ఫోన్‌ నెంబర్లను మార్చేస్తున్నారా..? పాత SIM కార్డును వాడకుండా వదిలేసిన రిటైర్డ్ టీచర్.. రెండేళ్ల తర్వాత షాకింగ్ అనుభవం..!

ABN , First Publish Date - 2021-11-16T20:55:56+05:30 IST

మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయి ఉన్న ఫోన్ నెంబర్‌ను మార్చాలనుకుంటున్నారా?

ఫోన్‌ నెంబర్లను మార్చేస్తున్నారా..? పాత SIM కార్డును వాడకుండా వదిలేసిన రిటైర్డ్ టీచర్.. రెండేళ్ల తర్వాత షాకింగ్ అనుభవం..!

మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయి ఉన్న ఫోన్ నెంబర్‌ను మార్చాలనుకుంటున్నారా? అయితే ఆ విషయం వెంటనే బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లండి. మీ పాత ఫోన్ నెంబర్‌ను దగ్గరుండి మార్పించుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీకూ ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురు కావచ్చు. మధ్యప్రదేశ్‌లోని ఇఖారా గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ తోమార్ సింగ్‌లాగానే మీరూ పోలీసుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 


ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన తోమార్ సింగ్‌ రెండేళ్ల క్రితం తన ఫోన్ నెంబర్‌ను మార్చేశారు. అయితే ఆ నెంబర్ తన బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం అయి ఉందనే విషయం మర్చిపోయారు. మూడు నెలలు వాడకపోతే టెలికాం కంపెనీలు అదే నెంబర్‌ను వేరే వినియోగదారుడికి కేటాయిస్తానే సంగతి తెలిసిందే. తోమార్ నెంబర్‌ను కూడా అలాగే వేరే వినయోగదారుడు దక్కించుకున్నాడు. తోమార్‌కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి ఆ నెంబర్‌కు మెసేజ్‌లు వెళ్లాయి. తోమార్ పెన్షన్, పీఎఫ్ డబ్బులకు సంబంధించిన సమాచారం కొత్త వినియోదారుడికి చేరింది. 


అతడు ఆ నెంబర్‌ను ఉపయోగించుకుని ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా తోమార్ ఖాతా నుంచి ఏకంగా 6.21 లక్షల రూపాయలను తన బంధువుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఈ నెల 12వ తేదీన తోమార్ తన బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లారు. తన ఖాతాలో కేవలం రూ.200 మాత్రమే ఉన్నట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. విషయాన్ని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తోమార్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-11-16T20:55:56+05:30 IST