Abn logo
Jul 27 2020 @ 00:43AM

కేశవరెడ్డి రచనలు చదివాక మా వూరు కొత్తగా పరిచయమైంది.


పలకరింపు : పేరూరు బాలసుబ్రహ్మణ్యం


అటూ బార- ఇటు బార- ఇంత చిన్నిల్లుంటుందా అనిపించే రేకులిల్లు- ఒకరికి ముగ్గురు బిడ్డలు- ఇరుకు బతుకు... ఈ ఉక్కపోత జీవితానికి అవిటితనం... సొంత బతుకూ, చుట్టూ అంగలారుతున్న బతుకులూ కలిసి.. ఒక వ్యక్తిని రచయితగా నిలబెడతాయని చెప్పే పేరూరు బాలసుబ్రమణ్యం...


తిరుపతి నగరంలో పుట్టి పెరిగిన మీరు ‘మడకెద్దులు’ అంటూ అచ్చుపల్లెటూరి కథ రాయడమేంటి?

దీనిమీద ఎంతైనా చెప్పవచ్చు. నేను యాభైల్లోకి వస్తున్నా. 1970ల్లో తిరుపతే ఒక పల్లెటూరు. ఇప్పుడంటే నేను పుట్టిన ‘కొరమేనుగుంట’ను తిరుపతి కలిపేసుకుంది. అప్పుడు మా వూరు అచ్చంగా పల్లెటూరు. మా నాయినే దుక్కిటెద్దులతో సేద్యం చేసేవాడు. నగర వాసన తెలీని వూరు మాది. నారు పెరకడం, కలుపు తీయడం, వరికోత... అన్నీ తెలుసు. చిన్న ప్పుడే పోలియో సోకడం వల్ల మడక దున్నలేకపోయే వాణ్ణి. 

మీ బాల్యం గురించి కాస్త...

అవిటివారి బాల్యం నరకతుల్యం. నాకూ అంతే. వూళ్లో బళ్లో చిన్నా పెద్దా ‘కుంటి కులాసం ఇంటికి మోసం’ అని ఆట పట్టించేవాళ్లు. పెద్దవాళ్లనైతే నేనూ తిరగబడి తిట్టేసేవాణ్ణి- పచ్చిబూతులు. వాళ్లు నవ్వుకునేవాళ్లు. అయితే పిల్లల్ని తిరిగి తిడితే వాళ్లు కొట్టేవాళ్లు. నేను బలహీనుణ్ణి- తిరిగి కొట్టలేను గాబట్టి తోటి పిల్లలంటే భయం. మూడో తరగతిలో బడి మానేస్తే.. మా అమ్మ నన్ను చంకనేసుకుని దినామూ బడిలో వదిలి వచ్చేది. తర్వాత రోజూ మూడు కిలో మీటర్లు నడిచెళ్లి తిరుపతి టి.పి.పి.ఎమ్‌ హైస్కూల్లో చదివాను. ఈ చెరలో పడి పది మూడుసార్లు తప్పాను. నాలుగోసారి ఎప్పుడూ కొట్టని మా నాయిన కానగ బెత్తంతోకొట్టి ‘‘ఎట్టా కుంటోడివి. తిరమల కొండ మెట్ల మింద కుచ్చోని అడుక్కు తిను’’ అని తిట్నాడు. అప్పట్లో వికలాంగుడైనా ఏ రాయితీలు వుండేవి కావు ఫీజుల్లో. మా అమ్మ ముక్కు పుడక కుదవ పెట్టి ఫీజు కట్టింది. అంతే ఆ తర్వాత ఎప్పుడూ ఫెయిలవ లేదు... డిగ్రీ పూర్తి చేశా సైకిల్‌ మీదెళ్లి... ఎమ్మే తెలుగు దూరవిద్య. 


సాహిత్యంలోకి రావడం- ‘చిత్తూరు కథ’ లాంటి పెద్ద సంకలనానికి సంపాదకత్వం.. వీటి గురించి? 

డిగ్రీ చదివేటప్పుడు పిచ్చి పిచ్చి కవితలు రాశాను. అవి లాభంలేదని తర్వాత ‘కోల్పోయిన ప్రపంచం’లాంటి పనికి మాలిన కథలు రాశాను. తర్వాత్తర్వాత కేశవరెడ్డిలాంటి వారి రచనలు చదివాక- మా వూరు కొత్తగా పరిచయమైంది. మడకెద్దులు, గాలెమ్మ, కోడిగుడ్డు పొరుటు లాంటి గ్రామీణ జీవితాన్ని ప్రతిఫలించే కథలు రాశాను. ఇంకా ముందు ముందు ‘కొరమేను గుంటోడి కతలు’ అని రాయాలని వుంది. 


‘చిత్తూరు కథ’ సంకలనం తీసుకురావాలన్న సంకల్పాన్ని సాకం నాగరాజ గారితో చెప్పగానే ఆయన ముందు చదవ మన్నారు. అట్లా చదివి నన్ను నేను మెరుగుపరుచుకుంటూ.. పుట్టాపెంచల్‌దాసు ముఖచిత్రంతో చాలా అందంగా ‘చిత్తూరు కథ’ సంకలనం తీసుకువచ్చాను. ఆ పుస్తకం బాగా అమ్ముడై నాకు కాస్త గుర్తింపు తెచ్చింది కూడా...


తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శిగా మీ కార్యక్రమాలు...

చిత్తూరు జిల్లాలో చాలా చేశాం... ముఖ్యంగా హైస్కూల్‌ పిల్లల్లో కాలేజీ పిల్లల్లో... శ్రీశ్రీ మీద చిన్న పుస్తకాన్ని పదివేల ప్రతులు వేసి... చదివించాం... పిల్లల కోసం చాలా కథల పుస్తకాలు తీసుకెళ్లి లీజరు పీరిడ్స్‌లో చదివించాం...

నేను సొంతంగా.. వికలాంగులకు అంటూ కొన్ని హక్కు లున్నాయని వికలాంగులను కలిసి అవగాహన కల్పిస్తున్నాను. త్వరలోనే ‘మడకెద్దులు’ పేరిట కథా సంకలనం తీసుకొస్తాను.

98492 24162


Advertisement