నగరంలో ప్రకటనల మాయాజాలం

ABN , First Publish Date - 2021-02-25T06:01:16+05:30 IST

ప్రకటనల బోర్డుల ద్వారా పొరుగునే ఉన్న జిల్లాలో ఏడాదికి రూ.2.5 కోట్ల ఆదాయం వస్తోంది. 12 లక్షల జనాభా ఉన్న విజయవాడలో రూ.100 కోట్లు సమకూరుతోంది.

నగరంలో ప్రకటనల మాయాజాలం

  1. రూ.కోట్ల కేఎంసీ నిధులు హాంఫట్‌
  2. ఏళ్ల తరబడి సాగుతున్న నిర్లక్ష్యం 
  3. టెండర్లను తొక్కిపెట్టిన టౌన్‌ ప్లానింగ్‌

కర్నూలు-ఆంధ్రజ్యోతి: ప్రకటనల బోర్డుల ద్వారా పొరుగునే ఉన్న జిల్లాలో ఏడాదికి రూ.2.5 కోట్ల ఆదాయం వస్తోంది. 12 లక్షల జనాభా ఉన్న విజయవాడలో రూ.100 కోట్లు సమకూరుతోంది. కానీ సుమారు 6 లక్షల జనాభా ఉన్న కర్నూలు నగరంలో మాత్రం ఏటా రూ.1.32 కోట్లు మాత్రమే ఉంది. దీని వెనుక కొందరు అధికారుల మాయాజాలం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బోర్డులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌ పద్ధతిన తమకు నచ్చిన వారికి కట్టబెట్టి తామూ కొంత జేబులు వేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవల ఉన్నతాధికారులు ఆరా తీస్తే విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. దీంతో వారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తుండగా.. ఓ ప్రజాప్రతినిధి మాత్రం బోర్డులన్నీ తమవారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. 


1994 నుంచి అంతే..

కర్నూలును మున్సిపాలిటీ 1994లో కార్పొరేషన్‌గా అప్‌ గ్రేడ్‌ అయింది. కార్పొరేషన్‌ పరిధి 110 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 6 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇంటి పన్నులు, డ్రైనేజీ, సీవరేజితో పాటు ప్రకటనల పన్ను రూపేణా కూడా కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చుంటున్నారు. హోర్డింగ్‌లు, బస్‌ షెల్టర్స్‌, యూనిపోల్‌, లాలీపాప్స్‌, టీ టైప్‌ బోర్డులు, రొటేటింగ్‌ బోర్డులు, ఆర్చ్‌లు, సినిమా హాళ్లపై ప్రకటనలు తదితరాలు కలిసి నగరంలో 613 పైగా బోర్డులు న్నాయని అంచనా. ఇవి కాకుండా 2012లో రోడ్డు మధ్యన డివైడర్లలోనూ 212 లాలిపప్స్‌ను ఏర్పాటు చేశారు. టెండర్ల ద్వారా కేటాయించాల్సిన వీటిని నామినేషన్ల రూపేణా నచ్చిన వారికి కట్టబెడుతున్నారు. ఇందులో ఎంత ఆదాయం వస్తోంది? ఎంత ఖజానాకు జమ అవుతోంది? ఎంత ఎంత మింగేస్తున్నారు? అన్నది అధికారులకే తెలియాలి. 


గెజిట్‌ను అడ్దు పెట్టుకుని..

నగరంలో 24 రకాల ప్రకటనల బోర్డులున్నాయి. లైటింగ్‌, నాన్‌-లైటింగ్‌, రొటేటింగ్‌, ట్రావెల్‌ యాడ్స్‌.. ఇలా ఒక్కో తరహా ప్రకటనకు ఒక్కో ధరను కేఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే హోర్డింగ్‌లు, లాలీపప్స్‌లోని యాడ్‌కు సంబంధించి మీటరుకు రూ.500 చొప్పున, మిగిలిన వాటికి టారిఫ్‌ ప్రకారం లెక్కించి పన్నులు వసూలు చేస్తున్నామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. అయితే అవన్నీ అధికారులు నిర్ణయించిన ధరలే కావడంతో తమకు అనుకూలంగా కొందరు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. 2010లో చివరిసారి లోకల్‌బాడీ పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత కేఎంసీ నిర్వహణ ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది. ప్రత్యేకాధికారి గెజిట్‌ నిర్ణయం మేరకే హోర్డింగ్‌లకు పన్నులు వసూలు చేయాలనే నిర్ణయాన్ని అధికారులు తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి ఆ గెజిట్‌పై ఏడాదికి 10 శాతం పెంచుతూ కార్పొరేషన్‌ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సభ్యుల గెజిట్‌ ఆమోదం మేరకు అంటూ నచ్చిన ప్రైవేట్‌ ఏజెన్సీలకు ఆ కాంట్రాక్టులను నామినేషన్ల పద్ధతిలో కట్టబెడుతూ వచ్చారు. కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా ఉన్నా.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి వెళ్లకుండా కొందరు కార్పొరేషన్‌ అఽధికారులు పావులు కదిపారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో 16 ఏజెన్సీలు ఆ కాంట్రాక్టులు దక్కించుకుంటూ ప్రస్తుతం రూ.1,32,26,789 చెల్లిస్తూ వచ్చాయి.


కీలక ప్రజాప్రతినిధి కన్ను

ఇటీవల వీటిపై ఓ ప్రజాప్రతినిధి దృష్టి సారించారు. ఆ కాంట్రాక్టులు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీనిపై కేఎంసీ, జిల్లా ఉన్నతాధికారులపై ఆయన ఒత్తిళ్లు తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆరా తీయగా ప్రకటనల డొంక కదిలింది. టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిన ఇవ్వడమే సమస్యకు కారణమని గుర్తించారు. ఈ పద్ధతిని రద్దు చేసి ఈ-టెండర్ల ద్వారా కాంట్రాక్టు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇతర జిల్లాలు, కార్పొరేషన్లలో అవలంబిస్తున్న విధి విధానాలపై కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేకాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి మాత్రం టెండర్లకు వెళ్లకుండా తమకే కట్టబెట్టాలని డిమాండ్‌ చేస్తున్నట్ల సమాచారం. కేఎంసీలో జరుగుతున్న ఈ అక్రమ వసూళ్లపై ఇప్పటికే కమిషనర్‌కు కూడా కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందాయని సమాచారం. 




ఇవీ లెక్కలు

బోర్డులు సంఖ్య

హోర్డింగ్‌లు:295

బస్‌ షెల్టర్స్‌: 56

యూని పోల్‌: 7

లాలీపాప్స్‌:212

టీ టైప్‌ బోర్డులు:11

రొటేటింగ్‌ బోర్డులు:8

ఆర్చ్‌లు:2

సినిమా హాల్స్‌:20 


గెజిట్‌ ప్రకారం పన్ను వసూలు చేస్తున్నాం

గెజిట్‌ ప్రకారమే పన్ను వసూలు చేస్తున్నాం. మున్సిపల్‌ స్థాయి నుంచి కార్పొరేషన్‌గా మారినప్పటి నుంచి కొనసాగుతున్న విధానాన్నే పాటిస్తున్నాం. టెండర్‌ ప్రక్రియ చేపట్టాలని కమిషనర్‌ ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరేందుకు ఏ అవకాశం ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. హోర్డింగ్‌లో మీటర్ల ప్రకారం ప్రస్తుతం ఏడాదికి ఒక సారి పన్ను వసూలు చేస్తున్నాం. -  కోటయ్య, డీసీపీ


Updated Date - 2021-02-25T06:01:16+05:30 IST