‘సైబర్‌ నైఫ్‌’తో క్యాన్సర్‌కు అత్యాధునిక రోబోటిక్‌ రేడియో సర్జరీ

ABN , First Publish Date - 2022-06-14T06:13:06+05:30 IST

క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

‘సైబర్‌ నైఫ్‌’తో క్యాన్సర్‌కు అత్యాధునిక రోబోటిక్‌ రేడియో సర్జరీ

క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్యాన్సర్‌ చికిత్సకు అడ్డుకట్ట వేసి దుష్ప్రభావాలను తగ్గించడం ఈ ఆధునిక చికిత్సల లక్ష్యం. అలాంటి లక్ష్యాల్లో ఒకటైన రేడియేషన్‌ థెరపీలో భాగంగా సైబర్‌నైఫ్‌ చికిత్సతో క్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చు.

క్యాన్సర్‌ తొలి దశలో క్యాన్సర్‌ కణాలు ఉన్న భాగంతో పాటు, దాని చుట్టూరా ఉన్న కణజాలం, లింఫ్‌ గ్రంథులను తొలగించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, పాంక్రియాస్‌, కాలేయంలో కణుతులు తలెత్తినప్పుడు, సర్జరీ కష్టసాధ్యంగా మారినప్పుడు, చిన్న కణితులను తొలగించవలసి వచ్చినప్పుడు, కోత లేకుండా ‘మిస్సైల్‌ టెక్నాలజీ’తో కణితిని మాయం చేసే రేడియేషన్‌ విధానమైన రోబోటిక్‌ రేడియో సర్జరీని ఆశ్రయించవచ్చు. క్యాన్సర్‌ కణాలే లక్ష్యంగా శరీరంలోని ఏ భాగం దగ్గరకైనా చేరుకోగలిగి, ఖచ్చితమైన చికిత్సను అందించగలిగే రేడియేషన్‌... సైబర్‌ నైఫ్‌ రేడియేషన్‌. 


1896 నుంచి క్యాన్సర్‌ వ్యాధికి రేడియేషన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, శతాబ్ద కాలంలో ఈ ప్రక్రియ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందింది. తగిన మోతాదులో ఇవ్వకపోవడం వల్ల రేడియేషన్‌ ఫలితంగా దుష్ప్రభావాలు తలెత్తుతూ ఉంటాయి. కొన్ని దుష్ప్రభావాలు తాత్కాలికంగా, మరికొన్ని శాశ్వతంగా బాధిస్తాయి. రేడియేషన్‌ ఇచ్చిన అవయవం ఆధారంగా, వాంతులు, వికారం, వాపు, చర్మం కందిపోవడం, సాగే గుణం కోల్పోవడం, నోటిలో పుండ్లు, జుట్టు రాలడం, సంతాన లేమి సమస్యలు తలెత్తుతాయి. కత్తితో పని లేకుండా రేడియో సర్జరీ చేసి, కణితిని తొలగించే ఈ ప్రక్రియలో పెన్సిల్‌ బీమ్‌ సహాయంతో మనిషి అందించే సూచనల సహాయంతో పాయింటెడ్‌ రోబోట్‌లతో వైద్యులు రేడియో సర్జరీ చేయగలుగుతున్నారు. ఐదు లేదా ఆరు వారాలు పట్టే రేడియో థెరపీని సైబర్‌ నైఫ్‌తో ఒకటి లేదా రెండు రోజుల్లోనే ముగించవచ్చు. నొప్పి లేకపోవడం, మత్తుమందు అవసరం లేకపోవడం, రేడియేషన్‌ సమయంలో ఫ్రేమ్స్‌ అవసరం లేకపోవడం, ఊపిరి బిగపట్టి ఉండవలసిన అవసరం లేకపోవడం ఈ సర్జరీ ప్రత్యేకతలు. చికిత్స తర్వాత రోగి విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉండదు. శరీరంలో కణితి ఎంత చిన్నదిగా ఉన్నా, సూటిగా, ఖచ్చితమైన రేడియేషన్‌ అందుతుంది. సర్జరీ భయం ఉన్నవాళ్లకు నిమిషాల వ్యవధిలో కణితిని తొలగిస్తుంది. 


క్యాన్సర్‌ కాని మెనింజియోమాస్‌, పిట్యూటరీ గ్రంథిలోని కణుతులు, మెదడు లోపల, బయట ఉండే కణుతులు, వెన్నెముక మీద తలెత్తే కణుతులను సైబర్‌ నైఫ్‌ సమర్థంగా తొలగిస్తుంది. రేడియేషన్‌ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుంది. రోగి వయస్సు, క్యాన్సర్‌ దశ, కణితి గ్రేడ్‌, క్యాన్సర్‌ సోకిన అవయవం మొదలైన అంశాల ఆధారంగా చికిత్సలో భాగంగా వైద్యులు రోబోటిక్‌ రేడియో సర్జరీని ఎంచుకుంటారు. కొన్నిసార్లు క్యాన్సర్‌ తిరగబెట్టిన అవయవానికీ, లేదా వాల్యుమెట్రిక్‌ మాడ్యులేటెడ్‌ ఆర్క్‌ థెరపీ, ఇతర రేడియేషన్‌ పద్ధతులతో పాటు ఈ సైబర్‌ నైఫ్‌ చికిత్స అవసరం కూడా ఉంటుంది.  

Updated Date - 2022-06-14T06:13:06+05:30 IST