High score in IELTS: అమెరికా కోర్టులో ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోయిన భారతీయ విద్యార్థులు.. న్యాయమూర్తికి షాక్.. చివరికి..

ABN , First Publish Date - 2022-08-03T03:37:47+05:30 IST

ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష IELTS లో అద్భుత ప్రతిభ చూపిన గుజరాత్ విద్యార్థులు ఇటీవల అమెరికా కోర్టులో ఇంగ్లిష్‌లో ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోవడం న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచింది.

High score in IELTS: అమెరికా కోర్టులో ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోయిన భారతీయ విద్యార్థులు.. న్యాయమూర్తికి షాక్.. చివరికి..

ఎన్నారై డెస్క్: ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష IELTS లో అద్భుత ప్రతిభ చూపిన గుజరాత్ విద్యార్థులు ఇటీవల అమెరికా కోర్టులో ఇంగ్లిష్‌లో ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోవడం న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచింది. ఇది పలు సందేహాలకు తావివ్వడంతో అమెరికా అధికారులు రంగంలోకి దిగారు. ఆంగ్లంలో మట్లాడలేని వారు IELTSలో గొప్ప స్కోర్ ఎలా సాధించారో తేల్చేందుకు భారత పోలీసుల సాయం కోరారు. వారి అభ్యర్థన మేరకు గుజరాత్‌లోని మెహసానా జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు బయటపడ్డట్టు తాజాగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఈ ఏడాది మార్చిలో ఆరుగురు భారతీయ విద్యార్థులు కెనెడా(Canada) నుంచి అమెరికాలోకి(America) అక్రమంగా ప్రవేశిస్తూ(Illegal entry) పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. సరిహద్దుకు సమీపంలోని ఆక్వెసాన్యే ప్రాంతంలో సెయింట్ రెజిస్ నదిని పడవలో దాటేందుకు ప్రయత్నిస్తూ వారు అమెరికా అధికారులకు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు మెహసానా జిల్లాకు చెందిన వారు కాగా.. మిగతా ఇద్దరు గాంధీనగర్, పాటన్‌ జిల్లాలకు చెందిన వారని తేలింది. ఈ క్రమంలో పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో వారు తడబడ్డారు. దీంతో.. అనువాదకులను కోర్టుకు పిలిపించాల్సి వచ్చింది. అయితే..ఈ నలుగురి IELTS స్కోర్ 6.5 నుంచి 7 బ్యాండ్స్ మధ్య ఉండటంతో న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. స్థానిక మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన ఈ ఉదంతం.. ముంబైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీంతో.. వారు మెహసానా పోలీసులను ఆశ్రయించారు.


కాన్సులేట్ అధికారుల అభ్యర్థన మేరకు మెహసానా పోలీస్ స్టేషన్‌ దర్యాప్తు ప్రారంభించింది. ఇన్‌స్పెక్టర్ రాథోడ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. దక్షిణ గుజరాత్‌లోని నవ్సరీ టౌన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో ఆ నలుగురు పరీక్ష రాసినట్టు విచారణలో తేలింది. పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థ తీసుకుంది. టౌన్‌లోని ఓ బాంక్వెట్‌ హాల్‌లో పరీక్ష ఏర్పాటు చేశారు. అయితే.. పారదర్శకతకు సంబంధించి నియమాల ఉల్లంఘన జరిగినట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. హాల్‌లోని సీసీ కెమెరాలను పరీక్ష సూపర్‌వైజర్లు ఆఫ్ చేశారని బ్యాంక్వెట్ హాల్ మేనేజర్ తెలిపారు. ఇదంతా పలు అనుమానాలను రేకెత్తిస్తోందని ఇన్‌స్ఫెక్టర్ రాథోడ్ పేర్కొన్నారు. దీంతో.. పరీక్ష నిర్వహణ బాధ్యత తీసుకున్న సంస్థ యాజమాన్యాన్ని విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు తాజాగా ఆదేశించారు.

Updated Date - 2022-08-03T03:37:47+05:30 IST