కాబుల్: తాలిబాన్లను తీసుకువెళుతున్న ట్రక్కే లక్ష్యంగా ఆఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో ఆదివారం బాంబు పేలుళ్లు జరిగాయి. జలాలాబాద్‌లో శనివారం జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇద్దరు మరణించిన మరుసటి రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బాంబు పేలుళ్లల్లో కొందరు తాలిబాన్లు గాయపడగా వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుకు బాధ్యులెవరో ఇప్పటివరకు వెల్లడికాలేదు.
అమెరికా మిలిటరీ దళాలను ఆగస్టు 30న ఉపసంహరించుకున్న అనంతరం జలాలాబాద్‌లో తొలిసారిగా పేలుళ్లు శనివారం రోజునే సంభవించాయి. ఆఫ్ఘానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు జలాలాబాద్ గుండెకాయ వంటిది. నన్‌గర్హర్ ఫ్రావిన్స్‌కు రాజధానిగా జలాలాబాద్ ఉంది. సున్నీ అతివాద మిలిటెంట్లకు ఇస్లామిక్ స్టేట్, తాలిబాన్లే లక్ష్యంగా మారారు.