రెండేళ్ల క్రితమే స్కెచ్‌

ABN , First Publish Date - 2022-08-08T05:37:43+05:30 IST

రెండేళ్ల క్రితమే స్కెచ్‌

రెండేళ్ల క్రితమే స్కెచ్‌
నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులు

న్యాయవాది మల్లారెడ్డి హత్యకు 2020లోనే ప్లాన్‌

రూ.18 లక్షలకు డీల్‌.. తడక రమే్‌షకు బాధ్యతలు

వివరాలు వెల్లడించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌

ప్రత్యక్ష పాత్రదారులైన ఆరుగురి అరెస్టు 

ములుగు, ఆగస్టు 7 : రెండేళ్ల క్రితమే ప్లాన్‌ వేశా రు.. రూ.18 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నారు... పలుమా ర్లు సిట్టింగ్‌లు వేసి స్కెచ్‌ను అమలు చేశారు.  ఇదీ న్యాయవాది మల్లారెడ్డి హత్య కోసం తెరవెనుక ఉన్న ఉదంతం. మల్లారెడ్డితో కొంతకాలంగా ఏర్పడ్డ భూవివాదంతో విసిగిపోయిన గోనెల రవీందర్‌, పిండి రవియాదవ్‌, వంచ రామ్మోహన్‌రెడ్డి ఆయన్ను అంతమొందించేందుకు నిర్ణయించుకోగా ఆర్‌ఎంపీ (గ్రామీణ వైద్యుడు) ఆరుగురిని నియమించి డీల్‌ ఓకే చేశాడు.  ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ ఆదివారం ములుగు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మీడియా సమావేశం ఏర్పా టు చేసి ఈ వివరాలు వెల్లడించారు. హత్య సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న హనుమకొండ జిల్లా గంగిరేణిగూడానికి చెందిన పెరుమాండ్ల రాజు, పెరుమాం డ్ల రాకేష్‌, కర్నూలు జిల్లా కొక్కెరంచ గ్రామానికి చెందిన ఈడిగ జయరాం, ఈడిగ వేణు, నంద్యాల జిల్లా బుక్కా వెంకటరమణ, వరంగల్‌ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివను అరెస్టు చూపించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 

మల్లారెడ్డి  హత్యకు 2020 సంవత్సరంలోనే ప్లాన్‌ జరిగింది. గోనెల రవీందర్‌, పిండి రవియాదవ్‌, వంచ రామ్మోహన్‌రెడ్డి సూచన మేరకు తడక రమేష్‌  తన బంధువైన పెరుమాండ్ల రాజుకు బాధ్యతలు అప్పగించాడు. ప్లాన్‌పై చర్చించేందుకు సూత్రధారులతో పరిచయం చేయించాడు. రూ.18 లక్షలకు ఒప్పందం కుదిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన జయరామ్‌, వేణు, వెంకరమణతోపాటు నారక్కపేటకు చెందిన శివతో  రాజు పథక రచన చేసి కొంతమొత్తం అడ్వాన్సుగా చెల్లించాడు. మిగతా డబ్బులతో పాటు మల్లారెడ్డి సమాచార సేకరణ కోసం సుపారీ గ్యాంగ్‌ పలుమార్లు నర్సంపేటకు వచ్చి వెళ్లింది. ఈ క్రమంలో సరైన సమయం కోసం వేచి చూశారు.

ఇద్దరు రెక్కీ.. నలుగురు మాటువేసి..

ఈనెల 1న మల్లారెడ్డి ములుగుకు వచ్చినప్పటి నుంచి ఇద్దరు  ఆయన కదలికలపై రెక్కీ నిర్వహించా రు. నలుగురు వ్యక్తులు భూపాల్‌నగర్‌ బస్‌స్టేజీ వద్ద మాటువేశారు. సాయంత్రం 6.30 గంటల సమయం లో మల్లారెడ్డి హనుమకొండ వైపు కారులో బయల్దేర గా రెక్కీ చేసిన ఇద్దరు సమాచారం చేరవేసి వెంబడించారు. స్పీడ్‌బ్రేకర్‌ వద్ద మల్లారెడ్డి ప్రయాణిస్తున్న కా రు స్లోకాగానే వెనక నుంచి ఢీకొట్టారు. కారు దిగిన మల్లారెడ్డిపై మూకుమ్మడిగా కత్తులతో దాడిచేశారు. రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి పొట్ట, మెడ భా గాల్లో పొడిచారు. ఆయన ప్రతిఘటించడంతో హంతకుల్లో ఒకరైన జయరామ్‌కు గాయమైంది. మల్లారెడ్డి మృతి చెందాకా అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసు అధికారులకు అభినందన

ములుగు ఏఎస్పీ సుధీర్‌ ఆర్‌.కెకాన్‌ పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు ఐదు రోజుల్లో కేసును ఛేదించాయని ఎస్పీ తెలిపారు. అనుభవజ్ఞులైన పోలీసు అధికారులు నేర పరిశోధనలో సహకారం అందించారన్నారు. వారందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. మల్లారెడ్డి హత్యతో మరికొంత మందికి కూడా సంబంధం ఉందని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. భూ సంబంధిత సమస్యలు ఉంటే కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల ద్వారా పరిష్కరించుకోవాలి గానీ,  చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నేరాలకు పాల్పడొద్దని సూచించారు. లేకుంటే  చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  మీడియా సమావేశంలో ఓఎస్డీ గౌస్‌ఆలం, ఏఎస్పీ సుధీర్‌ ఆర్‌.కెకాన్‌, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, స్వామి, రాజు, రవీందర్‌, ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:37:43+05:30 IST