1857 అనంతరం...

ABN , First Publish Date - 2022-05-13T06:04:46+05:30 IST

రెండు ప్రధాన ప్రశ్నలు మన మనస్సుల్లో తలెత్తాయి. 1857 తిరుగుబాటు అనంతరం ప్రజా జీవితాన్ని వ్యవస్థీకరించుకోవడంలోనూ, దేశభక్తి ప్రపూరిత భావాలను వ్యాపింప చేయడంలోనూ ప్రజలు సాధించిన పురోగతి ఏమిటి...

1857 అనంతరం...

ఒక వ్యక్తిగా జీవితం మొదలుపెట్టి, ఒక సంస్థగా మారి, జాతి ప్రయోజనాల కోసం పాత్రికేయుడుగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా ఎన్నో పోరాటాలు చేసిన దేశభక్తుడు చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి (1880–1941). 18 ఏళ్లకే ఎడిటర్, 36 ఏళ్లకు శాసనసభ్యుడు, 41 ఏళ్లకు మంత్రి అయిన ప్రతిభావంతుడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆహ్వానంపై 1935లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ‘ఇండియన్ పొలిటిక్స్ సిన్స్ ది మ్యూటినీ’ అన్న అంశంపై చింతామణి వెలువరించిన ప్రసంగాల నుంచి కొన్ని భాగాలు...


రెండు ప్రధాన ప్రశ్నలు మన మనస్సుల్లో తలెత్తాయి. 1857 తిరుగుబాటు అనంతరం ప్రజా జీవితాన్ని వ్యవస్థీకరించుకోవడంలోనూ, దేశభక్తి ప్రపూరిత భావాలను వ్యాపింప చేయడంలోనూ ప్రజలు సాధించిన పురోగతి ఏమిటి? నిరంకుశ, ఉద్యోగస్వామ్య, బాధ్యతారహిత పాలనా వ్యవస్థగా ఉన్న ప్రభుత్వం తనను తాను రాజ్యంగ బద్ధ అంటే ప్రాతినిధ్య, బాధ్యతాయుత ప్రభుత్వంగా మార్చుకోవడానికి చేపట్టిన చర్యలేమిటి? పరిపాలనా వ్యవస్థలో సంస్కరణల ద్వారా సాధించిన పురోగతి ప్రజల ప్రయోజనాల కోసమే ఉద్దేశించినదేనా అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయా? లేక మరింతగా దిగజారిపోయాయా? విద్యా వసతులు విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయా? సామాజిక సమర్థతను పెంపొందించడం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం అనే జంట లక్ష్యాలతోనే సాంఘిక సంస్కరణలను అమలుపరిచారా?


వీటిలో మొదటి ప్రశ్నకు సమాధానాన్ని సుళువుగా ఇవ్వవచ్చు. ప్రజా జీవిత వ్యవస్థీకరణ, నిర్వహణలోనూ, ప్రజానీకంలో దేశభక్తి ప్రపూరిత భావాలను వ్యాపింపచేయడంలో నేటి తరం వారి కృషికి, తొలినాటి ప్రజా జీవిత ప్రముఖుల కృషికి పోలికే లేదు. నాటి, నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. నాడు చెప్పుకోదగ్గ ప్రజా సంస్థ ఒక్కటీ లేదు. దేశభక్తి అనేది అక్కడక్కడ కొంత మంది వ్యక్తులకు మాత్రమే పరిమితమయింది. అత్యంత ప్రతికూల, సంక్లిష్ట పరిస్థితులలో వారు దేశ శ్రేయస్సుకు శ్రమించారు. సమాజ పునర్నిర్మాణానికి పాటుపడ్డారు. కష్ట నష్టాలను లెక్క చేయలేదు. వారు అకుంఠిత కృషితో వేసిన నిజమైన, సుదృఢమైన పునాదులపైనే ఒక విశాల దేశ సేవా కట్టడం నిర్మాణమయింది. తొలుత ఎవరికి వారుగా పని చేసిన కార్యకర్తలు, పిదప స్థానిక సంఘాలు, ఆ తరువాత రాష్ట్ర స్థాయి సంస్థలు, అంతిమంగా అఖిల భారత సంస్థలు. ఈ చివరి వాటిలో మహోన్నతమైనది, పురాతనమైనది భారత జాతీయ కాంగ్రెస్ అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.


1891లో నాగపూర్ కాంగ్రెస్ మహాసభలో మాట్లాడుతూ ఏడవ వార్షిక సమావేశానికి కాంగ్రెస్ సంస్థ చేరడం పట్ల అమితానందాన్ని వ్యక్తం చేశారు. ఇరవై సంవత్సరాల మనుగడ అనంతరం కాంగ్రెస్ ప్రప్రథమంగా ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చీలిక అంచుకు చేరింది. వాస్తవానికి ఇరవై రెండవ మహాసభలో తీవ్ర వాదోపవాదాలు, ఉద్రిక్త పరిస్థితుల నడుమ చీలిపోయింది కూడా. అయితే వెన్వెంటనే సమైక్యమయింది. దేశ స్వాతంత్ర్య సాధనకు మరింత మహోత్సాహంతో పునరంకితమయింది. పది సంవత్సరాల అనంతరం ఆ సంస్థ ఇతరుల ఆధిపత్యంలోకి వెళ్లింది. విధానమూ మారిపోయింది. కాంగ్రెస్ సంస్థాపకులలో ప్రస్తుతం ఒకే ఒక్కరు (సర్ దిన్షా వాచా) మాత్రమే మన మధ్య నడయాడుతున్నారు. తొలినాటి సభ్యులలో కొద్ది మంది మాత్రమే ఇప్పుడు మన మధ్య ఉన్నారు. పాత కాంగ్రెస్ వాదులలో చాలా మందికి ఇప్పుడు ఆ సంస్థతో సంబంధాలు లేవు. అలనాటి కాంగ్రెస్ నిర్దేశించిన, తాము నిబద్ధమైన నియమాలు, విధానాలను నేటి కాంగ్రెస్ అనుసరించకపోవడం వల్ల వారు నిరుత్సాహానికి లోనయివున్నారు.


నిజానికి భారత జాతీయవాదులు అందరూ కాంగ్రెస్ వాదులే. అయితే కాంగ్రెస్ విధానాలలో మౌలిక మార్పులు చోటు చేసుకున్నందున చాలా మంది ఆ సంస్థ సభ్యులుగా లేరు. భారతదేశ ప్రస్తుత ప్రజా జీవితం, భారత జాతీయవాదుల మహోన్నత విజయమే. మూర్తీభవించిన ఆందోళనగా భారత్ ఉన్నది. జీవితానికి మరో పేరే ఆందోళన కదా. ఆశే జీవితం. ప్రయత్నమే జీవితం. నిస్వార్థ కృషి సుదీర్ఘకాలంలో ఫలించి తీరుతుంది. అందరి శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

Read more