ఆస్తి పంపకాల సమయంలో తండ్రి తనకు అన్యాయం చేశాడనే కారణంతో ఓ కొడుకు కసాయిలా ప్రవర్తించాడు. కన్న తండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తండ్రిని చంపాననే బాధ అతడిని దహించింది. దీంతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
షాబాద్‌కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి తన తండ్రి బుద్షేన్ (55)ను ఎవరో హత్య చేశారని గత శనివారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిని తలపై ఎవరో కొట్టి చంపినట్టు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బుద్షేన్ చిన్న కొడుకు నేక్‌పాల్ ఈ కేసులో అసలు దోషి అని విచారణలో తేలింది. ఆస్తుల పంపకం సమయంలో పెద్ద కొడుకు ఓం ప్రకాష్‌కు తండ్రి ఎక్కువ మేలు చేశాడని నేక్‌పాల్ భావించాడు.
తండ్రి మీద కోపంతో అతడిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. అనంతరం ఆ బాధతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం షాబాద్‌కు సమీపంలోని రోడ్డుపై నేక్‌పాల్ మృతదేహం లభ్యమైంది. తండ్రిని చంపాననే అపరాధ భావంతో నేక్‌పాల్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.