ఓటీటీ సినిమాలు తర్వాత, త్రిపుల్ ఐటీ పరిస్థితి చూడండి!

ABN , First Publish Date - 2022-08-03T06:27:49+05:30 IST

తరగతి గదుల్లోనే దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని కొఠారి కమీషన్‌ చెప్పింది. మరి ఆ చదువులను బోధించే విద్యాలయాలు మృత్యుకుహరాలుగా, సమస్యల నిలయాలుగా మారితే ఎలా...

ఓటీటీ సినిమాలు తర్వాత, త్రిపుల్ ఐటీ పరిస్థితి చూడండి!

తరగతి గదుల్లోనే దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని కొఠారి కమీషన్‌ చెప్పింది. మరి ఆ చదువులను బోధించే విద్యాలయాలు మృత్యుకుహరాలుగా, సమస్యల నిలయాలుగా మారితే ఎలా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం ఐఐఐటి బాసర. అందులో చదువుతున్న విద్యార్థులు రెండువేల మంది కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. అలా దవాఖాన పాలైన విద్యార్థులను నిజామాబాద్‌లో పరామర్శించాను. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తినడానికి మంచి ఆహారం కూడా అందించడం లేదు. కానీ కొద్దిరోజుల క్రితం తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి లండన్‌ వెళ్ళడానికి రాత్రికి రాత్రే 13కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసిఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క యూనివర్సిటీని సందర్శించలేదు. యూనివర్సిటీల బలోపేతానికి కృషి చేయలేదు. అందుకు సరిపడ బడ్జెట్‌ కూడా కేటాయించలేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు అన్ని సమస్యలకు నిలయాలుగా మారాయి. తమ విద్యాలయంలోని సమస్యలను నెరవేర్చాలని గతనెలలో 15 రోజుల పాటు బాసర ఐఐఐటీ విద్యార్థులు ధర్నా చేస్తే, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి, విద్యార్థుల పోరాట డిమాండ్లను సిల్లీ డిమాండ్లని విద్యార్థుల ఉద్యమాన్ని అవమానపరిచారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో– గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో అత్యధిక మార్కులు సంపాదించిన వారికి నాణ్యమైన ఉచిత ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఈ ఐఐఐటీలు స్థాపించబడ్డాయి. తెలంగాణ, ఆంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాల్లో మూడు ఐఐఐటీలు ప్రారంభించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఐఐటీ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఆదరణకు నోచుకోక సమస్యల నిలయంగా మారింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ ఐఐఐటీలు అద్భుతంగా కొనసాగుతూ మరో రెండింటి ఏర్పాటుతో సంఖ్యాపరంగా ఐదుకు చేరాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం ఇంకా ఎక్కువగా బడ్జెట్‌ కేటాయింపులు చేసుకుని అభివృద్ధి చేసుకోవచ్చునని కన్న కలలు ఏమీ నెరవేరలేదు. పైగా యూనివర్సిటీ ప్రమాణాలు అత్యంత దీనస్థితికి చేరాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఐటి బాసరకు కేటాయింపులు రూ.80 కోట్లు కాగా సొంత రాష్ట్రంలో కేటాయింపులు రూ.20 కోట్లు మాత్రమే! పైగా ఈ కేటాయించిన బడ్జెట్‌ కూడా విడుదల కాకపోవటంతోనే విద్యార్థులు చేసేదేమి లేక నిరసన కార్యక్రమాలను చేపట్టి న్యాయంకోసం పోరాడారు.


ఒక్కసారి ముఖ్యమంత్రి తమ యూనివర్సిటీకి రావాలని, వీసీని నియమించాలని, ఫుడ్‌ కాంట్రాక్టర్‌ను మార్చాలని, బోధనా సిబ్బందిని నియమించాలని, చదువుకోవడానికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని... ఇలాంటి న్యాయమైన చిన్నచిన్న కోరికలు నెరవేర్చాలని కోరారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థుల డిమాండ్లను చులకనగా చూసి అనుమానించారు. మీడియాను లోపలికి అనుమతించకుండా అణిచివేయాలని చూశారు. అయినా సరే విద్యార్థులు వెనకడుగు వేయలేదు. కేవలం సోషల్‌ మీడియాను ఉపయోగించి విస్తృతంగా ప్రచారం చేస్తూ, రాత్రనక పగలనక వానలు సైతం లెక్కచేయకుండా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచారు. ప్రభుత్వం దిగి వచ్చింది. కంటితుడుపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. డైరెక్టరును నియమించి రూ.20కోట్లు ఇస్తామని ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. విద్యార్థులను పట్టించుకోలేదు. ఇచ్చిన హామీలు, చేసిన కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులకు ఉన్నత విద్య, నాణ్యమైన ఆహారం, మంచి సౌకర్యాలు అందించడం ఏమాత్రం ఇష్టం లేదు.


గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెరికల్లాంటి పేద విద్యార్థులు ఉద్యోగాలు చేయకుండా, విదేశాలకు వెళ్లకుండా తిరిగి వాళ్ల తల్లిదండ్రుల వలె కూలిపనులు చేసుకుని బతకాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి విద్యాశాఖా మంత్రి యూనివర్సిటీకి వచ్చి వెళ్లి ఇరవైరోజులైనా గడవకముందే, విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. అయినా కనీసం ముఖ్యమంత్రి నోట మాట రాలేదు. విద్యార్థులు ఫుడ్‌ కాంట్రాక్టరును మార్చాలని ముందే హెచ్చరించినా యాజమాన్యం పట్టించుకోలేదు. నాణ్యతలేని గడువు ముగిసిన వస్తువులు, వంట సామాగ్రి వాడడం వల్ల ఆహారం కలుషితమైంది. అనారోగ్యానికి గురైన పిల్లలను చూడడానికి వచ్చిన తల్లితండ్రులను కూడా అనుమతించకుండా గేటు దగ్గరనే ఆపింది ప్రభుత్వం. కానీ ఇదే ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడానికి, రాష్ట్రపతి అభ్యర్థి వస్తే హైదరాబాద్‌ నగరం నిండా ప్రచార హోర్డింగ్‌లు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడలేదు.


ప్రభుత్వాన్ని విద్యార్థులు ఎంత వేడుకున్నా రూపాయి కూడా ఖర్చు చేయకపోవడానికి కారణం ఏంటో అర్థం చేసుకోవాలి. పుట్టినరోజు నాడు వరాలు కురిపించే నాయకులు పిల్లలకు తిండి కూడా పెట్టకపోవడం ఏం న్యాయం? పక్క రాష్ట్రాలకు అడగకుండానే కోట్లు పంచి, అడిగినా సరే యూనిఫాం ఇవ్వకపోవడం ఏం పాలన? తెలంగాణ ప్రభుత్వానికి విద్యావస్థను బలోపేతం చేసి, మేధావులను తయారుచేయాలనే ఉద్దేశ్యం లేదు. ఇటీవల నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) విడుదల చేసిన విద్యాసంస్థల జాబితాలో తెలంగాణకు చెందిన ఒక్క యూనివర్సిటీ కూడా టాప్‌ 10లో లేకపోవడం చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. యూనివర్సిటీలను ఉత్తమంగా తీర్చిదిద్దడం పక్కన పెట్టి, విద్యార్థులు హక్కులకై పోరాడితే ఏదో విధంగా అణచివేసి అరెస్టులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం తీవ్ర నిరాశలో, ప్రభుత్వంపై కోపంతో ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు యూనివర్సిటీలలో అడుగుపెట్టడం లేదు.


తాజాగా ఐఐఐటి బాసర యూనివర్సిటీ విద్యార్థులు సెల్‌ ఫోన్‌ వాడడాన్ని యాజమాన్యం నిషేధించింది. టెక్నాలజీ సంబంధిత ఐఐఐటీలో మొబైల్‌ వాడకాన్ని నిషేధించడమేంటి? ఒకవేళ నిషేధిస్తే ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించారా? విద్యార్థులకు క్యాంపస్‌లో కనీసం ఇంటర్నెట్‌, వైఫై సౌకర్యం లేదు. మొబైల్‌ డాటాతో చదువుకోవాలనుకుంటే, హాస్టల్‌ నుండి మెయిన్‌ గేటు వరకు రావాల్సిందే. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్‌ వాడకాన్ని నిషేధిస్తే విద్యార్థులు ఎలా చదువుకోవాలి? సరిపడా బోధనా సిబ్బంది లేకుండా, ఆన్‌లైన్‌ సౌకర్యాలు ఇవ్వకుండా, మొబైల్‌ కూడా లేకపోతే, ఈ డిజిటల్‌ కాలంలో విద్యార్థుల చదువు సాగేదెలా? సోషల్‌ మీడియా ద్వారా ప్రచారమయ్యే ఉద్యమాలను అణచివేయాలనే లక్ష్యం కోసం విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయడం ఏం న్యాయం? గాయపడిన మంత్రికి ఓటీటీలో సినిమాలు చూడడానికి ఉన్నంత కుతూహలం, విద్యార్థుల, పేదల బతుకులు చూడడానికి ఎందుకు ఉండడం లేదు? ఎందుకంటే ఈ పేదలు, విద్యార్థులు బాగుపడితే పాలకులకు ఒరిగేదేం లేదు. అందుకనే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అందమైన హామీలు ఇచ్చి, ప్రలోభ పెట్టి ఓట్లేయించుకొని గెలిచిన తర్వాత ముఖం చాటేస్తారు. గత డెబ్బై సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది.  


నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న విద్యార్థులు తిరిగి ఏదో ఒక రోజు మళ్లీ నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని భయపడి యాజమాన్యం విద్యార్థులను సెలవుల పేరుతో ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నది. విష ఆహారం తిని అనారోగ్యం బారిన పడిన విద్యార్థుల్లో వరంగల్లుకు చెందిన ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు.


అందుకే ఇలాంటి మోసపూరిత రాజకీయాల నుండి, దోపిడి దొంగల నుండి బహుజనులకు విముక్తి కల్పించి తమ హక్కులను తామే అమలు పరుచుకునే రాజ్యాధికారాన్ని ఇవ్వడానికే బహుజన్‌ సమాజ్‌ పార్టీ వచ్చింది. బాసర విద్యార్థులకు మొదటి నుండి అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే. వానలో కూడా వెళ్లి నేను ఆ విద్యార్థులను పరామర్శించి, వారి దుస్థితిని కళ్లారా చూశాను. పాలకులు చేస్తున్న ఈ స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి, సమాన అవకాశాల తెలంగాణను సాధించుకుందాం రండి. బహుజన విద్యార్థులను బతికించుకుని, విశ్వవిజ్ఞానులుగా ఎదగనిద్దాం రండి. విద్య కోసం ఉద్యమించడం కాదు, అది మన ప్రాథమికహక్కు అని లాక్కుందాం రండి. బహుజనుల విద్యార్థులు ప్రమాదంలో ఉన్నా పట్టించుకోని ఆధిపత్య వర్గాల పార్టీల విషకౌగిలి నుండి బయటపడి బహుజనరాజ్యం సాధించుకుందాం.


డా. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌

రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ–తెలంగాణ

Updated Date - 2022-08-03T06:27:49+05:30 IST