సెకండ్ వేవ్ తర్వాత.. భారతీయులకు స్వాగతం పలుకుతున్న దేశాలు ఇవే!

ABN , First Publish Date - 2021-06-25T21:49:13+05:30 IST

సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి భారత్‌పై విరుచుకుపడటంతో ప్రపంచ దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశాయి. అయి

సెకండ్ వేవ్ తర్వాత.. భారతీయులకు స్వాగతం పలుకుతున్న దేశాలు ఇవే!

న్యూఢిల్లీ: సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి భారత్‌పై విరుచుకుపడటంతో ప్రపంచ దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సెకండ్ వేవ్ నుంచి ఇండియా క్రమంగా కోలుకుంటోంది. దీంతో పలు దేశాలు భారత ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రయాణికులను అనుమతిస్తున్న దేశాలవైపు ఓలుక్కేస్తే..



రష్యా.. 

పర్యాటక రంగంపై దృష్టిపెట్టిన రష్యా ఇటీవలే విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. రష్యాకు వెళ్లే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ‌పీసీఆర్ టెస్టు చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. ఆంటిబాడీ టెస్ట్ చేయించుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని రష్యా స్పష్టం చేసింది. 



టర్కీ..

ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన ప్రయాణికులను టర్కీ తమ దేశంలోకి అనుమతిస్తోంది. ప్రయాణికులు అక్కడి చేరుకున్న తర్వాత 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా టర్కీ వెళ్లిన ప్రయాణికులను మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా అక్కడి అధికారులు కోరవచ్చు.



ఐస్‌లాండ్..

కొవిడ్ కేసులతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రయాణికులకు ఐస్‌లాండ్ స్వాగతం పలుకుతోంది. కొవిడ్ బారినపడి కోలుకున్న వారు.. వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రవీకరణ పత్రాన్ని పొందిన ప్రయాణికులు వారు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపాల్సిన అవసరం లేదని ఐస్‌లాండ్ చెప్పింది. ఐలాండ్ చేరుకున్న తర్వాత ప్రయాణికులందరికీ కొవిడ్ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రయాణికులు ఐదురోజులపాటు క్వారెంటైన్‌లో ఉన్న తర్వాత కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్ వస్తే.. ప్రయాణికుల క్వారెంటైన్ గడువు ముగిసినట్టే అని ఐస్‌లాండ్ వెల్లడించింది. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. భారత ప్రయాణికులు కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టైతే.. నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపాల్సిన అవసరం లేదు. 



సెర్బియా..

భారత ప్రయాణికులను తమ దేశాలకు అనుమతిస్తున్న దేశాల జాబితాలో సెర్బియా కూడా ఉంది. అయితే.. ప్రయాణానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని సెర్బియా వెల్లడించింది. 



ఈజిస్ట్..

ఈజిప్ట్ కూడా ఐలాండ్‌ తరహా నిబంధనలనే అమలు చేస్తోంది. ప్రయాణానికి 72 గంటల ముందు పొందిన కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను ప్రయాణికుల నుంచి కోరుతోంది. ఈజిప్ట్ చేరుకున్న ప్రయాణికులు మళ్లీ టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ రిపోర్ట్ వచ్చే వరకు క్వారెంటైన్‌లోకి వెళ్లాల్సి రావొచ్చు.



ఉజ్బెకిస్థాన్..

ప్రయాణానికి 72 గంటల ముందు నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన టూరిస్ట్‌లకు ఉజ్బెకిస్థాన్ స్వాగతం చెబుతోంది. ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ప్రయాణికులు 14 రోజులపాటు క్వారెంటైన్ తప్పనిసరి.



ఆఫ్గనిస్థాన్..

ప్రయాణానికి 72 గంటల ముందు నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన భారత ప్రయాణికులు తమ దేశంలోకి ప్రవేశించడానికి ఆఫ్గనిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లో కొవిడ్ విజృంభణ కారణంగా కొన్ని వారాలపాటు ఆ ప్రాంతం వైపు వెళ్లొద్దని ప్రయాణికులకు సూచిస్తోంది. 



దక్షిణాఫ్రికా..

ఇతర దేశాలు కోరుతున్నట్టే దక్షిణాఫ్రికా కూడా ప్రయాణికుల నుంచి ప్రయాణానికి 72 గంటల ముందు పొందిన నెగెటివ్ సర్టిఫికెట్ కోరుతోంది. ఎవరైనా సర్టిఫికెట్‌ను చూపించనట్టైతే.. సదరు ప్రయాణికులు సొంత ఖర్చుతో స్వీయనిర్భంధంలో ఉండాల్సి ఉంటుంది.



కోస్టారీకా..

నెగెటివ్ సర్టిఫికెట్ కానీ.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను కానీ అడగకుండానే సెంట్రల్ అమెరికాలోని కోస్టారీకా దేశం.. భారత ప్రయాణికులను అనుమతిస్తోంది. అయితే కోస్టారీకా‌కు వెళ్లిన తర్వాత ప్రయాణికులు హెల్త్‌పాస్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. 



మారిషస్.. 

మారిషస్ వెళ్లాలనుకునే ప్రయాణికులు మరికొంత కాలం ఆగాల్సిందే. జూలై 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించేందుకు మారిషస్ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. కొవిడ్ టెస్ట్, 14 రోజుల క్వారెంటైన్ నిబంధనను మారిషస్ అమలు చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-06-25T21:49:13+05:30 IST