ఫేస్‌బుక్‌కు ప్రకటనల షాక్‌

ABN , First Publish Date - 2020-09-16T05:43:27+05:30 IST

సామాజిక మాధ్యమాలలో అగ్రస్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌లో తమతమ వాదనలను వినిపించే ఆవకాశం అందరికీ ఉన్నా సైబర్ గుండాగిరీని ఎదుర్కొంటూ వాదన వినిపించడం...

ఫేస్‌బుక్‌కు ప్రకటనల షాక్‌

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తోంది; వాస్తవాన్ని వక్రీకరించి భాష్యం చెబుతుండడం, దాన్ని యువతలో అనేకులు విశ్వసిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. సైబర్‌మూకలు సామాజిక మాధ్యమాలలో సైర్వవిహారం చేస్తుండగా సగటు మనిషి నిస్సహాయంగా చూస్తుండవలసి వస్తోంది.


సామాజిక మాధ్యమాలలో అగ్రస్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌లో తమతమ వాదనలను వినిపించే ఆవకాశం అందరికీ ఉన్నా సైబర్ గుండాగిరీని ఎదుర్కొంటూ వాదన వినిపించడం అంత సులభం కావడం లేదు. ఒక అంశంపై అర్థవంతమైన చర్చ జరగడానికి బదులుగా హేళన, వేళాకోళం జరుగుతోంది. విదేశాలలో మానవీయకోణంతో కలిసి మెలిసి ఉండే ప్రవాసీయులు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కులాలు, మతాల ప్రతిపాదికన చీలిపోయారు. కొన్ని సామాజిక, రాజకీయంశాలపై గల్ఫ్‌లో వాళ్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఉద్యోగాలు కోల్పోయి జైళ్ళ పాలయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.


ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాలను రాజకీయపార్టీలు వ్యూహాత్మకంగా వినియోగించుకుంటూ వీలయినంతగా వాస్తవాలకు వక్రభాష్యం చెబుతుండటంతో మరింత గందరగోళం కలుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్‌ ప్రమాదకారిగా పరిణమించిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తోందని సాక్షాత్తు కేంద్రప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలుతో పాటు అంతకు మించిన కీడు జరుగుతోందని వెల్లడించింది. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది, ఈ దుర్వినియోగంలో భారతీయ జనతాపార్టీ ముందు వరసలో ఉందనేది వేరే విషయం. భారతదేశంలో ఫేస్‌బుక్ వినియోగం, దానికి వాణిజ్య ప్రకటనలు ఇవ్వడంలో బీజేపీకి ఏ ఇతర రాజకీయ పక్షం సాటి రాదనేది ఇక్కడ గమనార్హం. భారత్ పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ రిలయెన్స్ జియో సంస్థలో 43 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఫేస్‌బుక్ ముందుకు వచ్చింది.


ఇంటర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరుగుతున్న కొద్దీ సామాజిక మాధ్యమాల పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య కూడ పెరుగుతోంది. ఫలితంగా వాటిలో వాణిజ్య ప్రకటనలు సైతం పెరుగుతున్నాయి. సంప్రదాయ పత్రికారంగం, ప్రసార సాధనాల కంటే ఎక్కువగా 26 శాతం వరకు డిజిటల్ మీడియాకు వాణిజ్య ప్రకటనలు పెరుగుతున్నట్లు అంచనా. డిజిటల్లో వచ్చే వాణిజ్య ప్రకటనలలో 70 శాతం ఫేస్‌బుక్, గుగూల్‌కు వెళ్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో వచ్చే సమాచారంపై విశ్వసనీయత ఉండాలని అనేక మంది కోరుకుంటున్నా వాటి యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోలేదు.


రాబోయే ఎన్నికల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీలయిన మేరకు తన స్థాయి దిగజారి సామాజిక మాధ్యమాల ద్వారా చౌకబారు చర్యలకు పాల్పడుతారనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి వరకు ఫేస్‌బుక్‌లో వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదని ఆ దేశ వాణిజ్య దిగ్గజం యూనిలీవర్ నిర్ణయించడం సంచలనం సృష్టించింది.


‘సినీతారల సౌందర్య రహస్యం – లక్స్’ అంటూ అర్ధ శతాబ్ది పైబడి వస్తున్న వాణిజ్య ప్రకటన ఈ సంస్థ సొంతం. 1960లో మహానటి సావిత్రి నుంచి మొదలు నేటి తరం సినీతారల వరకు, నాటి నల్లటి సిరాపత్రికల నుంచి నేటి డిజిటల్ మాధ్యమాల వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య ప్రకటనలలో హిందుస్తాన్ లివర్ అగ్రభాగాన ఉంది. ఒక్క భారతదేశంలో ఈ సంస్థ సుమారు 3200 కోట్ల రూపాయలను వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేస్తుండగా అందులో సామాజిక మాధ్యమాలలో ముందు వరుసలో ఉండే ఫేస్‌బుక్‌పై చెప్పుకోదగ్గ మొత్తాన్నే వెచ్చిస్తోంది.


కోకాకోలా, మైక్రోసాఫ్ట్, డిస్నీ తదితర దిగ్గజాలు కూడ ఫేస్‌బుక్‌కు వాణిజ్య ప్రకటనలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. దాంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమాచారంలో పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి కొన్ని చర్యలు చేపట్టనున్నట్లుగా ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ రకమైన ఒత్తిడిని భారత్‌లో కూడ తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా నియంత్రించడానికి కృషి చేస్తున్నట్లుగానే సోషల్ మీడియాలో పెరుగుతున్న సామాజిక, రాజకీయ వైరస్‌ను అరికట్టడానికి అందరు ప్రయత్నించాలి. భారత్ లాంటి వైవిధ్యభరిత, సువిశాలం దేశంలో ఫేస్‌బుక్ వాక్ స్వేఛ్ఛతో పాటు తన బాధ్యతలను కూడ గుర్తెరిగి వ్యవహరించాలి.

మోహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-09-16T05:43:27+05:30 IST