Abn logo
Nov 24 2020 @ 00:11AM

వాజపేయికి ఆడ్వాణీ చెక్‌ !

వాజపేయి అనుకున్నదేమిటంటే - మోదీ చేత రాజీనామా చేయించేలా ఆ సాయంత్రం సమావేశాల్లో ఆడ్వాణీ కథ నడిపిస్తారని. అయితే, ఆ సమావేశాలకు హాజరైన ఆర్థికమంత్రి యశ్వంత్‍ సిన్హాకి అది మరోరకమైన ప్రణాళిక ప్రకారం నడిచిన కథలా అనిపించింది. ‘సభ్యుల నుంచి వచ్చిన ఆ స్పందన వెల్లువ సహజమైంది కాదు. అది ఎవరో ముందుగా ప్లాన్‍ చేసి చేయించారు. మేం ముందనుకున్నాం– మోదీ రాజీనామా ఇవ్వటానికి సిద్ధపడతారని, దాన్ని సభ్యులు వ్యతిరేకిస్తారని, చివరికి రాజీనామాని ఈ సమావేశాలు తిరస్కరిస్తాయని. ఇదంతా ఆడ్వాణీకి తెలిసి జరిగిన విషయం. ఈ ఆడ్వాణీ ప్లాన్‌లో అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా భాగస్వాములే.’


ఆవిమానం గోవాలో దిగింది. విమానంలోంచి మంత్రులు, అధికారులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అందరూ మళ్లా సాయంత్రం మారియట్‍ హోటల్‍లో కలుసుకున్నారు. సుమారు 250 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఆ హాల్‍లో ఉన్నారు. వేదికమీద ముగ్గురు ప్రముఖులు కూర్చున్నారు. వారు ప్రధానమంత్రి అటల్‍ బిహారీ వాజపేయి, దేశీయాంగ శాఖామంత్రి ఎల్‍.కె. ఆడ్వాణీ, అప్పటి పార్టీ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి. వేదిక కింద కార్యవర్గసభ్యుల్లో మధ్యవరుసలో నరేంద్రమోదీ కూర్చున్నారు. ఆ సాయంత్రం సమావేశంలో అందజేసిన కార్యక్రమావళి ప్రకారం గుజరాత్‌లో ఘర్షణల గురించి మర్నాడు చర్చిస్తారు. కాని, ఆ సాయంత్రం అధ్యక్షోపన్యాసం అవగానే మోదీ లేచి నిలబడ్డారు. ఆయన తాను తీసుకున్న చర్యలను సమర్థిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. చివరగా ఒక మాట చెప్పారు: ‘నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. పార్టీకి ఎలాంటి నష్టం కలగకూడదు. అందుకని, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నాను.’


ఇక్కడిదాకా అంతా వాజపేయి చెప్పినట్టు జరుగుతోంది. అకస్మాత్తుగా కొంతమంది ‘కళాకారులు’ వేరే ప్రణాళిక ప్రకారం మాట్లాడటం మొదలుపెట్టారు. చాలామంది జాతీయ కార్యవర్గ సభ్యులు ‘మోదీ ఉండాలి... మోదీ ఉండాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. కొంతమంది వక్తలు ఒకరి తరువాత ఒకరు లేచి మోదీని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. మళ్ళీ నినాదాలు ‘మోదీ...మోదీ...మోదీ...’ ఆ మాటలే హాలులో ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడ సాగర తరంగాల్లా వచ్చి పడిపోతున్న ఉద్విగ్న భావాలతో వేదిక మీద వాజపేయి మొహం చిన్నబోవటం అందరికీ కనిపిస్తోంది. ఇలా ఊరుకుంటే ఈ సాయంత్రం కార్యక్రమం మన అదుపు తప్పిపోయేలా ఉంది అని భావించిన వాజపేయి, అక్కడ ప్రసంగిస్తున్న వక్తలను ఆపుతూ ఒక మాట అన్నారు: ‘మనం ఈ విషయాలు రేపు చర్చించుకుందాం. ఇప్పుడు బయట బహిరంగసభకి వెళ్లాల్సి ఉంది కదా!.’


అసలు వాజపేయి అనుకున్నదేమిటంటే - మోదీ చేత రాజీనామా చేయించేలా ఆ సాయంత్రం సమావేశాల్లో ఆడ్వాణీ కథ నడిపిస్తారని. అయితే, ఆ సమావేశాలకు హాజరైన ఆర్థికమంత్రి యశ్వంత్‍ సిన్హాకి అది మరోరకమైన ప్రణాళిక ప్రకారం నడిచిన కథలా అనిపించింది. ‘సభ్యుల నుంచి వచ్చిన ఆ స్పందన వెల్లువ సహజమైంది కాదు. అది ఎవరో ముందుగా ప్లాన్‍ చేసి చేయించారు. మేం ముందనుకున్నాం - మోదీ రాజీనామా ఇవ్వటానికి సిద్ధపడతారని, దాన్ని సభ్యులు వ్యతిరేకిస్తారని, చివరికి రాజీనామాని ఈ సమావేశాలు తిరస్కరిస్తాయని. ఇదంతా ఆడ్వాణీకి తెలిసి జరగాల్సిన విషయం. ఈ ఆడ్వాణీ ప్లాన్‍లో అరుణ్‍ జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా భాగస్వాములే.’ 


ఆడ్వాణీ, వాజపేయిలకు సన్నిహితులైన సుధీంద్ర కులకర్ణి అంటారు: ‘ఆ కార్యవర్గ సమావేశాల్లో సభ్యుల మూడ్‌ని, వాళ్ల మనోభావాల్ని వాజపేయి చూశారు. అందుకే ఆడ్వాణీ దృఢనిశ్చయంతో సంబంధం లేకుండా, వాజపేయి తన నిర్ణయం మార్చుకున్నారు. అక్కడ జరిగిన ప్రసంగాలు, నినాదాల్లో కొన్ని మోదీకి అనుకూలంగా ఎవరైనా కావాలని చేసి ఉండవచ్చు కూడా’. దినేష్‍ త్రివేది అభిప్రాయం ప్రకారం– ‘మోదీ మేనేజ్‍మెంట్‌లో ఏదీ సహజసిద్ధంగా పుట్టుకురాదు. అలా కనబడేలా చేస్తారు. అంతే’.


ఆ ముందు రోజు ఏం జరిగిందంటే...అరుణ్‍ జైట్లీ గాంధీనగర్‍ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని కలిశారు. బిజెపిలో ఒక కీలకమైన వ్యక్తి చెప్పినదాని ప్రకారం: ఆడ్వాణీ ఆదేశాల మేరకు అరుణ్‍ జైట్లీ ఆ రాత్రి గాంధీనగర్‍లోనే మోదీతో కలిసి ఉన్నారు. తెల్లవారగానే ఇద్దరు కలిసి విమానంలో గోవా చేరుకున్నారు. గుజరాత్‍ బిజెపి నాయకుడు ఒకరు చెప్పారు: ‘జైట్లీ, మోదీ కలిసి మాట్లాడుకున్నప్పుడు నేను అక్కడ లేను. కాని, వాళ్ల సంభాషణ అంతా గోవాలో జరగబోయే కార్యవర్గ సమావేశం గురించే.’ ఈ నాయకుడి అనుమానం ఏమిటంటే మరునాడు కార్యవర్గ సమావేశాల్లో మోదీకి అనుకూలంగా ఎవరు బాహాటంగా మాట్లాడగలరో, వాళ్లని ఎంపిక చేయటం గురించే వాళ్లు మాట్లాడుకుని ఉంటారు.


ఎన్నికల్ని ఆరు మాసాలు ముందుకు జరపాలని మోదీ చేసిన అభ్యర్థనను భారతదేశంలో స్వతంత్రంగా వ్యవహరించే ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఉత్తముడైన జె.ఎం.లింగ్డో ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన ఇలా ఎన్నికల్ని ఆరుమాసాలు ముందుగా నిర్వహించటంలో ఉన్న సాధ్యాసాధ్యాల్ని పరిశీలించవలసిందిగా ఒక బృందాన్ని గుజరాత్‌కి పంపించారు. అప్పటికింకా గుజరాత్‌లో చెదురుమదురుగా హింసాత్మక సంఘటనలు జరుగుతూండటం, ముస్లిం శరణార్థుల శిబిరాలు కొనసాగుతూండటం లింగ్డో నిర్ణయానికి కారణం. మొత్తం మీద ఆ బృందం గుజరాత్‍ రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికలను నిర్ణీత కాలానికే (2002 డిసెంబర్‍) జరపాలని నిర్ణయించింది. (ముందుకు జరపడానికి విముఖత వ్యక్తం చేసింది)­.


ఎన్నికలు ముందుకు జరపాలని రాష్ట్రమంత్రివర్గం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కాదని ఎన్నికల సంఘం నిర్ణీతకాలానికే ఎన్నికలు జరుపుతాననటం నిష్పాక్షికంగా లేదని మోదీ అభిప్రాయపడ్డారు. అందుకని ఆయన జేమ్స్ మైఖేల్‍ లింగ్డోని పూర్తి పేరుతో ప్రస్తావించారు. పైగా, ఆయన ‘ఇటాలియన్‍’ అని కూడా అన్నారు. అంటే, ఆయన ఇటాలియన్‍ క్రైస్తవుడని అందరికీ తెలిసేలా మోదీ పలికారు. మోదీ ఇలా ‘అసభ్యకరమైన’ భాషను ప్రయోగించటం తగదని వాజపేయి, మురళీమనోహర్‍ జోషి మందలించారు. ఆడ్వాణీ మాత్రం మోదీని సమర్థిస్తూనే ఉన్నారు. కేంద్రమంత్రివర్గం ఒక తీర్మానం ద్వారా రాష్ట్రపతి ఆదేశాలను సుప్రీంకోర్టుకు పంపించి, ఎన్నికల కమిషన్‍ నిర్ణయాన్ని మార్పించాలని ఆడ్వాణీ కోరారు. 2002 ఆగస్టు 18న జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఆడ్వాణీతో వాజపేయి ఏకీభవించలేదు. అవసరమైతే, రాజీనామాకైనా సిద్ధమే అన్న సంకేతాన్ని ఇచ్చారు. వాజపేయి, ఆడ్వాణీల మధ్య ఇదొక కొత్త విభేదం. అయితే, ఎన్నికల కమిషన్‍ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు ఖరారు చేయటంతో ఆ సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. ఊరట చెందిన వాజపేయి ఎన్నికల సంఘం వ్యవహార సరళిని బాహాటంగానే ప్రశంసించారు.

(వినయ్‌ సీతాపతి కొత్త పుస్తకం ‘జుగల్బందీ: ద బీజేపీ బిఫోర్‌ మోదీ’ లోని ఒక భాగం ఇది. వల్లీశ్వర్‌ అనువదించగా ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకం ఆవిష్కరణ నేడు జరగనుంది)

Advertisement
Advertisement
Advertisement