400 మంది తాలిబన్ ఖైదీల విడుదలకు ఆఫ్ఘనిస్థాన్ ఆమోదం

ABN , First Publish Date - 2020-08-10T00:40:25+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో ఆదివారం గొప్ప పురోగతి కనిపించింది.

400 మంది తాలిబన్ ఖైదీల విడుదలకు ఆఫ్ఘనిస్థాన్ ఆమోదం

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో ఆదివారం గొప్ప పురోగతి కనిపించింది. 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆ దేశ గ్రాండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలకు మార్గం సుగమం అయింది. 


25 అధికరణలతో కూడిన తీర్మానాన్ని గ్రాండ్ అసెంబ్లీ ఆమోదించింది. ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద సంస్థలకు సహాయపడటం మానుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. 


ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత చర్చలకు తక్షణమే రావాలని తాలిబన్లను దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఇతర రాజకీయ నేతలు కోరారు. సమావేశాల ముగింపు రోజైన ఆదివారం ఘనీ మాట్లాడుతూ, తాను మిగిలిన 400 మంది తాలిబన్ ఖైదీల విడుదలకు ఈరోజే సంతకం చేస్తానన్నారు. 


విడుదల కాబోయే తాలిబన్ ఖైదీలు తిరిగి యుద్ధం చేయబోరని, వారి కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి, ప్రజలకు హామీ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్ గ్రాండ్ అసెంబ్లీలో వేలాది మంది మత పెద్దలు, సంఘ పద్దలు, రాజకీయ నేతలు ఉన్నారు. వీరంతా రాజధాని కాబూల్‌లో సమావేశమయ్యారు. తాలిబన్ ఖైదీల విడుదలతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.


Updated Date - 2020-08-10T00:40:25+05:30 IST