నీళ్ల కోసం బోరింగ్ వద్ద కెళ్తే.. గ్యాస్ వాసన.. కాసేపటికి షాకింగ్ ఘటన!

ABN , First Publish Date - 2021-07-22T02:09:03+05:30 IST

రోజులాగే మంచినీళ్ల కోసం హ్యాండ్ పంప్‌ వద్దకు వెళ్లారా గ్రామస్థులు. అయితే అక్కడకు వెళ్లిన వారికి గ్యాస్ వాసన వచ్చింది. చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతుందేమో అని ఆందోళన చెందారు.

నీళ్ల కోసం బోరింగ్ వద్ద కెళ్తే.. గ్యాస్ వాసన.. కాసేపటికి షాకింగ్ ఘటన!

ఇంటర్నెట్ డెస్క్: రోజులాగే మంచినీళ్ల కోసం హ్యాండ్ పంప్‌ వద్దకు వెళ్లారా గ్రామస్థులు. అయితే అక్కడకు వెళ్లిన వారికి గ్యాస్ వాసన వచ్చింది. చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతుందేమో అని ఆందోళన చెందారు. కానీ ఏ ఇంట్లోనూ అలాంటి పరిస్థితి లేదు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు.. అగ్గిపెట్టె తీసుకొచ్చి ఓ వింత పని చేశారు. అగ్గిపుల్ల వెలిగించి హ్యాండ్ పంప్ మీదకు విసిరారు. అంతే వాళ్ల బుర్రలు తిరిగిపోయేలా హ్యాండ్ పంప్‌కు నిప్పంటుకుంది. దీంతో దిమ్మతిరిగిపోయిన గ్రామస్థులు వెంటనే సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చి, మండుతున్న నీళ్ల బోరింగ్‌ను నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు.


ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో వెలుగు చూసింది. జగథర్ గ్రామంలోని ఒక హ్యాండ్ పంప్ ఇలా నిప్పంటుకుందని తెలిసిన అధికారులు షాకయ్యారు. ఘటనా స్థలంలో మండుతున్న బోరింగును చూసి అప్రమత్తమయ్యారు. గ్రామస్థులెవరూ బోరింగ్ వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. భూ పొరల్లో కార్బన్ కణాలు అధికంగా ఉంటాయని, ఇవి నీటితో కలిసినప్పుడు మీథేన్‌గా మారతాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మీథేన్ వాయువు మండే అవకాశం ఉన్న గ్యాస్‌గా బయటకు వస్తుందని వివరించారు. అయితే వర్షాకాలంలో చుట్టుపక్కల భూమి నీటితో నిండిపోవడంతో ఇలా నీళ్ల పైపు నుంచి గ్యాస్ బయటకు వచ్చిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-07-22T02:09:03+05:30 IST