నినాదాలు వదిలి, ఆర్తనాదాలా?

ABN , First Publish Date - 2021-06-03T06:05:21+05:30 IST

రాజేందర్ చేసిన పొరపాటు ఏమిటంటే, తనకు చరిత్ర ఇచ్చిన అవకాశం ఏమిటో గుర్తించలేకపోవడం. ఈ అవకాశం తప్పనిసరిగా ఆయనను విజేతను చేస్తుందని కాదు. ఆయనను ఇప్పుడున్నస్థాయి నుంచి పైస్థాయికి...

నినాదాలు వదిలి, ఆర్తనాదాలా?

రాజేందర్ చేసిన పొరపాటు ఏమిటంటే, తనకు చరిత్ర ఇచ్చిన అవకాశం ఏమిటో గుర్తించలేకపోవడం. ఈ అవకాశం తప్పనిసరిగా ఆయనను విజేతను చేస్తుందని కాదు. ఆయనను ఇప్పుడున్నస్థాయి నుంచి పైస్థాయికి, మరింత గౌరవస్థాయికి తీసుకువెడుతుంది. తనపై దాడి మొదలుకాగానే, తన చుట్టూ అందరూ సమీకృతులవుతారని, తన బలం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుందని ఆయన అనుకుని ఉంటారు. అటువంటిదేమీ జరగలేదు. టిఆర్ఎస్‌లో ఉన్న ఆయన సన్నిహితులు కూడా నోరువిప్పలేదు. జిల్లాలో ఉన్న అనుచరవర్గానికి బెదిరింపులు ప్రలోభాలు మొదలయ్యాయి. నాటకీయంగా తనకు మద్దతు లభిస్తుందని భావించడం పొరపాటు.


ఈటల ఆ సాహసం చేయగలరా అని సుమారు నెలరోజుల కిందట ఈ శీర్షిక ప్రశ్నించింది. ‘చేయలేరు’ అన్న సమాధానమే ఖరారు అయ్యేట్టుంది. ఉద్యమాన్ని సమీక్షించుకోవడమో, రాష్ట్ర సాధన వార్షికోత్సవాన్ని వేడుక చేసుకోవడమో చేయవలసిన సందర్భంలో, బిజెపి అగ్రనేతలను కలుసుకోవడానికి ఢిల్లీలో నిరీక్షిస్తూ ఉండడం రాజేందర్ అభిమానులకే కాదు, సానుభూతితో పరిణామాలను గమనిస్తున్న వారెవరికీ రుచించడం లేదు. ఆయన చెప్పుకున్న ఆత్మగౌరవ వాదనలు ఈ పరిణామాలతో పొసగడం లేదు.


ఇదంతా ఆయన భారతీయ జనతాపార్టీలో చేరబోవడం గురించి కాదు. ఆయన కాంగ్రెస్‌లో చేరినా అభ్యంతరాలుండేవి. ఆశ్చర్యమో, ఆశాభంగమో కలుగుతున్నది, తనను తానొక ప్రత్యేక శక్తిగా మలచుకోవడానికి లభించిన అవకాశాన్ని ఆయన కాదనుకుంటున్నందుకు మాత్రమే. ఈటలకు లభించిన అవకాశం మొత్తంగా తెలంగాణ ప్రజలకు దొరికిన ప్రజాస్వామిక అవకాశం అని అనేకులు అనుకున్నారు. మరో మలుపు కోసం వారి నిరీక్షణ కొనసాగవలసిందే. 


ఈ సందర్భంలో ఒక విషయం కొత్తగా, మరొకటి మరింత వక్కాణింపుతో తెలిసివస్తున్నది. కొత్తవిషయం ఏమిటంటే, రాజేందర్ తాను ఇతరులకు ఆశపెట్టినంత, తన గురించి తాను అనుకున్నంత ధైర్యం కలిగినవాడు కానట్టుంది. లేదా, ఆయనకు ఉన్న ధైర్యసాహసాలు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆ ఎరుక ఆయనకు ఎప్పుడు కలిగింది? పాతదే అయినా మరింత వక్కాణింపుతో అనుభవానికి వచ్చిన విషయం కారణంగా. ఏమిటా విషయం? ప్రత్యర్థులతో, ప్రతిస్పర్థులతో, ధిక్కారులతో కెసిఆర్ వైఖరి కర్కశంగా, కఠినంగా ఉంటుందని తెలిసిందే, కానీ, ఇంత క్రూరంగా, దారుణంగా కూడా ఉండగలదని రాజేందర్‌కు ఇప్పుడే తెలిసింది. భూ వివాదాల ఫిర్యాదు తరువాత నుంచి ఈటల రాజేందర్‌ను వేధింపులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాజకీయమైనవి, అధికారయంత్రాంగానివి అన్నీ మనిషిని మెసలనివ్వలేదు.


ఈ బిగింపును తట్టుకోవడం ఆయనకు ‘వశం కాలేదు’. మరి తెలియదా, 20 సంవత్సరాల సాహచర్యంలో నాయకుడు ఎటువంటివాడో? పార్టీకి ఓనర్లమని, పథకాలు పరిష్కారాలు కావని వ్యాఖ్యలు చేసినప్పుడు పర్యవసానాలు ఎట్లా ఉంటాయో, తాను ఎంతవరకు తట్టుకోగలడో అంచనా వేసుకోలేదా? ఈటల అంచనాకు అందని స్థాయిలో కార్పణ్యం కత్తిదూసిందా? లేక, ఆర్థిక మూలాల మీదకు గట్టి గురి పెట్టినందున తల్లడిల్లిపోయారా? అసైన్డ్ భూములు, దేవాలయ భూములను తెలిసో తెలియకో కొనుక్కోవడం వంటి చిన్నచిన్నవి కాక, పెద్ద పెద్ద సమస్యలు ఏవైనా ప్రభుత్వం ద్వారా రానున్నాయా? అటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నప్పుడు, అధినాయకుడి మీద ధిక్కారానికి పాల్పడే అవకాశం ఉండదు కదా? ఎందుకు ఈటల ఇంత బేలగా మారిపోయారు? సొంత నియోజకవర్గంలోనే తనను ఏకాకిని చేయగలిగేంత వ్యూహం అధినేత అమలుచేసి విజయం సాధించగలిగినప్పుడు, ఆయన వల్ల బిజెపికి మాత్రం ఏమి ప్రయోజనం, బిజెపి వల్ల ఆయనకు ఏమి ప్రయోజనం? 


వ్యక్తిగతంగా ఈ స్థితిని ఎదుర్కొనే సామర్థ్యం, లాభనష్టాలు- వీటిని అంచనా వేసుకుని రాజేందర్ ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. పరిస్థితుల ఒత్తిడి ఆయనను ఎంత బలహీనపరిచిందంటే, మరొక ప్రత్యామ్నాయంలో తనకు ఎంత బలం ఉండేదో ఊహించడానికి, లెక్కించడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఇప్పుడు ఎంచుకుంటున్న మార్గం తప్ప మరే మార్గం గురించి ఆలోచించాలన్నా కూడా ఆయన సందేహిస్తున్నారు. నిజానికి ఒక పార్శ్వంలో తనకున్న బలాన్ని, మద్దతును విస్మరించి, బలహీనమైన పార్శ్వాన్ని మాత్రమే ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారు. 


‘సార్ పగబట్టిండ’ని జనసామాన్యం అనుకుంటున్నది. రాజేందర్ ధిక్కారం మెతకగా ధ్వనిస్తున్నా, కెసిఆర్ తన పట్టు సడలించకపోవడానికి కారణం, ఈ వైఖరి వల్ల కలిగే రెట్టింపు ప్రయోజనం. ఒకటి, రాజేందర్‌ను బిజెపి వైపు నెట్టివేయడం. అనివార్య పరిస్థితులలో జాతీయ అధికారపార్టీ ఆశ్రయంలోకి వెళ్లిన రాజేందర్‌కు ఏవైనా ఆర్థిక, భౌతిక రక్షణలు లభిస్తాయో లేదో తెలియదు కానీ, రాజకీయంగా ఆయన ప్రభావరహితుడవుతారు. కాబట్టి, ఎవరేమనుకున్నా సరే, గట్టిగా నొక్కేయడమే పద్ధతి అనుకుని ఉంటారు. రెండోది- రాజేందర్‌కు జరిగింది చూసి మరెవరూ ఇకముందు నాలిక ఝాడించరు. ఈటలపై ఎదురు విమర్శలు చేయడానికి వరుస కడుతున్న అధికార పార్టీ నేతలను చూస్తే అర్థమవుతుంది, అధికారంలో భాగం కావడం కోసం ఆత్మను ఎంతగా అణచిపెడతారో? ఈటల మీద వేసిన అస్త్రం అధినేతకు కావలసిన ఫలితాలనే ఇస్తున్నది. 


రాజేందర్ చేసిన పొరపాటు ఏమిటంటే, తనకు చరిత్ర ఇచ్చిన అవకాశం ఏమిటో గుర్తించలేకపోవడం. ఈ అవకాశం తప్పనిసరిగా ఆయనను విజేతను చేస్తుందని కాదు. ఆయనను ఇప్పుడున్నస్థాయి నుంచి పైస్థాయికి, మరింత గౌరవస్థాయికి తీసుకువెడుతుంది. తనపై దాడి మొదలుకాగానే, తన చుట్టూ అందరూ సమీకృతులవుతారని, తన బలం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుందని ఆయన అనుకుని ఉంటారు. అటువంటిదేమీ జరగలేదు. టిఆర్ఎస్‌లో ఉన్న ఆయన సన్నిహితులు కూడా నోరువిప్పలేదు. జిల్లాలో ఉన్న అనుచరవర్గానికి బెదిరింపులు ప్రలోభాలు మొదలయ్యాయి. నాటకీయంగా తనకు మద్దతు లభిస్తుందని భావించడం పొరపాటు. ఇది రాజేందర్ ఎంపిక చేసుకున్న సమయం కాదు కదా. దాడి జరిగింది అధినాయకుడి నుంచి, సమయాన్ని ఆయన ఎంచుకున్నాడు, తనకు అనువైన సమయంలో, ఎవరూ కిక్కురుమనరని తెలిసిన సమయంలో ఆయన తన అస్త్రాన్ని విడిచారు. అదొక ప్రతికూలత. అయినా, అధిగమించాలంటే, తను చేసే పనిపై, తన ప్రతిఘటన శక్తిపై, అంతిమంగా తనకు సమకూరే అవకాశమున్న మద్దతుపై ఆయనకు నమ్మకం ఉండాలి. అధికారకేంద్రం నుంచి పెరిగిన బలప్రయోగం ఈటలలో ఆ నమ్మకాన్ని కరిగించింది. 


బిజెపిలోకి వెళ్లడం గొప్ప పరిష్కారమని ఈటలకూడా అనుకోవడం లేదు. ఏ పార్టీలోకి అయినా వెళ్లడం గురించి, అందులోనూ బిజెపిలోకి వెళ్లడం గురించి మిత్రులు, శ్రేయోభిలాషులు చేసే వాదనలను ఆమోదించకపోయినా, ఈటలకు సొంత సందేహాలున్నాయి. బిజెపి, టిఆర్ఎస్ మధ్య సఖ్యత ఏర్పడితే, తన పరిస్థితి ఏమిటని బిజెపి అగ్రనేతలను ఆయన అడిగారని పత్రికలు రాశాయి. సఖ్యతే అవసరమైతే, ఈటల కోసం దాన్ని మానుకుంటారా? అయినా, ఇప్పుడు ఏదో స్థాయిలో సఖ్యత లేదనుకుంటున్నారా? ఈటలను వేధించవద్దు అని కేంద్ర పెద్దలు కెసిఆర్‌కు చెప్పగలరా? చెబితే కేసిఆర్ వింటారా? వినితీరవలసిన స్థాయిలో చెప్పాలని బిజెపి ఎందుకు అనుకుంటుంది? ఈటల వల్ల వారికి కలిగే రాజకీయ లాభం ఏ పాటిదని? అయినా, ఆయనా, ఆ పార్టీనేతలూ చేరిక మీదనే ఉత్సాహపడుతున్నట్టు ఉన్నారు. సాధారణ అవగాహనకు అందని గొప్ప ప్రయోజనమో, పరిణామమో ఈ చేరిక కారణంగా సంభవించనున్నదేమో? చూద్దాము. 


ఈటల ఇప్పటి మానసిక స్థితి, ఆలోచనాసరళి కారణంగా, ఆయన ప్రభావ ప్రయోజనాల గురించి, ఆయన ధైర్యసాహసాల గురించి చర్చ వస్తున్నది. ఆయన అధైర్యానికి, ప్రభావహీనతకు మూలం ఆయన ఎంపికలో ఉన్నది. సొంతదారిని ఎంచుకోగలిగితే, ఆయన శక్తిసామర్థ్యాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. ఆయన ప్రభావం ఎక్కడ పడగలదో అక్కడ పడుతుంది. 


ఇంతటి తటపటాయింపు, సంకోచం ఉన్న వ్యక్తి మీద తెలంగాణ ఉద్యమ సమాజం కానీ, అందులోని కొంత భాగం కానీ ఎందుకు ఆశ పెట్టుకుంది? ఎందుకు పౌరసమాజంలోని అనేక శ్రేణులకు ఇంత నిరుత్సాహం కలుగుతున్నది? ఎందుకంటే, ఏ ఆభిజాత్యమూ ఏకపక్ష సరళీ అభిమానులకు కూడా అధినేతపై ఎంతో కొంత నిరసన కలిగిస్తున్నాయో, ఆ లక్షణాలకు పూర్తి విరుద్ధమైన సాత్వికతా, సుహృద్భావమూ, ఆదరణా రాజేందర్‌లో చూస్తున్నారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి కావడమూ, మడమ తిప్పని ఉద్యమ తత్వం, అభ్యుదయ భావాల నేపథ్యం, జీవితాచరణ–వీటన్నిటి కారణంగా ఆయనపై ఆశల బరువు పెరిగి ఉండవచ్చు. రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణలో ప్రజలను యాచకులుగా, లబ్ధిదారులుగా, గ్రహీతలుగా మార్చివేసే క్రమమే, వారిని ప్రజాస్వామ్య స్ఫూర్తి నుంచి కూడా వెలి చేసింది. అందుకే, తెలంగాణ ఇప్పుడు అడగడం మరచిపోయింది. కోదండరామ్‌ను కూడా ఓడించేంత స్థాయికి ఎదిగిపోయింది. రోజులు మారాలని కోరుకునేవారు, అందుకే, ప్రతిపక్షాలు బలపడాలన్న అవాస్తవ ఆకాంక్షలు పెట్టుకోవడం లేదు. అధికారపక్షంలో బీటలు ఏర్పడితే చాలని, నిరంకుశత్వం అదే బలహీనపడుతుందని ఆశ పడుతున్నారు. ఈటల రూపంలో కంచుకోట బీటలు వారుతుందని సంబరపడ్డారు. 


పదకొండు మంది బలహీనవర్గాల ఉద్యమనాయకులు ఈటెల రాజేందర్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈటలను పునరాలోచించాలని ఆ లేఖ ఎంతో ఆవేదనతో కోరింది. ‘‘...ప్రజలు మరో తెలంగాణ ఆత్మగౌరవ పార్టీని కోరుకుంటున్నారు....మేము ఒకనాడు బయట ఉండి కూడా గులాబీని బలపరిచినవారమే. శ్రీకాంతాచారి మొదలు ఎంతో మంది త్యాగధనులు గులాబీ జెండాను పట్టుకుని ఆత్మబలిదానాలు చేసుకున్నారు...అటువంటి జెండాను రూపకర్తలు, ఓనర్లు కెసిఆర్ జేబులో పెట్టి నిరాయుధులుగా బయటకు వచ్చి నిర్వీర్యం కావడమో, నామమాత్రంగా మిగిలిపోవడమో జరుగుతూ వచ్చింది. చివరగా మీ వంతు వచ్చింది... ఎవరు చెప్పని మాట మీరు చెప్పారు. గులాబీ ఓనర్లమన్నారు... ప్రజలు తమరిలో ప్రత్యామ్నాయం చూసుకున్నారు...’’ అని ఆ బిసి నేతలు తామెందుకు ఆయనపై ఆశ పెట్టుకున్నామో చెప్పారు. ఈటల వేరే నిర్ణయం తీసుకుంటే తాము ఎట్లా ఆలోచిస్తామో కూడా వారు ఆశాభావంతో రాశారు. ‘‘ఆత్మ గౌరవం, ప్రజాస్వామ్యం కోసం తెలంగాణ తల్లి మరొక నాయకుణ్ణి కంటుంది. ప్రజల నుండి మరో నాయకుడు పుడతాడు. సమయం పడుతుంది, అంతే.’’ 




కె. శ్రీనివాస్

Updated Date - 2021-06-03T06:05:21+05:30 IST