హైకోర్టు ఆగ్రహంతో లాక్‌డౌన్ విధించిన బీహార్ సర్కారు

ABN , First Publish Date - 2021-05-05T03:17:36+05:30 IST

ఈ నెల 15 వరకు బీహార్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని నియంత్రించే..

హైకోర్టు ఆగ్రహంతో లాక్‌డౌన్ విధించిన బీహార్ సర్కారు

పాట్నా: ఈ నెల 15 వరకు బీహార్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని నియంత్రించే విషయంలో బీహార్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందంటూ పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన మరుసటి రోజే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘లాక్‌డౌన్ విధిస్తారా? లేదా?’’ అంటూ నిన్న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీంతో కరోనా సంక్షోభ నిర్వహణ బృందంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి నితీశ్‌కు తెలియపర్చాలంటూ అడ్వకేట్ జనరల్ లలిత్ కిశోర్‌ను పాట్నా హైకోర్టు ఆదేశించింది. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినట్టు ఇప్పటికే హైకోర్టుకు వెల్లడించినట్టు కిశోర్ ఇవాళ మీడియాకు తెలిపారు. గత వారం రోజులుగా బీహార్‌లో పాజిటివిటీ రేటు 10 శాతం మేర కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ మాత్రం నితీశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాలకు సైతం కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత తీరిగ్గా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ దుయ్యబట్టింది. 

Updated Date - 2021-05-05T03:17:36+05:30 IST