Abn logo
Sep 20 2021 @ 03:11AM

ఐపీఎల్‌ తర్వాత..ఆర్‌సీబీ కెప్టెన్సీకీ బై

విరాట్‌ మరో అనూహ్య నిర్ణయం

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్‌ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన కోహ్లీ.. అలాంటి అనూహ్య నిర్ణయమే మరొకటి తీసుకున్నాడు. 14వ సీజన్‌ ఐపీఎల్‌ ముగిశాక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథ్యం నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేసినట్టు కూడా వెల్లడించాడు.


ఈ మేరకు విరాట్‌ మాట్లాడిన వీడియోను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అందులో కోహ్లీ ఏమన్నాడంటే..‘ఆర్‌సీబీ ఫ్యామిలీ, ఏళ్లుగా బెంగళూరు జట్టుకు అండగా నిలుస్తున్న అద్భుతమైన ఫ్యాన్స్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు సాయంత్రం ఐపీఎల్‌ రెండో దశ ప్రారంభానికి ముందు నా జట్టు సహచరులతో మాట్లాడా. కెప్టెన్‌గా ఇది నా ఆఖరి ఐపీఎల్‌. సారథ్యం నుంచి తప్పుకోవాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యానికి సైతం తెలియజేశా. ప్రపంచ కప్‌ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలుసు. వర్క్‌లోడ్‌ను తగ్గించుకొని, పునరుత్తేజం పొందడం ద్వారా కొత్త శక్తితో ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకున్నా. వచ్చే ఏడాది భారీ స్థాయిలో వేలం జరగనుండడంతో ఆర్‌సీబీ జట్టు పరివర్తన దిశగా సాగనుంది. అయితే ఐపీఎల్‌లో నా చివరి మ్యాచ్‌ వరకూ ఆర్‌సీబీతోనే ఉంటానని యాజమాన్యానికి స్పష్టంజేశా. కెప్టెన్‌గా జట్టుతో నా తొమ్మిదేళ్ల పయనం అద్భుతంగా సాగింది. ఈక్రమంలో నాకు మద్దతుగా నిలిచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్‌సీబీతో నా పయనంలో ఇదో చిన్న హాల్ట్‌ మాత్రమే. కానీ గత కొన్ని సంవత్సరాల మాదిరే భవిష్యత్తులో ఈ జట్టుతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని చెప్పాడు. 

క్రైమ్ మరిన్ని...