35ఏళ్ల తర్వాత... తొలిసారి ఉద్యోగుల సమ్మెబాట

ABN , First Publish Date - 2022-01-25T08:50:01+05:30 IST

ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పీఆర్సీ సమస్యపై సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమయ్యాయి.

35ఏళ్ల తర్వాత... తొలిసారి ఉద్యోగుల సమ్మెబాట

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పీఆర్సీ సమస్యపై సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమయ్యాయి. అయితే, ఈ సమ్మె పిలుపునకు ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో 35 ఏళ్ల తర్వాత తొలిసారి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. అప్పుడు కూడా పీఆర్సీ కోసమే ఉద్యోగులు ఉద్యమించడం విశేషం. ఎన్టీఆర్‌ ప్రభుత్వం 1986లో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ప్రోత్సాహకంగా అందుతున్న ఒక ఇంక్రిమెంట్‌నూ, ఎర్న్‌డ్‌ లీవ్‌లను క్యాష్‌ చేసుకునే వెసులుబాటునూ రద్దుచేశారు. వీటిలోపాటు పీఆర్సీ అమలు కూడా ఆలస్యమైంది. ఇవన్నీకలిసి ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో వ్యతిరేకతను పెంచాయి. ఉద్యోగుల ఐక్య సంఘం పిలుపు మేరకు 1986 అక్టోబరులో సుమారు 19 రోజులపాటు సమ్మె సాగింది. పీఆర్సీ అమలుచేయడంతోపాటు... ఉద్యోగులకు తగ్గించిన వయసు సహా అన్ని ప్రయోజనాలను కల్పించేందుకు ఎన్టీఆర్‌ ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విజయవంతమైంది. ఈఒక్క సందర్భంలో ఉద్యోగుల పట్ల ఎన్టీఆర్‌ కఠినంగా వ్యవహరించినా, అనంతరకాలంలో ఉద్యోగులకు వెలకట్టలేని ప్రయోజనాలు అందింది ఆయన హయాంలోనే! ఆయన హయాంలో ప్రకటించిన పీఆర్సీలో ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా దాదాపు 400కిపైగా అంశాలను చేర్చారు. అలాగే, స్పెషల్‌ టీచర్ల వ్యవస్థను తీసుకొచ్చి లక్షమందిని నియమించారు. ఉద్యోగులకు మాస్టర్‌ స్కేల్‌ కల్పించి గౌరవించారు. కాగా, ఉద్యోగులపై కఠిన వైఖరికి నిరసనగా కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 1971లో 56 రోజుల పాటు సమ్మె నడిచింది.

Updated Date - 2022-01-25T08:50:01+05:30 IST