విమాన ప్రమాదం.. క్యాన్సర్.. కరోనా.. అన్నిటిని జయించి సెంచరీ కొట్టిన బామ్మ

ABN , First Publish Date - 2020-11-25T05:21:54+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారిని

విమాన ప్రమాదం.. క్యాన్సర్.. కరోనా.. అన్నిటిని జయించి సెంచరీ కొట్టిన బామ్మ

లండన్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారిని అనేక మంది జయించి కోట్లాది మందికి ప్రేరణగా నిలిచారు. ముఖ్యంగా 70 నుంచి 100 ఏళ్ల వయసున్న వృద్దులు కరోనాతో పోరాడి విజయం సాధించారు. ఇలా విజయం సాధించిన వారిలో యూకేకు చెందిన జాయ్ ఆండ్రూ కూడా ఒకరు. ఇప్పుడు జాయ్ ఆండ్రూ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నామంటే.. ఈమె ఒక్క కరోనాను మాత్రమే కాదు.. నాజీ హత్యాయత్నం నుంచి, విమాన ప్రమాదాన్ని, బ్రెస్ట్ క్యాన్సర్‌ను కూడా జయించి తాజాగా వందో పుట్టినరోజును జరుపుకున్నారు. 1920లో ఉత్తర లండన్‌లో జాయ్ ఆండ్రూ జన్మించారు. రెండో ప్రపంచయుద్దం జరుగుతున్న సమయంలో ఓ నాజీ ఆమె ప్రయాణిస్తున్న కారులో బాంబు పెట్టాడు. అయితే ఈ ప్రమాదంలో జాయ్ ఆండ్రూ గాయాలతో బయటపడ్డారు. 


రెండో ప్రపంచ యుద్దం తరువాత జాయ్ ఆండ్రూ బ్రిటిష్ ఓవర్సీస్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారు. ఒక రోజు ఆమె ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. లిబ్యాలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక ప్యాసెంజర్ ప్రాణాలు కోల్పోగా.. సిబ్బంది మొత్తం ప్రాణాలతో బయటపడ్డారు. 1970లలో జాయ్ ఆండ్రూ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే క్యాన్సర్‌ను కూడా ఆమె జయించారు. జాయ్ ఆండ్రూ భర్త 2013లో క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఇక ఈ ఏడాది మే నెలలో జాయ్ ఆండ్రూ కరోనా బారిన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్ కావడంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు.


జాయ్ ఆండ్రూ బతకడం కష్టమని అటు వైద్యులు, ఇటు కుటుంబసభ్యులు ఒక నిర్థారణకు వచ్చేశారు. పుట్టినప్పటి నుంచి ఎన్నో సార్లు చావును ఎదురుగా చూసిన జాయ్ ఆండ్రూకు కరోనా పెద్ద సమస్య అనిపించలేదు. కరోనా మహమ్మారితో పోరాడి విజయం సాధించారు. తాజాగా ఆమె పుట్టి వందేళ్లు కావడంతో.. ఆమె కుటుంబసభ్యులు ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరిపారు. నేర్చుకోవాలే కాని తన తల్లి జీవితం ఓ పుస్తకమని జాయ్ ఆండ్రూ కూతురు మిషెల్ ఆండ్రూ(57) చెబుతున్నారు.

Updated Date - 2020-11-25T05:21:54+05:30 IST