Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Jun 2022 15:58:49 IST

లివర్‌ క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స

twitter-iconwatsapp-iconfb-icon
లివర్‌ క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స

మన కాలేయం 500 రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది. ఈ అతి పెద్ద అంతర్గత అవయవం, అతి పెద్ద గ్రంథి కూడా! 1.5 కిలోల బరువుండే కాలేయం, విషతుల్యమైన పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ఽధూమపానాల ప్రభావాలతో వాపుకు గురవుతుంది. దాన్నే హెపటైటిస్‌ అంటారు. వైరల్‌ హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్‌లవల్ల కలుగుతుంది.  వీటిలో బి, సి రకాలు ప్రమాదకర మైనవి. రక్త మార్పిడి, అరక్షిత శృంగారం ద్వారా ఈ వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి సోకడంతో పాటు, తల్లి నుంచి బిడ్డకు కూడా సోకుతాయి. హెపటైటిస్‌ ‘బి’ సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. కానీ హెపటైటిస్‌ ‘సి’కి వ్యాక్సిన్‌ లేదు. అలాగే హెపటైటిస్‌ ‘బి’ పాజిటివ్‌ ఉన్నవాళ్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పరీక్ష చేయించుకుని, నెగటివ్‌ వస్తే, ఏ వయసు వారైనా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. పిల్లలకు టీకా షెడ్యూల్‌తో పాటు ఈ వ్యాక్సిన్‌ను కూడా వేయిస్తే సరిపోతుంది.


ఆకలి మందగించడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం లాంటి వాటిని ఆశ్రయించకుండా కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవాలి. లివర్‌ ఇన్‌ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్‌, లివర్‌ యాబ్సెస్‌, విల్సన్‌ డిసీజ్‌, గిల్బర్ట్‌ సిండ్రోమ్‌ వ్యాధులున్నప్పుడు, హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్లు సోకడం ప్రమాదకరం. ఈ ఇన్‌ఫెక్షన్లు కొన్నేళ్లకు కాలేయాన్ని గాయపరిచి, గట్టిపరిచి (సిర్రోసిస్‌) అంతిమంగా క్యాన్సర్‌కు దారి తీస్తాయి. లివర్‌ క్యాన్సర్లలో హెపటోసెల్యులర్‌ కార్సినోమా (కాలేయంలో మొదలైన క్యాన్సర్‌), మెటాస్టాటిక్‌ లివర్‌ క్యాన్సర్‌ (ఇతర శరీరావయవాల నుంచి కాలేయానికి క్యాన్సర్‌ సోకడం) అనే రెండు రకాల క్యాన్సర్లు ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు కాలేయానికి వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్‌ క్యాన్సర్‌ కూడా ఎంతో ప్రమాదకరం. 


కాలేయ క్యాన్సర్‌లో లక్షణాలు కనిపించవు కాబట్టి ఇతర ఆరోగ్య సమస్యలుగా పొరబడే ప్రమాదం ఉంటుంది. కడుపులో నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, పొట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం ఆకలి లేకపోవడం మొదలైన ఇబ్బందులు కాలేయ క్యాన్సర్‌ చివరి దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా, హెపటైటిస్‌ బి, సి పాజిటివ్‌ ఉన్నా, మద్యం సేవించే అలవాటున్నా రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య, చక్కెర, క్యాల్షియం, కొలెస్ట్రాల్‌, ఆల్ఫా ఫిటో ప్రొటీన్‌లను తెలిపే రక్తపరీక్షలతో పాటు అలా్ట్రసౌండ్‌, డాక్టరు సలహాతో సిటి, ఎమ్‌ఆర్‌ఐ, పిఇటి స్కాన్‌లు, లివర్‌ బయాప్సీతో లివర్‌ క్యాన్సర్‌ దశలనూ తెలుసుకోవచ్చు. 


కణితిని చిన్నదిగా ఉన్నప్పుడే కనిపెట్టినా, సిర్రోసిస్‌ కారణంగా సర్జరీ సాధ్యపడకపోవచ్చు. కీమోథెరపీ, ట్రాన్స్‌ ఆర్టీరియల్‌ ఎంబొలైజేషన్‌, రేడియో అబ్లేషన్‌, ఫొటాన్‌ బీమ్‌ థెరపీ, బయో థెరపీ, కీమో అబ్లేషన్‌, స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీ లాంటి అనేక పద్ధతులతో కణితిని తొలగించడం లేదా తగ్గించే ప్రయత్నాలు చేయవచ్చు. కణితి చిన్నదిగా ఉండి, కాలేయం ఫెయిల్‌ కాకుండా ఉన్నప్పుడు సర్జరీని ఎంచుకుంటారు. కణితి పెద్దదిగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, కాలేయం ఫెయిల్యూర్‌ దశకు చేరుకుంటున్నా కాలేయ మార్పిడి చేయడం వల్ల ఫలితం దక్కుతుంది. ఈ క్యాన్సర్లకు హెపటైటిస్‌ బి కారణం కాబట్టి వ్యాక్సిన్‌ వేయించడం ద్వారా కాలేయ క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు.


 డాక్టర్ మోహనవంశీ

చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్,

ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్

హైదరాబాద్.

ఫోన్: 98480 11421

లివర్‌ క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.