని శిరసా వహిస్తారా? 


సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించినట్టు, కేంద్రప్రభుత్వం రైతుల ఆందోళనతో మొదటి నుంచి సవ్యంగా వ్యవహరించడం లేదు. చట్టాలను వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదని చెబుతూ, మరో పక్క సంప్రదింపులను నిర్వహించింది. పదే పదే చర్చలకు పిలిచి, ఉద్యమప్రతినిధుల సహనాన్ని క్షీణింపజేయాలన్నది ఒక వ్యూహం కావచ్చు. మరొకవైపు, ఉద్యమంపై, ఉద్యమ లక్ష్యాలపై ప్రజలలో అనుమానాలు కలిగేవిధంగా ప్రచారం చేయడం మరో ఎత్తుగడ. ఉద్యమశిబిరాల్లో ఖలిస్తానీ తీవ్రవాదులు, మావోయిస్టులు ఉన్నారని అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు, సామాజిక మాధ్యమాలలో కూడా ఈ ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ ఖలిస్తానీ ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన సమాచారంతో బుధవారం నాడు తమకు నివేదిక సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ప్రభుత్వ గూఢచారి విభాగం రూపొందించే ఈ నివేదికకు న్యాయస్థానం ఎంతటి విలువ ఇస్తుంది? దాని ఆధారంగా ఎటువంటి చర్య తీసుకుంటుంది? 


ఇంతకాలం ఓపికగా, దీక్షతో ఉద్యమిస్తున్న తమను చెదరగొట్టి బలహీనపరిచే ప్రయత్నాలను అంగీకరించబోమని, సుప్రీంకోర్టు కమిటీతో చర్చల వల్ల ప్రయోజనం లేదని రైతునాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎట్లా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతున్నది.

Updated Date - 2021-01-13T06:41:03+05:30 IST