పోటెత్తిన పిడికిళ్ల ఆఫ్రికన్‌ కవిత్వం

ABN , First Publish Date - 2022-05-30T06:12:10+05:30 IST

ఆఫ్రికా ఒక దేశం కాదు. ఒక ఖండం. 54 దేశాలతో కూడిన పెద్ద భూభాగం. నల్లజాతి జనుల నివాస స్థలం. 19వ శతాబ్దంలో యూరప్‌ దేశాల కన్ను ఆఫ్రికాలోని అపార ఖనిజ సంపదమీద, మానవ వనరుల మీద పడింది...

పోటెత్తిన పిడికిళ్ల ఆఫ్రికన్‌ కవిత్వం

ఆఫ్రికా ఒక దేశం కాదు. ఒక ఖండం. 54 దేశాలతో కూడిన పెద్ద భూభాగం. నల్లజాతి జనుల నివాస స్థలం. 19వ శతాబ్దంలో యూరప్‌ దేశాల కన్ను ఆఫ్రికాలోని అపార ఖనిజ సంపదమీద, మానవ వనరుల మీద పడింది. ఒక్కొక్క ఆఫ్రికా దేశాన్ని ఆక్రమిం చుకోవటం మొదలుపెట్టి, 1914కల్లా అన్నింటినీ తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నవి. 15 యూరప్‌ దేశాలు, 54 ఆఫ్రికా దేశాల్ని పంచుకొని స్వలాభం కోసం అక్కడి ప్రజల్ని, వనరుల్ని దోచుకోవటం మొదలు పెట్టాయి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, పోర్చుగల్‌, స్పెయిన్‌, ఇటలీ-ఆ యూరప్‌ దేశాల్లో ముఖ్యపాత్ర పోషించాయి. అంగోలా, మలావి, కెన్యా, సౌత్‌ ఆఫ్రికా, ఘనా, నమీ బియా, మొజాంబిక్‌, సోమాలియా, నైజీరియా, జాంబియా... ఇలా ఎన్నో దేశాలు యూరప్‌ దేశాల ఆధిపత్యం కింద నలిగిపోయాయి. 


భరించలేనంత అణచివేతకు గురైనప్పుడు, ప్రజలు ప్రభు త్వాలపై తిరుగుబాటు జెండా ఎగురవేయటం జరిగేదే. వలస ప్రభుత్వాల కింద నలుగుతున్న ఆఫ్రికాలోనూ అదే జరిగింది. అట్లా తిరుగుబాటు జెండా పుచ్చుకొని ప్రజల్ని మేల్కొలిపినవాళ్లలో ముందువరసలో నిల్చున్నవారు అక్కడి ఆఫ్రికా కవులు. వాళ్ళు కవిత్వాన్ని, రాజకీయాల్ని విడివిడిగా చూడలేదు. వలస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, నల్లజాతి స్వాతంత్ర్యేచ్ఛకు ప్రతీకగా వాళ్ళు కవిత్వాన్ని వాడారు. ఆ కవుల్లో చాలామందిని వలస ప్రభుత్వాలు ఏ విచారణ జరపకుండా జైల్లో పెట్టి, దేశబహిష్కరణ చేసి, నానా రకాలుగా హింసించాయి. మలావి దేశానికి చెందిన జాక్‌ మసాంజె, కెన్యా దేశానికి చెందిన గితే ముగో అనే ఇద్దరు కవులు ఆ విధంగా జైలు పాలైనారు. క్రిస్టఫర్‌ ఒకిబో అనే కవి ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో అసువులు బాశాడు. 


ఒలే సోయింకా, ఎల్‌.ఎస్‌. సెనెగర్‌, అగస్టినానెటో, టహికయ టమ్సిర్‌ ఆఫ్రికా కవుల్లో అగ్రగణ్యులు. ఒలే సోయింకాకు సాహిత్యంలో 1986లో నోబెల్‌ బహుమతి వచ్చింది. ఆఫ్రికా కవిత్వంలో కవయిత్రుల పాత్ర తక్కువేం గాదు. ఎస్పిరిటో శాంటో, మైసిరే ముగో వారిలో ముఖ్యులు. ఒలే సోయింకా సంపాదకత్వంలో ఆఫ్రికా కవుల కవిత్వ సంకలనం ఒకటి 1975లో ప్రచురింపబడింది. ఇదిగాక పెంగ్విన్‌ వాళ్ళ సంకలనం కూడా వున్నది. 


కవి చచ్చిపోవాలి

వాడి గొణుగుడు వాళ్ళ బ్రతుక్కి ప్రమాదం

వాడి వూపిరి విప్లవం మొదలెట్టగలదు

వాడు నశించి తీరాలి.


బహిష్కరించు 

ద్వీపాంతరవాసం పంపించు

తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసు బలగాన్ని పిలు

అయితే ఒకటి గుర్తుంచుకో

గోడకంటిన వాడి రక్తాన్ని తుడిచెయ్యి

అప్పుడు గోడను కూల్చేయ్యి

ఇంటిని నేలమట్టం చెయ్యి

ఇరుగుపొరుగును చంపెయ్యి


వాళ్ళ అబద్ధాలు నిజాలుగా చెలామణి కావాలంటే

కవి చచ్చిపోవాలి.

డాన్‌ మటేరా, సౌత్‌ ఆఫ్రికా


అంతపెద్ద ఎస్టేటులో వర్షం లేదు

నా నుదుటి చెమటే సాగునీరు

అంత పెద్ద ఎస్టేటులో

ఏపుగా పెరిగిన కాఫీ తోటలకు

ఎర్రగా పండిన చెర్రీ పళ్ళకు

అంతస్సారం నా రక్తమే.


కాఫీ గింజల్ని వేయించి

నలగ్గొట్టి చేసిన పొడి

నల్లటి నలుపు రంగు

కాంట్రాక్టు కూలీ రంగు

నల్లటి నలుపు


పాడే పక్షుల్ని

పారే సెలయేళ్ళను

పైరగాలుల్ని అడుగు

ప్రొద్దునే ముందు ఎవరు లేస్తారు?

ఎవరు పనికి వెళ్తారు?

పెద్ద రోడ్డుమీద సరుకులు మోస్తూ

వెళ్ళేది ఎవరు?

ప్రతిఫలంగా ఈసడింపులు

పుచ్చిన మొక్కజొన్నలు

కుళ్ళిన చేపలు, చిరిగిన బట్టలు

చెప్పుదెబ్బలు, కాసిని డబ్బులు

పుచ్చుకొనేది ఎవరు?

ఎవరు?

తెల్లోడు బాగుపడ్డానికి

బానపొట్టలు పెరగటానికి

బాగా డబ్బులు పోగుపడ్డానికి

కారకులు ఎవరు?


పాడే పక్షులు

పారే సెలయేళ్ళు

పైర గాలులు

సమాధానం చెప్తవి.

ఆంటోనియో జసింటో, అంగోలా


దోచుకెళ్ళారా

కొట్టారా?

దవాఖానలో జేరాడా?

సాక్షులెవరన్నా వున్నారా?

ఇసుకరేణువులు ఎన్నో అంతమంది.

కాడియల్‌ ఒకడు

అన్‌దౌలా, నడ్యామ్‌ బెలె ఒకడు

పిట్టలు కూడా ధ్రువీకరిస్తవి.


అయితే ఒకటి నీవు మర్చిపోతున్నావు

దొర కొడుకు జడ్జి

అల్లుడు లాయరు.

ఖుమర్‌ బా, మారిటానియా


నీవు వాదిస్తావు

న్యాయం నీ పక్షాన వుందని.

దొరవారి దొడ్లో కట్టేసివున్న

ఎద్దుల జంట ఎవరిది?

నేను వాటిని పేరు పెట్టి పిలిస్తే

మోరలెత్తి నా వంక చూస్తవి చూడు.

ఖుమర్‌ బా, మారిటానియా


అన్నా, రా, వచ్చి నీ కథేంటో చెప్పు

శత్రువు నీ ఒంటిమీద మిగిల్చిన

విప్లవ గుర్తులు చూపు.

వచ్చి, చెప్పు నాకు.

‘‘ఈ చోట నా చేతులు చితగ్గొట్టారు

అవి దేశానికి రక్షగా వున్నందుకు.

ఈ చోట నా శరీరాన్ని

చిత్రహింసల పాల్జేశారు.

అది ముట్టడిదారుల దౌష్ట్యానికి 

తలవొగ్గనందుకు

ఈ చోట నా నోటిని గాయపరిచారు

అది నా జాతిజనుల స్వాతంత్ర్యేచ్ఛను

ధైర్యంగా పాడినందుకు’’

అని చెప్పునాకు.


అన్నా, రా, వచ్చి నీ కథేంటో చెప్పు

వచ్చి, నీవు, నీ తండ్రులు, తాతలు

మౌనంగా చీకటి రాత్రుల్లో కన్న

తిరుగుబాటు కలల గురించి చెప్పు

అన్నా, వచ్చి చెప్పు

ఆ కలలు యుద్ధంగా రూపుదిద్దుకొన్నవని

యోధులకు జన్మనిచ్చినవని,

భయమెరుగని తల్లులు

కొడుకుల్ని పోరాటానికి పంపేట్టు చేసినవని.


అన్నా, రా, వచ్చి, ఇదంతా చెప్పు

తరువాత నేను 

పిల్లలు కూడా అర్థం చేసుకోగల

చిన్న చిన్న పదాలతో పాటకడతాను.

ఆ పదాలు

గాలిలా ప్రతి ఇంటిలోకి చొరబడి

అందరి హృదయాల మీద

ఎర్రటి నిప్పుకణికల్లా వాలుతాయి.


అన్నా, 

ఇప్పుడు మన నేల మీద

బుల్లెట్లు పుష్పించటం మొదలైంది.

జార్జి రెబెలో, మొజాంబిక్‌


బహిష్కృత నిశ్శబ్ద దేశం నుండి నేను తిరిగివచ్చేటప్పుడు

నా కొరకు పూలు పట్రాకండి.

బదులుగా

పట్రండి పోగుపడ్డ మంచుబిందువుల్ని

నాటకీయ ఘటనలు చూసిన వేకువజాము కన్నీటి   

                                   బిందువుల్ని.

పట్రండి ప్రేమకొరకు తపనపడే తీవ్రవాంఛను.

పట్రండి కన్నకొడుకులు చేతుల్లోంచి లాక్కుపోబడితే

నిద్రలేని దీర్ఘరాత్రులు రోదించే తల్లుల దైన్యాన్ని.

బహిష్కృత నిశ్శబ్దదేశం నుండి నేను తిరిగివచ్చేటప్పుడు

నా కొరకు పూలు పట్రాకండి.


పట్రండి ఇదొక్కటి

పిడికిల్లో రాయితో

కళ్ళల్లో బుసకొట్టే ఆగ్రహంతో

వేకువజామున కూలిన వీరుల చివరి కోరికను.

జోఫ్రే రోచా, అంగోలా


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

ఒంటరిగా కూర్చొని

మనుషులకు బట్టలెందుకా అని

ఆశ్చర్యపడ్డ చిన్నప్పటి రోజులు గుర్తుకుతెచ్చుకొని

నాలో నేను నవ్వుకొంటాను.


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

వర్షంలో తప్పించుకొని గూడుకిందకు పరుగెత్తే మేకల్ని

కదలకుండా నిల్చొని తడుస్తూ ఆనందిస్తున్న గొర్రెల్ని

చూస్తూ గడిపిన కాలం గుర్తుకు తెచ్చుకొంటాను.


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

బడి వదిలిపెట్టినాక

చొక్కా లాగూలు విప్పి

పుస్తకాల సంచితోపాటు నెత్తిన పెట్టె పెట్టుకొని

మొండిమొలల్తో వాగు దాటిన దినాలు

గుర్తుకు తెచ్చుకొంటాను.


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

గంటల తరబడి కురిసిన వర్షంలో

తలదాచుకొనే చోటు లేక

తింటానికి సరిగా తిండి లేక

తాగటానికి వర్షం నీరు తప్ప వేరే లేక

తిప్పలు పడే జనాలను 

గుర్తుకు తెచ్చుకొంటాను


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

తెరిపినివ్వకుండా రోజుల తరబడి కురిసిన వర్షంలో

రేకుల షెడ్డు కింద

పసికందుల్ని గుండెల కద్దుకొని

నరాలు కొరికే చల్లటి గాలుల్లో

కాలం గడిపే తల్లుల్ని

గుర్తుకు తెచ్చుకొంటాను.


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

రాత్రుళ్ళు నగరాల్లో

షాపుల ముందు రోడ్ల పక్క

పోలీసుల భయంతో

ముడుచుకుపడుకున్న అడ్డాకూలీలను

గుర్తుకు తెచ్చుకొంటాను.


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

ప్రపంచంలో అన్ని జైళ్ళలో వున్న

జీవిత ఖైదీల గురించి ఆలోచిస్తూ

తుఫానుగాలితోపాటు కురుస్తున్న వర్షం వెలిశాక

ఇంద్రధనుస్సును చూడాలనే కోరిక

ఇంకా వాళ్ళలో బతికి వుంటుందా అని

ఆశ్చర్యపోతుంటాను.


వర్షం కురుస్తున్నప్పుడు ఒక్కోసారి

స్నేహితుల నవ్వు మొహంలో

తెల్లటి పంటివరసలా మెరుస్తున్న

పచ్చగడ్డిమీద రాలిపడే వడగళ్ళను చూసి

ప్రతి ఒక్కరు సంతోషంగా నవ్వుకొనేందుకు

ఏదో ఒకటి వుండాలని కోరుకుంటాను.

గైనా మలోపే, సౌత్‌ ఆఫ్రికా


వర్తమానం, మండే నెగడి

గతం, కాలిన బూడిద

భవిష్యత్తు, మబ్బుల ఆకాశంలోకి

ఎగసిన పొగ


శాంతంగా దయగా వుండు

మాటలు స్మృతులౌతవి

స్మృతులు విదూషకుల చేతుల్లో

ఉపకరణాలౌతవి

జ్ఞానులు మౌనం వహించారంటే కారణం

వారు బుద్ధుడి మొహం చూసి

క్రీస్తు భవిష్యత్తు తెలుసుకొన్నారు.


అందువల్ల జ్ఞానం కొరకు

మార్గదర్శకత్వం కొరకు

వారి మాటల్లో వెతక్కు

ఏ అగ్ని వాళ్ళ నాలుకల్ని సంస్కరించి

మౌనంగా వుంచిందో

ఆ అగ్నే మనకూ బోధించుగాక!

బోధించుగాక!

కేస్వీబ్రో, ఘనా


వాళ్ళ భాషలో నీవు పండితుడవు గావచ్చు

దేశాల మధ్య పెరిగిన సంబంధాల వల్ల

నీవు వాళ్ళకు దగ్గర కావచ్చు

కాని వాళ్ళు చెప్పేదేమిటో

వాళ్ళ భావోద్వేగాలెలా పని చేస్తవో

మాటల అర్థఛాయలెలాంటివో

ఆలోచనారీతులెలా వుంటవో

ఇవి నీకూ నాకూ ఎప్పటికీ మూసుకొనే వుంటవి.

అట్లనే మన మాటలు వాళ్ళకు 

వడగాడ్పుకు రాలిపడ్డ ప్రాణంలేని

ఎండుటాకుల గలగల చప్పుడుకంటే

వేరుగా వుండదు,

ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు మనతో

కలిసి వుండినా.

అడలిమోర్టి, ఘనా

దీవి సుబ్బారావు, 96762 96184


Updated Date - 2022-05-30T06:12:10+05:30 IST