భూ దందాలో పెద్దలు

ABN , First Publish Date - 2021-11-30T06:09:19+05:30 IST

సింహాచలం దేవస్థానానికి సర్వే నంబర్‌ 275 (అడవివరం రెవెన్యూ పరిధి)లో గల భూముల్లో భారీ అపార్టుమెంట్‌ నిర్మాణానికి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అనుమతులు లభించడం వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం, సహకారం వున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూ దందాలో పెద్దలు

బిల్డర్‌కు అధికార పార్టీ నేతల అండదండలు

సింహాచలం దేవస్థానం భూమిలో భవన నిర్మాణానికి అనుమతులు లభించేలా సహాయ సహకారాలు

ముందస్తు వ్యూహం ప్రకారమే ప్లాన్‌కు ద రఖాస్తు

నగరంలోని ప్రముఖ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌కు బాధ్యతల అప్పగింత

స్థలం జోన్‌-3లో ఉన్నప్పటికీ జోన్‌-5కి దరఖాస్తు వెళ్లేలా చేసిన వైనం

అధికారుల చేతికి మట్టి అంటకుండా ఆటోమేటిక్‌గా ప్లాన్‌ అప్రూవల్‌ అయ్యేలా మాస్టర్‌ ప్లాన్‌

టౌన్‌ప్లానింగ్‌ అధికారుల పాత్రపై ఆరోపణలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానానికి సర్వే నంబర్‌ 275 (అడవివరం రెవెన్యూ పరిధి)లో గల భూముల్లో భారీ అపార్టుమెంట్‌ నిర్మాణానికి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అనుమతులు లభించడం వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం, సహకారం వున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణ ప్రతిపాదిత స్థలం దేవస్థానానికి చెందిన సర్వే నంబర్‌ 275లో ఉన్నా, దానికి ఎలాంటి రోడ్డు కనెక్టవిటీ లేకపోయినా, పోర్టు నుంచి లీజుకు తీసుకున్న భూమిని రహదారిగా చూపించినా...ఎలాంటి కొర్రీలు లేకుండానే ప్లాన్‌ మంజూరైపోవడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. 


అడవివరం సర్వే నంబర్‌ 275లో గల భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. ఆ సర్వే నంబర్‌లో నగరంలోని పోర్టు స్టేడియం వెనుక గల భూముల్లో 30 ఏళ్ల కిందట ఒక వ్యక్తి లేఅవుట్‌ వేస్తే కొంతమంది ప్లాట్లు కొనుకున్నారు. అయితే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానానికి చెందిన ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా కొంతమంది ఫీజు కట్టి పత్రాలను పొందారు. కానీ, ఆ భూములపై ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం నడుస్తుండడం, లేఅవుట్‌కు రోడ్డు కూడా లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు జరగలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతమంది పెద్దలు ఆ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట వైసీపీలో చేరిన నేత ఒకరు ఎల్‌ఆర్‌సీ పొందిన వారిని సంప్రతించి, డెవలప్‌మెంట్‌ కోసం (మొత్తం 2,919 గజాల స్థలం) అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఆ భూమికి ఎలాంటి రోడ్డు లేకపోవడంతో పోర్టు అధికారులను సంప్రతించి కొంత స్థలాన్ని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. అయితే లీజుకు తీసుకున్న స్థలాన్ని రోడ్డుగా చూపిస్తే జీవీఎంసీ నుంచి ప్లాన్‌ మంజూరయ్యే అవకాశం లేదని గుర్తించిన సదరు బిల్డర్‌ ముందుజాగ్రత్తగా అధికార పార్టీలోని కొంతమంది నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన ప్రముఖ బిల్డర్‌కు అనుచరుడిగా పేరొందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ను సంప్రతించారు. బిల్డర్‌తోపాటు లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌లోకి కీలక అధికారులను కలిసి ఆ స్థలంలో భవన నిర్మాణానికి ప్లాన్‌ విషయమై చర్చించినట్టు తెలిసింది. టౌన్‌ప్లానింగ్‌ కీలక అధికారి సూచన మేరకు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ ప్లాన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. వాస్తవంగా అడవివరం పంచాయతీ భీమిలి జోన్‌లోకి వెళుతుంది. కాదంటే స్థలాన్ని ఆనుకుని వున్న బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ వార్డు నంబర్‌ 14...జోన్‌-3 పరిధిలోకి వస్తుంది. కానీ ఆ రెండు జోన్లలో అయితే ప్లాన్‌ను ఆయా జోన్‌లలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తిరస్కరించే అవకాశం వుందనే ఉద్దేశంతో జోన్‌-5కి ప్లాన్‌ వెళ్లేలా భవన నిర్మాణ ప్రతిపాదిత స్థలం అక్కయ్యపాలెం పార్ట్‌ అని ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మెన్షన్‌ చేశారు. తద్వారా ప్లాన్‌ దరఖాస్తు జోన్‌-5కి వెళ్లేలా జాగ్రత్తపడ్డారు. అక్కడ టౌన్‌ప్లానింగ్‌ అధికారి దరఖాస్తును చూసి, లోపాలు వున్నట్టు గుర్తించారు. ఆ ప్లాన్‌ దరఖాస్తును ఉన్నతాధికారులకు తాను సిఫారసు చేస్తే ఇబ్బందులు పడాల్సి వుంటుందనే భయంతో  ముట్టుకోకుండా వదిలేశారు. గడువు దాటిపోవడంతో గత నెల ఏడున ఆటోమేటిక్‌గా ప్లాన్‌ జారీ (‘డీమ్డ్‌ అప్రూవల్‌’) అయిపోయింది. దీంతో తమ వ్యూహం విజయవంతమైందని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, అధికార పార్టీ నేతలు, బిల్డర్‌ సంబరపడ్డారు. అయితే అనుకోకుండా అదే లేఅవుట్‌పై కొంతమంది పోలీస్‌, రెవెన్యూ, దేవస్థానం అధికారులకు ఫిర్యాదులు అందడంతో కథ అడ్డం తిరిగింది.


టౌన్‌ప్లానింగ్‌లో గుబులు

 కమిషనర్‌, మేయర్‌కు ఫిర్యాదు అందడంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల్లో గుబులు మొదలైంది. అధికార ఒత్తిడి తలొగ్గి నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ ప్లాన్‌ జారీకి సహకరించిన వారంతా దిద్దుబాటు చర్యల్లో తలమునకలవుతున్నారు. ప్లాన్‌  జారీలో తప్పును ఎలా సరిదిద్దుకోవాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. నగరంలో దాదాపు 1,500 ప్లాన్‌లు డీమ్డ్‌ అప్రూవల్‌ అయ్యాయని, అందులో ఇదొకటని చెప్పుకొస్తున్నారు. వీటన్నింటినీ ఆర్‌టీఎస్‌లో మళ్లీ వెనక్కి తెచ్చుకుని సక్రమంగా వున్నదీ లేనిదీ చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. అయితే లీజుకు తీసుకున్న స్థలంలో రోడ్డును చూపించి భవన నిర్మాణానికి ప్లాన్‌ మంజూరుచేసేందుకు మాత్రం నిబంధనలు అనుమతించవనీ, ఆ భవన నిర్మాణానికి జారీ అయిన ప్లాన్‌ను రద్దు చేయకతప్పదని టౌన్‌ప్లానింగ్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. 


ఆ భూమిపై సుదీర్ఘ వివాదం

తమ స్థలం ఆక్రమించారని పొట్లూరి కుటుంబం ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన పోలీస్‌ కమిషనర్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానానికి చెందిన సర్వే నంబర్‌ 275లో గల భూమిపై సుదీర్ఘ వివాదం నడుస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘అప్పన్న భూమిలో దందా’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ప్రచురించిన కథనం నగరంలో సంచలనం కలిగించింది. ఆ భూమిపై దశాబ్దాల నుంచి వివాదం నడుస్తోందని, ఇంకొకరికి ఎలా అప్పగిస్తారంటూ పొట్లూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తరపున జీపీఏ తీసుకున్న శంకరనారాయణ దేవస్థానం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. ఇదే అంశంపై నగర పోలీస్‌ కమిషనర్‌కు కూడా పొట్లూరి వెంకటేశ్వరరావు (విజయవాడ) ఈ నెల 23న మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. తమ భూమిలోకి వేరే వ్యక్తులు వచ్చి చదును చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమి తమదంటున్న వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఓడిపోయారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి, తగిన న్యాయం చేయాలని కోరారు. మరోవైపు జనసేన నాయకుడు, జీవీఎంసీ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ దీనిపై నగర మేయర్‌ హరికుమారికి సోమవారం ఫిర్యాదు చేశారు.


అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది

ఈ భూ వివాదానికి సంబంధించి సింహాచలం దేవస్థానం అధికారులు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. పోర్టు స్టేడియం వెనుకనున్న 275 సర్వే నంబరులో 5.39 ఎకరాలకు సంబంధించి రెండు వర్గాల మధ్య కొన్నేళ్ల నుంచి వివాదం నడుస్తోంది. విజయనగరం రాజుల నుంచి 1948లో తమకు ఈ భూమి సంక్రమించిందని పొట్లూరి వెంకటేశ్వరరావు క్లెయిమ్‌ చేస్తున్నారు. తమకు పట్టా కూడా ఉందని, తాము అందులో వున్నట్టు 1998లో పంచ గ్రామాలపై సర్వే చేసిన అధికారులు పేర్కొన్నారంటూ కోర్టుకు నివేదించారు. దీనిని సబ్‌ డివిజన్‌ చేసి, 275/1ఏగా తమ భూమిని గుర్తించారని పేర్కొన్నారు. ఆ భూమిలో పాత్రుడు అనే వ్యక్తి తమకు తెలియకుండా లేఅవుట్‌ వేసి పలువురికి విక్రయించాడని, దానిపై తాము కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. పాత్రుడు కేసును జిల్లా కోర్టులో, హైకోర్టులో కూడా కొట్టేశారని వారు చెబుతున్నారు.


అది వేరు..ఇది వేరు

సర్వే నంబర్‌ 275లో 2,919 గజాలకు భూ మార్పిడి అనుమతి తెచ్చుకున్న వ్యక్తులు దీనిపై మాట్లాడుతూ, పొట్లూరి ఫిర్యాదులో పేర్కొన్న భూమి, తమకు కేటాయించిన భూమి వేర్వేరు సర్వే నంబర్లు అని చెబుతున్నారు. తమకు దేవదాయ శాఖ సర్వే నంబరు 275లో మూడు వైపుల రహదారితో ఇచ్చిందని, పొట్లూరి భూమి 275/1ఏలో ఉందని, దానికీ దీనికీ సంబంధం లేదని వాదిస్తున్నారు.


అన్ని శాఖల సిబ్బంది పరిశీలన

వివాదాస్పదంగా మారిన ఈ భూమిపై ఫిర్యాదులు అందడంతో దేవస్థానం అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ కమిషనర్‌ ఆదేశం మేరకు నాలుగో పట్టణ పోలీసులు మూడు రోజులుగా అక్కడికి వెళ్లి, వివరాలు సేకరిస్తున్నారు. భూ హక్కు పత్రాలు తీసుకొని, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-30T06:09:19+05:30 IST