Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 30 Aug 2021 18:03:08 IST

ఆఫ్ఘన్ నుంచి కుమార్తెలతో కలిసి భారత్‌కు పారిపోయి వచ్చిన మహిళ.. ఏం చెప్పిందంటే?

twitter-iconwatsapp-iconfb-icon
ఆఫ్ఘన్ నుంచి కుమార్తెలతో కలిసి భారత్‌కు పారిపోయి వచ్చిన మహిళ.. ఏం చెప్పిందంటే?

న్యూఢిల్లీ: ‘‘వారు కనుక నన్ను చూస్తే చంపేయడం ఖాయం’’ తాలిబన్ల గురించి మాట్లాడుతూ 40 ఏళ్ల ఫరీబా అకేమీ అన్న మాటలివి. ఆఫ్ఘనిస్థాన్‌లోని మూడో అతిపెద్ద నగరమైన హెరాత్‌లో ఆమె నివసించేది. తన ఇద్దరు కుమార్తెలకు మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం భారత్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఫరీబా తాజాగా, ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గడువు అనేది లేకుండా తాలిబన్లు తనపై డెత్ వారెంట్ జారీ చేశారని గుర్తు చేసింది. స్వయంగా ఆమె భర్త కూడా తాలిబన్ ఫైటరే. చేసిన అప్పులు చెల్లించేందుకు ఆమె మరో ఇద్దరు కుమార్తెలను తాలిబన్లకు అమ్మేశాడు. దీంతో ఆమె భారత్‌కు పారిపోయి వచ్చేయాలని నిర్ణయించుకుంది. భారత ప్రభుత్వం తనకు శరణార్థి కార్డు మంజూరు చేస్తుందని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. 

‘‘రోడ్డుపై నేను నడుస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైన వచ్చి పొడిచేస్తారని కానీ, నా కుమార్తెలను అపహరించుకుపోతారని కానీ భయంగా ఉంటుంది. ఇండియా నాకు చాలా ఇచ్చింది. కానీ నేనిప్పుడు ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి నాకు సాయం కావాలి’’ అని ఫరీబా పేర్కొంది.


దేశంలో కరోనా విజృంభణకు ముందు ఫరీబా ఓ జిమ్‌లో పనిచేసేది. ఢిల్లీలో కరోనా ప్రభావం కారణంగా తన శరణార్థి కార్డు ప్రక్రియ కూడా నిలిచిపోయిందని తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి కారణంగా నా కేసు పెండింగులో ఉంది. నా జీవితంపై భయంగా ఉంది. కరోనా కారణంగా దాచుకున్న డబ్బులు హారతి కర్పూరం అవుతున్నాయి. నా జీవితంలో చాలా భాగం పనిచేయకుండానే గడిచిపోయింది’’ అని ఫరీబా ఆవేదన వ్యక్తం చేసింది. వారి అక్కలకు పట్టిన గతి వీరికి (కుమార్తెలు)కు పట్టకూడదని కోరుకుంటున్నానని, కాబట్టే సాధారణ మానవ హక్కు అయిన రక్షణ కల్పించమని వేడుకుంటున్నానని ఫరీబా పేర్కొంది. 


తాలిబన్లకు కుమార్తెల అమ్మకం

 ఫరీబా అకేమీకి 14 ఏళ్ల వయసులోనే వివాహమైంది. హెరాత్‌లో వివాహానికి ఓ వయసంటూ ఏమీ ఉండదు. ఫరీబా కంటే ఆమె భర్త 20 ఏళ్లు పెద్ద. ఫరీబా కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండడంతో వివాహానికి అంగీకరించక తప్పలేదు. నిజానికి అతడు ఏం చేస్తాడనేది తన కుటుంబంలో ఎవరికీ తెలియదని భర్త గురించి చెప్పింది. పెళ్లయిన వెంటనే ఫరీబాకు కష్టాలు మొదలయ్యాయి. ఆమెను కొట్టడం, హింసించడం మొదలుపెట్టాడు. కొన్ని సార్లు నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. భార్యను ఒక పనిమనిషిలా చూసేవాడు కావడంతో తనను ఎప్పుడూ బడికి పంపలేదని ఫరీబా ఆవేదన వ్యక్తం చేసింది. తన అదృష్టం ఇంతేనని సరిపెట్టుకున్నానని వివరించింది. తర్వాత వారికి నలుగురు అమ్మాయిలు పుట్టారు. 


పెద్దమ్మాయికి 14 ఏళ్లు వచ్చినప్పుడు ఫరీబా కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో అప్పులు తీర్చేందుకు ఆమె భర్త కుమార్తెను 5 లక్షల ఆఫ్ఘానిస్ (4,225 పౌండ్లు)కు అమ్మేశాడు. ‘‘ఆ సమయంలో మాకు ఎవరూ సాయం చేయలేదు. నేను ఏడ్వని రోజు లేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే మిగతా ముగ్గురు కుమార్తెలను అమ్మేస్తానని బెదిరించాడు’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకుంది. అయినప్పటికీ అతడు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసునున్న రెండో కుమార్తెను కూడా అమ్మేశాడు. దీంతో ఫరీబా పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెను వెతికి పెట్టమని వేడుకుంది. విషయం తెలిసిన ఫరీబా భర్త కత్తితో ఆమెపై దాడిచేశాడు. 


 

చంపేస్తామన్న తాలిబన్లు

ఆ తర్వాత ఫరీబా భర్త హెరాత్ నుంచి పారిపోయాడు. మరోవైపు, అతడి గురించి ఆరా తీసిన పోలీసులు అతడో తాలిబన్ ఫైటర్ అని గుర్తించారు. ‘‘అతడు పారిపోయిన తర్వాత తాలిబన్ల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. మూడో కుమార్తెను కూడా అతడు తమకు విక్రయించి డబ్బు తీసుకున్నాడని, ఆమెను ఇవ్వాలని చెప్పడంతో నా గుండె ఆగిపోయినంత పనైంది’’  అని ఫరీబా వివరించింది. అప్పటికే ఇద్దరు కోల్పోయిన ఫరీబా.. మిగతా ఇద్దరినీ రక్షించుకోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు తాలిబన్లు పదపదే  నోటీసులు పంపిస్తూ చంపేస్తామని బెదిరించసాగారు. 


‘‘ఇద్దరు పిల్లలతో కలిసి తప్పించుకున్నందుకు తాలిబన్లు నాపై కక్ష గట్టారు. చంపేస్తామని ప్రకటించారు. అయితే, నేను కోల్పోయిన ఇద్దరు పిల్లల గురించి మాత్రం చెప్పలేదు. వారికేమైందో తెలియదు. వారు బతికి ఉన్నారో, లేదో కూడా తెలియదు’’ అని కన్నీరు పెట్టుకుంది. తాలిబన్లు ఇప్పుడు షరియా చట్టాల ప్రకారం మహిళలను గౌరవిస్తారని చెబుతున్నా నమ్మడానికి లేదని ఫరీబా చెప్పుకొచ్చింది. అవన్నీ ఉత్తుత్తి మాటలేనని కొట్టిపడేసింది. తాలిబన్లను ఈ ప్రపంచానికే శత్రువులుగా అభివర్ణించింది. తాను తాలిబన్ల నుంచి తప్పించుకున్నప్పటికీ తనకు ఇంకా ముప్పు పొంచే ఉందని ఫరీబా ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఓ ఆఫ్ఘానీ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తాను ఢిల్లీలో ఉన్న విషయం తన భర్తకు తెలిసిపోయిందని ఫరీబా వివరించింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంతో  తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పుకొచ్చింది.


హెరాత్‌లో తనకు తల్లి, తండ్రి, సోదరులు, అక్కచెల్లెళ్లు ఉన్నారని తెలిపింది. వారి ముఖాలు చూసేందుకు వీడియో కాల్ చేసి మాట్లాడాలన్నా అక్కడ నెట్ సౌకర్యం అంతగా ఉండదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను వారిని కోల్పోయానని, వారి గురించి తలచుకుంటే భయమేస్తోందని కన్నీరు కార్చింది. వారికేమైనా అయితే తనను తాను క్షమించుకోలేనని ఫరీబా విలపించింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.