అఫ్ఘానిస్థాన్‌లోఆకలిచావులు

ABN , First Publish Date - 2021-10-26T08:08:00+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిల్లల ఆకలిచావులు కలకలం రేపుతున్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక అలుముకున్న ఆహార సంక్షోభం ఆందోళన రేకెత్తిస్తోంది.

అఫ్ఘానిస్థాన్‌లోఆకలిచావులు

బుక్కెడు బువ్వ కోసం అలమటించి 

చనిపోయిన 8 మంది పిల్లలు 

అందరూ ఒకే కుటుంబం వారు 

3 వారాల తర్వాత ఘటన వెలుగులోకి 

2.3 కోట్ల మందిని అలుముకున్న ఆహార సంక్షోభం 

55% పెరిగిన నిత్యావసరాల ధరలు


కాబూల్‌, అక్టోబరు 25 : అఫ్ఘానిస్థాన్‌లో ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిల్లల ఆకలిచావులు కలకలం రేపుతున్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక అలుముకున్న ఆహార సంక్షోభం ఆందోళన రేకెత్తిస్తోంది. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్‌ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు తినడానికి బువ్వ దొరకక ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం ప్రపంచం దృష్టికి వచ్చింది. ఈ 8 మంది పిల్లల తల్లి గుండె జబ్బుతో చనిపోగా, తండ్రి ట్యూమర్‌ సమస్యతో మంచం పట్టాడు. ఈనేపథ్యంలో పిల్లలు కాబూల్‌లో భిక్షాటన చేసేవారు. అక్కడ ఆహార సంక్షోభం ముదరడంతో వీరికి బువ్వ పెట్టే నాథుడు లేకుండాపోయాడు. ఈ పరిస్థితుల్లో ఎనిమిది మంది పిల్లలంతా ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు విడిచారని మహ్మద్‌ అలీ బమియానీ అనే స్థానికుడు మీడియాకు చెప్పాడు. ఉపాధి అవకాశాలు కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్ఘానీయులు తమకు ఉన్న స్థలాల్లో కొంత భాగాన్ని  అమ్మేయగా వచ్చే డబ్బులతో ఆహార ధాన్యాలను కొని నిల్వ చేసుకుంటున్నారు. భూములు లేనివారు పిల్లలతో సహా కూలీకి వెళ్తున్నారు. కాగా, అఫ్ఘానిస్థాన్‌లో నూనెలు, గోధుమలు, బియ్యం వంటి ఆహార పదార్థాల ధరలు దాదాపు 55 శాతం పెరిగాయి. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎ్‌ఫపీ) ప్రకారం.. ప్రస్తుతం అఫ్ఘాన్‌లోని 3.9 కోట్ల జనాభాలో 2.3 కోట్ల మందికి సరిపడా ఆహారం అందడం లేదు. రెండు నెలల క్రితం తాలిబన్లు గద్దెను ఎక్కడానికి ముందు వరకు ఆహార సంక్షోభంలో ఉన్నవారి సంఖ్య 1.4 కోట్లే ఉండగా.. ఇప్పుడది 2.3 కోట్లకు పెరిగిందని డబ్ల్యూఎ్‌ఫపీ పేర్కొంది.


ముందు మహా సంక్షోభం 

‘‘అఫ్ఘాన్‌లో ఆకలి చావులు పెరిగే అవకాశాలున్నాయి. పిల్లల మరణాలు పెరగొచ్చు. రాబోయే చలికాలం (డిసెంబరు- మార్చి)లో ఆహార సంక్షోభం మరింత ముదరనుంది. ఇక్కడే ఉండి దాన్ని ఎదుర్కోవడమా? దేశం విడిచి వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడమా ? అనే ప్రశ్న పేద, మధ్యతరగతి ఎదుట నిలువనుంది.’’ 

- డేవిడ్‌ బీస్లే, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, డబ్ల్యూఎఫ్‌పీ

Updated Date - 2021-10-26T08:08:00+05:30 IST