ముందస్తు పాలిట్రిక్స్‌!

ABN , First Publish Date - 2022-01-23T05:49:45+05:30 IST

జిల్లా అధికార పార్టీలో అప్పుడే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేక పోయినప్పటికీ కొందరు నేతలు ముందస్తు పాలిటిక్స్‌తో దూకుడు పెంచుతున్నారు.

ముందస్తు పాలిట్రిక్స్‌!


జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తున్న సొంత పార్టీ నేతలు
పక్కా ప్లాన్‌తో అసెంబ్లీ సీటుపై గురి
నియోజకవర్గాల్లో అనధికారికంగా విస్తృత పర్యటనలు
అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం
 అయోమయంలో అధికార పార్టీ శ్రేణులు

ఆదిలాబాద్‌, జనవరి22 (ఆంధ్రజ్యోతి) :జిల్లా అధికార పార్టీలో అప్పుడే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేక పోయినప్పటికీ కొందరు నేతలు ముందస్తు పాలిటిక్స్‌తో దూకుడు పెంచుతున్నారు. ఎమ్మెల్యేలతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్న నేతలు ద్వితీయ స్థాయి క్యాడర్‌ను వెంటేసుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సారి ఎలాగైనా తమకే టికెట్‌ వస్తుందని అధిష్ఠానం వద్ద ఎమ్మెల్యేలకు అంత సీన్‌ లేదంటూ ప్రచారానికి దిగుతున్నారు. దీంతో పార్టీలో విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి. నియోజకవర్గాల్లో మంత్రులు, ఇతర నేతలు ఎవరూ జోక్యం చేసుకోరాదంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టంగా ఆదేశించినా జిల్లాలో పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగానే కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలలో అంతటా ఒకే పరిస్థితి కనిపిస్తోంది. స్వపక్షంలోనే విపక్షం తీరు నెలకొనడంతో ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతలు విభిన్నరకాలుగా ప్రచారం చేయడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఎవరితో వెళ్లినా.... మాట్లాడినా ఏం జరుగుతుందోనన్న భయం టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ను వెంటాడుతోంది. టికెట్‌ ఎవరికి వచ్చినా పార్టీ కోసం పని చేస్తామని కార్యకర్తలు ధీమాగా చెబుతున్న నేతల తీరుతో మాత్రం విసుగెత్తి పోతున్నట్లే కనిపిస్తోంది.
‘ఈ సారి టికెట్‌ మనకే..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టికెట్‌ మాత్రం మనకే రావడం ఖాయం’ అంటూ కొందరు నేతలు తమ సన్నిహితులతో బహిరంగంగానే మాట్లాడుకోవడం కనిపిస్తోంది. నియోజక వర్గంలోని కార్యకర్తలు, సీనియర్‌ నేతలకు తరచూ టచ్‌లో ఉంటూ ఆపదలో ఉన్న పార్టీ శ్రేణులను పలుకరిస్తూ అండగా ఉంటామని హామీలిస్తున్నారు. అడపాదడపగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ శ్రేణుల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కూడగట్టడం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలను పసిగడుతూ ఎండగట్టడం, సో షల్‌ మీడియాలో జోరుగా ప్రచారాలుచేయించడం, అంతా తెరవెనుక రాజకీయం చకచకగా సాగిపోతూనే ఉంది. తమకు ఎమ్మెల్యేలు అధిష్ఠానం కాదని, తాము కూడా అధికార పార్టీకి చెందిన వారిమేనంటూ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. పరామర్శలు, పండుగలు, చిన్నపాటి ఆర్థిక సహాయాలు చేస్తూ ప్రజల్లో ఉండిపోయే విధంగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలనే టార్గెట్‌ చేస్తూ తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో పక్కాప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలపై ఎక్కడ బహిరంగ ఆరోపణలు చేయకపోయినా అంతర్గతంగా మాత్రం మండిపడుతూ తీవ్ర విమర్శలకు దిగుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
సిట్టింగ్‌లకే ఎసరు..
రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లకు టికెట్‌ రావడం కష్టమేనంటూ ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో పైపైన బాగానే కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం రగిలి పోతున్నట్లు కనిపిస్తోంది. సిట్టింగ్‌లకు టికెట్‌ రాదన్న ప్రచారం జరుగడంతో ప్రత్యమ్నాయం తామేనంటూ సొంత పార్టీకి చెందిన నేతలే రంగంలోకి దిగుతున్నారు. ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో గత కొద్ది రోజులుగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రంగినేని మనిషా, మరికొంత మంది నేతలను కలుపుకొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బోథ్‌ నియోజకవర్గంలో మాజీ ఎంపీ గోడం నగేష్‌, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ప్రస్తుత జడ్పీటీసీ సభ్యుడు అనిల్‌జాదవ్‌ ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలలో ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌జనార్దన్‌ కూడా స్పీడు పెంచుతున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజులుగా రెండు నియోజకవర్గాల్లో జరిగే ప్రతీ చిన్నపాటి కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన బిజీగా మారిపోయాడన్న టాక్‌ వినిపిస్తోంది. అవకాశం వస్తే ఖానాపూర్‌, కాకుంటే ఆసిఫాబాద్‌ అ న్నట్లుగా ఆయ న ప్రయత్నాలు సాగుతున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కనిపిస్తున్నారు. అధికార, అనధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లేకుండానే కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా తమకు అధిష్ఠానం పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సొంత పార్టీ  నేతలే వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టడంతో ప్రతిపక్ష పార్టీలకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.

Updated Date - 2022-01-23T05:49:45+05:30 IST