35 ఏళ్ల తర్వాత అన్నాసాలైలో మళ్లీ Karuna విగ్రహం

ABN , First Publish Date - 2022-05-28T14:14:08+05:30 IST

నగరంలోని ప్రధాన రహదారి అన్నాసాలైలో 35 యేళ్ళ తర్వాత దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం ఏర్పాటు కానుంది. శనివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి

35 ఏళ్ల తర్వాత అన్నాసాలైలో మళ్లీ Karuna విగ్రహం

                    - నేడు ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి


చెన్నై: నగరంలోని ప్రధాన రహదారి అన్నాసాలైలో 35 యేళ్ళ తర్వాత దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం ఏర్పాటు కానుంది. శనివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గతంలో కరుణానిధి జీవించి ఉండగానే అన్నాసాలైలోని తారాపూర్‌ టవర్‌ కూడలిలో ఓ చేతిలో పుస్తకం, మరో చేతిని పెకెత్తి చూపుతున్న విధంగా కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ద్రావిడ కళగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ మరణించిన సందర్భంగా నగరంలో జరిగిన హింసాకాండలో దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ద్రావిడ కళగం అక్కడే కరుణానిధి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ ఆధ్వర్యం లో అన్నాసాలై ఓమండూరార్‌ ప్రభుత్వ ఎస్టేట్‌ ప్రాంతంలోని ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పపత్రి ప్రాంగణం వద్ద కరుణానిధి నిలవెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. అనంతరం కలైవానర్‌ అరంగం హాలులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన విగ్రహావిష్కరణ ప్రత్యేక సభ జరుగనుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నారు. రాష్ట్రమంతులు, డీఎంకే సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ తదితర మిత్రపక్షాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ స్వీయపర్యవేక్షణలో సుమారు 500 మంది పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఓమండూరార్‌ ప్రభుత్వ ఆస్పత్రి, కలైవానర్‌ అరంగం చుట్టూ సాయుధ దళాలతో పహరా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కరుణ విగ్రహావిష్కరణ సభకు పార్టీ శ్రేణులంతా తరలిరావాలంటూ డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ లేఖ రాశారు. కరుణానిధి జీవిత విశేషాలను, వివిధ రంగాల్లో అందించిన విశేషాలను ఆ లేఖలో పొందుపరిచారు.

Updated Date - 2022-05-28T14:14:08+05:30 IST