క్షమించండి ప్లీజ్‌!

ABN , First Publish Date - 2020-05-29T07:34:43+05:30 IST

గ్రామ సచివాలయాలకు రాజకీయ రంగులు వేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ధర్మాసనం ముందు

క్షమించండి ప్లీజ్‌!

  • ఆదేశాలు ఉల్లంఘించే ఉద్దేశం లేదు.. కోర్టులంటే ఎనలేని గౌరవం
  • రంగులు తొలగించేందుకు గడువుంది.. ‘కొత్త రంగుల’పై సుప్రీంకెళ్లాం
  • హైకోర్టులో సీఎస్‌, పీఆర్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ అఫిడవిట్లు
  • ‘ధిక్కరణ’ కేసులో కోర్టు ముందు హాజరు


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలకు రాజకీయ రంగులు వేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఆమెతోపాటు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌ కూడా కోర్టుకు వచ్చారు. ‘క్షమించండి. మీ ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం మాకు లేదు’ అంటూ వేర్వేరుగా కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేశారు. ‘‘పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల పతాక రంగులు వేయరాదన్న హైకోర్టు తీర్పును పాటించాం. ఆ తీర్పు వచ్చాక ఏ ఒక్క పంచాయతీ భవనానికీ ప్రభుత్వ వ్యయంతో రంగులు వేయలేదు.


అప్పటికి వేసిన రంగులను పది రోజుల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించగా, గడువు పొడిగించాలని కోరాం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మూడు వారాలపాటు గడువు కోరాం. మీరూ  ఆ గడువు ఇచ్చారు. ఇప్పటికీ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అంటే మాకు ఇంకా సమయం ఉన్నట్లే’’ అంటూ పాత ఆదేశాల అమలు గురించి వివరణ ఇచ్చారు. అలాగే... పాత రంగులను కొనసాగిస్తూ, కొత్తగా ఎర్రమట్టి రంగు జోడించడం గురించి కూడా కౌంటర్‌ అఫిడవిట్‌లో ప్రస్తావించారు. ‘‘పంచాయతీ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై మార్గదర్శకాలు రూపొందించి... ఆ మేరకు మట్టిరంగు, ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులు వేయాలని నిర్ణయించి జీవో ఇచ్చాం. ఆ జీవోను కూడా హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటషన్‌ వేశాం. కోర్టు ఆదేశాలను మేం ఉల్లంఘించామని న్యాయస్థానం భావిస్తే అందుకు మేం బేషరతుగా క్షమాపణ వేడుకుంటున్నాం. ఈ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయించడంతోపాటు ఈ కేసును మూసేయండి’’ అని అభ్యర్థించారు.


రంగులపై ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన జీవో 623ని కొట్టివేస్తూ... పాత ఆదేశాల అమలుకు 28వ తేదీవరకు ధర్మాసనం గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ధిక్కరణ’ కింద కోర్టు ముందు హాజరు కావాలని కూడా ఆదేశించడంతో... నీలం సాహ్ని, ద్వివేదీ, గిరిజా శంకర్‌లు.. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2020-05-29T07:34:43+05:30 IST