17 ఏళ్లుగా ప్రాణస్నేహితులు.. సరిగ్గా నెల క్రితం ఆ నిజం తెలిసి..

ABN , First Publish Date - 2020-03-10T19:26:28+05:30 IST

ఫిలాడెల్ఫియాకు చెందిన యాష్లే థామస్(31), లతోయా వింబర్లే(29) 2004లో పుట్టినరోజు

17 ఏళ్లుగా ప్రాణస్నేహితులు.. సరిగ్గా నెల క్రితం ఆ నిజం తెలిసి..

అమెరికాలో ఇటీవల జరిగిన ఓ సంఘటనను కథాంశంగా తీసుకుని ఏకంగా సినిమానే నిర్మించవచ్చు. అంతలా ఏం జరిగిందంటే.. 17 ఏళ్ల నుంచి ప్రాణ స్నేహితులుగా ఉంటూ వస్తున్న ఇద్దరు యువతులకు పెద్ద నిజం తెలిసింది. ఏంటా నిజమంటే.. వారు స్నేహితుల కంటే ముందు రక్తం పంచుకుని పుట్టిన అక్కాచెల్లెళ్లు. ఈ విషయం తెలుసుకున్న వారిద్దరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు వారిద్దరూ అక్కాచెల్లెళ్లు అని ఎలా తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? 


ఫిలాడెల్ఫియాకు చెందిన యాష్లే థామస్(31), లతోయా వింబర్లే(29) 2004లో పుట్టినరోజు పార్టీలో మొదటిసారిగా కలుసుకున్నారు. వారి మొదటి కలయికే పరిచయంగా మారి.. పరిచయం కాస్తా స్నేహంగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరి మధ్య బంధం ఏర్పడింది. సంగీతం దగ్గర నుంచి వేసుకునే దుస్తుల వరకు వీరిద్దరిలో అనేక పోలికలు కూడా ఉన్నాయి. ఈ విధంగా 17 ఏళ్ల నుంచి వారి స్నేహబంధం కొనసాగుతూ వస్తోంది. చూసే వారంతా వారిద్దరూ అక్కాచెల్లెళ్లానే ఉన్నారని అంటుంటారు. గత ఫిబ్రవరిలో అనుకోవడం కాదు.. లతోయా, యాష్లే నిజంగానే అక్కాచెల్లెళ్లనే నిజం తెలిసింది. 


ఎలా అంటే.. లతోయా ఎంగేజ్‌మెంట్ సందర్భంగా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను యాష్లే తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసిన యాష్లే తల్లి స్నేహితురాలు వెంటనే యాష్లేకు ఫోన్ చేసింది. ఫొటోలలో ఉన్న ఒక వ్యక్తి ఆమెకు బాగా పరిచయమని, యాష్లే తల్లికి కూడా బాగా అతడు తెలుసని చెప్పుకొచ్చింది. యాష్లే తల్లి స్నేహితురాలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. లతోయా తండ్రి కెన్నెత్ వింబర్లే. ఇదే విషయాన్ని యాష్లే తన స్నేహితురాలు లతోయా దృష్టికి తీసుకెళ్లింది. యాష్లే తల్లి స్నేహితురాలి ఫొటోను లతోయా తన తండ్రికి చూపించగా ఆమె తెలుసంటూ తండ్రి సమాధానమిచ్చాడు. వెంటనే యాష్లే తల్లి ఫొటోను చూపించగా.. ఆమె కూడా తెలుసని.. వారిద్దరూ వయసులో ఉన్నప్పుడు రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నట్టు వివరించాడు. దీంతో లతోయాకు దిమ్మతిరిగింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనే విషయం లతోయాకు అర్థమైంది. 


వెంటనే యాష్లేను తన కన్నతండ్రి గురించి చెప్పమని అడగ్గా.. జన్మనిచ్చిన తండ్రి ఎవరో తనకు తెలియదని యాష్లే సమాధానమిచ్చింది. తల్లి కూడా 11 ఏళ్ల క్రితమే చనిపోవడంతో.. యాష్లేను వేరే వ్యక్తి పెంచుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న లతోయా.. యాష్లేకు, తండ్రికి డీఎన్ఏ పరీక్షలు చేయించింది. ఫిబ్రవరి 21వ తేదీన డీఎన్ఏ ఫలితాలలో డీఎన్ఏ మ్యాచ్ అయినట్టు వచ్చింది. దీంతో లతోయా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ విషయాన్ని యాష్లేకు ఫోన్ చేసి చెప్పగా.. యాష్లే ఆశ్చర్యానికి గురైంది. చిన్ననాటి నుంచి తన తండ్రిని ఎదురుగా పెట్టుకుని తండ్రి ఎవరో తెలియకుండా బతకుతూ వచ్చానని యాష్లే ఆవేదనకు గురైంది.


ఇక్కడ విశేషమేంటంటే.. లతోయా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా యాష్లే చిన్నప్పటి నుంచి కూడా తప్పకుండా పాల్గొంటూ వచ్చింది. అనేక సందర్భాల్లో కెన్నెత్ తనకు ఇద్దరు కూతుళ్లని కూడా అందరికీ చెబుతూ ఉండేవారు. ఇన్నేళ్ల నుంచి ప్రాణస్నేహితులుగా ఉంటూ వచ్చిన తామిద్దరం అక్కాచెల్లెళ్లనే విషయం తెలిశాక ఆనందం కంటే ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యామని తెలిపారు. మరోపక్క తన తండ్రి కెన్నెత్ అన్న విషయం చనిపోయిన తన తల్లికి తెలుసో లేదో అని యాష్లే మనసులో ఉన్న సందేహాన్ని వ్యక్తపరిచింది. ఇన్నాళ్లూ యాష్లేను కూతురులా చూసుకుంటూ వచ్చిన కెన్నెత్‌కు.. యాష్లే తన రక్తం పంచుకుని పుట్టిని బిడ్డ అని తెలిసి మరింత ఆనందానికి లోనయ్యాడు. 

Updated Date - 2020-03-10T19:26:28+05:30 IST