Srilanka తర్వాత.. సంక్షోభం అంచున ఈ 12 దేశాలు..

ABN , First Publish Date - 2022-07-17T21:41:12+05:30 IST

శ్రీలంకేయులు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం(Financial Crisis)తో నరకం అనుభవిస్తున్నారు. పిల్లలు తాగే పాలు కూడా కొనలేని దుస్థితి అక్కడి జనాల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది

Srilanka తర్వాత.. సంక్షోభం అంచున ఈ 12 దేశాలు..

ఇంటర్నెట్ డెస్క్ : శ్రీలంకేయులు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం(Financial Crisis)తో నరకం అనుభవిస్తున్నారు. పిల్లలు తాగే పాలు కూడా కొనలేని దుస్థితి అక్కడి జనాల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇక పెట్రోల్, డీజెల్ కొందామన్నా దొరికే పరిస్థితే లేదు. అందుకే జనాల ఆవేదనలోంచి కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఆందోళన-నిరసన రూపం దాల్చింది. అయితే శ్రీలంకలో కనబడుతున్న ఈ దారుణ సంక్షోభ పరిస్థితులు మరికొన్ని దేశాలను వణికిస్తున్నాయి. మితిమీరిన అప్పులు, ద్రవ్యోల్బణం, బాండ్లపై చెల్లింపులతోపాటు ఇతర కారణాలు 12 దేశాలను ఆర్థిక సంక్షోభం నిలిపాయి. సంక్షోభం కత్తి వేలాడుతున్న ఆ దేశాలేంటి.. అక్కడున్న పరిస్థితులపై ఓ లుక్కేద్దాం..


పాకిస్తాన్..

ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్(Pakistan) ఈ వారమే ఐఎంఎఫ్‌(IMF)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ సకాలంలో జరగలేదు. దీంతో పాక్‌కి ఆర్థిక కష్టాలు తప్పేట్టు లేవు. ఇంధన ధరలు కొండెక్కడం దాయాది దేశాన్ని సంక్షోభం అంచున నిలిపింది. చెల్లింపులు కూడా కష్టంగా మారిపోయాయి. ఆదాయంలో 40 శాతం అప్పులపై వడ్డీల చెల్లింపులకే సరిపోతుండడంతో వ్యయాలను కూడా తగ్గించుకోవాల్సి వస్తోంది. పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 9.8 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. ఈ నిల్వలు కేవలం వారంరోజుల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఇక పాకిస్తాన్ రూపీ కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది.


అర్జెంటీనా

తీసుకున్న అప్పు చెల్లించలేని అతిపెద్ద దేశంగా అర్జెంటీనా(Argentina) నిలవబోతోందని చెప్పాలి. ఆ దేశానికి ఉన్న అప్పులు ఆ స్థాయిలో ఉండడం దీనికి కారణం. అర్జెంటీనా కరెన్సీ ‘పెసో’ సగానికి సగం పతనమైంది. నిధులు అడుగంటిపోయాయి. ప్రభుత్వ బాండ్లు విలువ భారీగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో 2024 వరకు ప్రభుత్వాన్ని నడిపించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. పౌరుల ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)ను సాయం కోరాలని అర్జెంటీనాలో శక్తివంతమైన నేత, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టీనా ఫెర్నాండెజ్ డీ కిర్చెనర్ భావిస్తున్నారు. ఎంతవరకు సహకారం అందుతుందో వేచిచూడాలి.


ఉక్రెయిన్..

రష్యా దాడితో ఉక్రెయిన్(Ukraine) దాదాపు సంక్షోభంలోకి జారుకున్నట్టే. దాడుల తాలుకా దారుణమైన పరిస్థితులతోపాటు 20 బిలియన్ డాలర్ల వరకు అప్పు చెల్లించాల్సి ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ వంటి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు లెక్కలు కట్టాయి. వచ్చే సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ 1.2 బిలియన్ డాలర్ల బాండ్ పేమెంట్లు చేయాల్సి ఉంది. సహాయక నిధులు, రిజర్వులతో చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రభుత్వాన్ని నడిపించడం క్లిష్టంగా మారడం ఖాయమనే విశ్లేషణలున్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లపాటు అప్పుల చెల్లింపులను పక్కనపెట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది.


ట్యూనీషియా :

ఆఫ్రీకా దేశాల్లో అత్యధికం ఐఎంఎఫ్ వద్ద చేయి చాచేవే. అయితే ట్యూనీషియా(Tunisia) పరిస్థితి డేంజర్ బెల్స్ మోగించే స్థాయిలో ఉంది. 10 శాతం లోటు బడ్జెట్‌తో కొనసాగుతోంది. ప్రభుత్వరంగ వేతన బిల్లులు భారీగా ఉన్న దేశాల్లో ట్యూనీషియా ఒకటి. ప్రభుత్వంపై పట్టు కోసం అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ సాయం అందించడమూ అనుమానమే. ప్రభుత్వ బాండ్ చెల్లింపులు కూడా ఆ దేశాన్ని భయపెడుతున్నాయి.


ఘనా..

మితిమీరిన అప్పులు ఘనా(Ghana) జీడీపీలో 85 శాతంగా ఉన్నాయి. ఆ దేశ కరెన్సీ ‘సెడి’ ఈ ఒక్క ఏడాదే పావు భాగం క్షీణించింది. పన్ను ఆదాయంలో సగానికిపైగా అప్పులపై వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 30 శాతానికి సమీపించింది.


ఈజిప్ట్..

ఈజిప్ట్ (Egypt) అప్పులు జీడీపీలో ఏకంగా 95 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది తీవ్ర నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఈజిప్ట్ ఒకటి. ఈ ఏడాది విదేశాల నుంచి దాదాపు 11 బిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నట్టు సమాచారం. రానున్న 5 ఏళ్లలో మొత్తం 100 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉంటుందని అంచనాగా ఉంది.


కెన్యా..

కెన్యా (Kenya) ఆదాయంలో 30 శఆతం వడ్డీలు చెల్లించేందుకు సరిపోతోందని లెక్కలు చెబుతున్నాయి. కెన్యా ప్రభుత్వ బాండ్లు కూడా దాదాపు సగం విలువను కోల్పోయాయి. క్యాపిటల్ మార్కెట్లలో ఈ కరెన్సీకి అవకాశమే లేకుండా పోయింది. 2024లో 2 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉండడం పెద్ద సవాలుగా మారనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


ఇథియోపియా..

ఇథియోపియా(Ethiopia) అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. వీటిని చెల్లించేందుకు జీ20 కామన్ ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రామ్ కింద మరిన్ని అప్పులు చేయాలని భావిస్తోంది. 1 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ బాండ్లు చెల్లించాల్సి ఉండడం కూడా ఆ దేశాన్ని భయపెడుతోంది.


ఎల్ సాల్వేడార్..

బిట్‌కాయిన్‌ చెల్లింపులని చట్టబద్ధం చేసిన ఎల్ సాల్వేడార్(El Salvador) ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆరు నెలల వ్యవధిలో 800 బిలియన్ డాలర్ల బాండ్ మెచ్యూరిటీ చేయాల్సి ఉండడంతో ఐఎంఎఫ్‌పైనే ఆశలు పెట్టుకుంది. 


బెలారస్, ఈక్వెడార్, నైజీరియా..

బెలారస్(Belarus), ఈక్వెడార్(Ecuador), నైజీరియా(Nigeria) ఈ మూడు దేశాలపై కూడా అప్పుల కుప్పలు పేరుకుపోయాయి. బెలారస్ రష్యా ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఇక ఈక్వెడార్ రెండేళ్లక్రితమే దివాళీ తీసింది. ఆ తర్వాత అనూహ్యంగా కోలుకుంది. నైజీరియాను అప్పులతోపాటు బాండ్ చెల్లింపులు ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్నాయి.

Updated Date - 2022-07-17T21:41:12+05:30 IST