himachalpradesh university: దిక్కుతోచని స్థితిలో అఫ్ఘానిస్థాన్‌ విద్యార్థులు!

ABN , First Publish Date - 2021-08-17T15:12:25+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల వశమయ్యింది. దీంతో అక్కడ...

himachalpradesh university: దిక్కుతోచని స్థితిలో అఫ్ఘానిస్థాన్‌ విద్యార్థులు!

సిమ్లా: అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల వశమయ్యింది. దీంతో అక్కడ అశాంతిపూరిత వాతావరణం నెలకొంది. హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న అఫ్ఘానీ విద్యార్థులు తమ దేశంలోని పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌పీయూలో 15 మంది అఫ్ఘానీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ  అఫ్ఘానిస్థాన్‌ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, కరెన్సీని మార్చకూడదని కోరారు. అదేవిధంగా భారత ప్రభుత్వం విద్యార్థుల స్టడీ వీసాను మరింతకాలం పొడిగించాలని అభ్యర్థించారు. 


వర్శిటీలో పొలిటికల్ సైన్స్ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థి మిస్బాహుద్దీన్ యూసూఫ్జై మాట్లాడుతూ అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితులు వస్తాయని తామెప్పుడూ భావించలేదన్నారు. తమ ఇంటిలోనివారు, చుట్టుపక్కలవారు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారని,  చాలామంది దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల మధ్య తమ చదువులు ఎలా సాగుతాయోనని మిస్బాహుద్దీన్ యూసూఫ్జై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఇదే యూనివర్శిటీలో ఎంబీఎం చదువుతున్న విద్యార్థిని సమీరా మాట్లాడుతూ అఫ్ఘానిస్థాన్‌లో తమవాళ్లు ఉంటున్న ప్రాంతంలో నైట్ కర్ఫ్యూ అమలువుతున్నదని, అక్కడివారంతా ఎప్పుడు ఏమవుతుందోననే బెంగతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారన్నారు.

Updated Date - 2021-08-17T15:12:25+05:30 IST