అఫ్ఘాన్‌కు సాయం

ABN , First Publish Date - 2022-06-25T09:16:02+05:30 IST

అఫ్ఘాన్ ప్రజలను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాలిబాన్ ప్రవేశంతో అక్కడ ఆ మాత్రంగా ఉన్న బతుకులు కూడా దుర్భరమైపోతే, ఇప్పుడు ప్రకృతి కూడా వారిమీద కక్షకట్టింది.

అఫ్ఘాన్‌కు సాయం

అఫ్ఘాన్ ప్రజలను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాలిబాన్ ప్రవేశంతో అక్కడ ఆ మాత్రంగా ఉన్న బతుకులు కూడా దుర్భరమైపోతే, ఇప్పుడు ప్రకృతి కూడా వారిమీద కక్షకట్టింది. బుధవారం నాడు దేశాన్ని కుదిపేసిన శక్తివంతమైన భూకంపం దాదాపు పదిహేనువందలమందిని పొట్టనబెట్టుకుంది. గత ఏడాది ఆగస్టులో అమెరికా సేనలు ఆ దేశాన్ని విడిచిపోయిన వెంటనే అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబాన్ ఈ కష్టకాలంలో అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తోంది. అఫ్ఘాన్లను అన్నిరకాలుగా ఆదుకోమంటూ తాలిబాన్ అత్యున్నత నాయకుడు హైబతుల్లా అఖుండ్జాదా దేశాలన్నింటికీ విజ్ఞప్తిచేశారు. అఫ్ఘాన్‌తో బలమైన బాంధవ్యం ఉన్న భారతదేశం ఈ అత్యవసర సమయంలో వాయువేగంతో కదిలింది. భూకంపంలో దెబ్బతిన్న అఫ్ఘాన్‌కు తొలిగా సాయం చేసింది మనమేనని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.


సహాయసామగ్రితో పాటు ఒక బృందాన్ని కూడా పంపినట్టు, బృందంలోని సభ్యులు తాలిబాన్లతో కలసి ఈ సామగ్రిని పంచుతుందనీ, అక్కడి దౌత్యకార్యాలయం నుంచి పనిచేస్తుందనీ ప్రభుత్వం చెబుతోంది. అఫ్ఘాన్‌లో తాలిబాన్లు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారిగా కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయం పనిచేయడం ఆరంభించింది. భారత బృందం భద్రతకు తాలిబాన్లు ఒకటికిపదిసార్లు హామీ ఇచ్చారట. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు ఊహకు అందవు. వారం క్రితం రాజధాని కాబూల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారా మీద ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరిని చంపివేసిన విషయం తెలిసిందే. సెక్యూరిటీగార్డును కాల్చివేసిన తరువాత మెషీన్ గన్నులు, గ్రేనేడ్లతో భీకరమైన దాడి జరిగింది. బాంబుపేలుళ్ళతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. తాలిబాన్ ప్రభుత్వ దళాలకు, ఉగ్రవాదులకూ మధ్య గంటలపాటు జరిగిన భీకరపోరులో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. గురుద్వారాను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు తెచ్చిన కారుబాంబును నిర్వీర్యం చేయడం వల్ల పెనుప్రమాదం తప్పిపోయింది. అఫ్ఘానిస్థాన్‌లో సిక్కులమీద గతంలోనూ దాడులు జరిగాయి. 2018లో జలాలాబాద్‌లో 18మంది, 2020లో కాబూల్‌లో పాతికమంది కన్నుమూశారు. అఫ్ఘాన్‌లో క్రియాశీలకంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఖొరాసన్ ప్రావిన్స్) గ్రూపు ఈ దాడులకు కారణం. ప్రస్తుత దాడిని మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రతీకారంగా హిందువుల పక్షాన ఉన్న సిక్కులకు తగిన గుణపాఠం చెప్పేందుకు జరిపినట్టు ఈ ఉగ్రసంస్థ తేల్చింది. అఫ్ఘాన్ సిక్కులమీద ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అక్కడి సిక్కులను, హిందువులను వేగంగా తరలించడానికంటూ భారత ప్రభుత్వం కొన్ని ఈ వీసాలను కూడా జారీ చేసింది.


తాలిబాన్ల పాలనను భారత్ అధికారికంగా గుర్తించని విషయం తెలిసిందే. కానీ, సంబంధాలు సాగించకుండా వదిలేయడం మరింత ప్రమాదం. దౌత్యాన్ని నెరపండి, మాతో చేతులు కలపండి, వ్యాపార వాణిజ్యాలు చేయండి అంటూ తాలిబాన్లు భారత్‌కు విజ్ఞప్తిచేస్తూనే ఉన్నారు. భారత్ చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి ఆరంభించాలనీ, తమ విద్యార్థులను, రోగులను అనుమతించాలని కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ నెలారంభంలో భారతదేశం నుంచి అధికారుల బృందం తొలిసారిగా తాలిబాన్ అగ్రనేతలతో భేటీ అయింది. కేవలం అధికారులస్థాయిలో మాత్రమే ఈ చొరవ ప్రదర్శించడం ద్వారా ఇది తాలిబాన్ పాలనను గుర్తించడం కాదని కూడా చెప్పినట్టయింది. అలాగే, చాలా దేశాలు ఇప్పటికే దౌత్యసంబంధాలు నెలకొల్పుకున్న స్థితిలో అఫ్ఘాన్‌తో చరిత్రాత్మక బంధం ఉన్న భారత్ తన సుదీర్ఘకాలపు ఊగిసలాటను ఎట్టకేలకు వెనక్కునెట్టి ఓ అడుగుముందుకు వేసినట్టయింది. అఫ్ఘాన్‌లోని చాలా ప్రాంతాల్లో భారత్ చేపట్టిన ప్రాజెక్టుల, కార్యక్రమాల వాస్తవిక స్థితిని అంచనావేసే పని కూడా జరుగుతోందని అంటారు. అఫ్ఘానిస్థాన్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటూనే మరోపక్క భద్రతామండలిలో తాలిబాన్‌ను దులిపేయడానికి భారత్ సంకోచించలేదు. అఫ్ఘానిస్థాన్ వివిధ ఉగ్రవాద సంస్థలకు బలమైన స్థావరంగా ఉన్నదనీ, తాలిబాన్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఈ ప్రాంతాన్ని ప్రమాదంలో పడేస్తున్నదని భారత ప్రతినిధి తిరుమూర్తి ఘాటుగా విమర్శించారు. అఫ్ఘానిస్థాన్‌తో ఏదో ఒక స్థాయిలో సంబంధాలు సాగిస్తూనే బుజ్జగింపులు, హెచ్చరికలతో వ్యవహారాన్ని నెట్టుకురాక తప్పదు.

Updated Date - 2022-06-25T09:16:02+05:30 IST