ప్రేమను మసి చేసిన పెద్దరికం!

ABN , First Publish Date - 2022-07-04T09:10:15+05:30 IST

పెద్ద’రికం మంటకలిసింది. అభ్యంతర పెట్టినా తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహం,

ప్రేమను మసి చేసిన పెద్దరికం!

  • గొంతు నులిమి టెకీ హత్య, పెట్రోలు పోసి నిప్పు 
  • దారుణానికి ఒడిగట్టిన యువతి కుటుంబసభ్యులు
  • తమ అమ్మాయిని పెళ్లాడాడనే కక్షతోనే.. ఆలస్యంగా వెలుగులోకి
  • యువతి కుటుంబసభ్యుల దారుణం
  • తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కక్ష 
  • యువకుడిది ఒకే ఊరు.. ఒకే కులం 
  • అదృశ్యమైన ఐదురోజులకు వీడిన మిస్టరీ 
  • యువతి తండ్రి సహా ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, హైదర్‌నగర్‌, జిన్నారం, గిద్దలూరుటౌన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘పెద్ద’రికం మంటకలిసింది. అభ్యంతర పెట్టినా తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహం, ఆ అమ్మాయికి మరో యువకుడితో పెళ్లి చేయాలనే పంతంతో యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు. యువకుడిది అదే సామాజిక వర్గం.. పైగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయినా వివేచన మరిచి గొంతు నులిమి చంపి.. మృతదేహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారు. ఐదురోజులుగా అదృశ్యమైన తమ అబ్బాయి ఎక్కడున్నా క్షేమంగానే ఉండాలని దేవుణ్ని ప్రార్థించిన ఆ కుటుంబసభ్యులకు కన్నీరే మిగిలింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రం సమీపంలో 80శాతంపైగా కాలిపోయి.. కుళ్లిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకొండపల్లికి చెందిన శనివారం నారాయణరెడ్డి (26) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అదే గ్రామం, తమ సామాజిక వర్గానికే చెందిన కందుల వెంకటేశ్వరరెడ్డి కూతురు రవళితో ప్రేమలోపడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటే యువతి తరఫువారు అగీకరించలేదు. వారిని కాదని గత ఏడాది ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. తర్వాత వారు ఢిల్లీకి వెళ్లి అక్కడే ఉన్నారు. కొన్నాళ్లకు నారాయణరెడ్డితో మాటలు కలిపిన రవళి తల్లిదండ్రులు, కొన్నాళ్లు తమ అమ్మాయిని ఇంటికి పంపించాలని కోరారు. 


తమ ప్రేమ వివాహాన్ని ఎట్టకేలకు మన్నించారని నమ్మిన నారాయాణ రెడ్డి, వారు చెప్పినట్లే భార్యను పంపాడు. అయితే తమ ఇంటికి వచ్చిన యువతిని తల్లిదండ్రులు హౌస్‌ అరెస్టు చేశారు. భర్తతో మాట్లాడకుండా కట్టడి చేశారు. పరిణామాలను అర్థం చేసుకున్న నారాయణ రెడ్డి, ఎలాగైనా భార్యను దక్కించుకోవాలనుకొని  తన మకాంను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. ఇక్కడే ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చూసుకొని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌ 1లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. తన భార్యను అప్పగించాలంటూ రవళి కుటుంబసభ్యులపై హెక్టోరులో పిటిషన్‌ వేశాడు. కోర్టు.. రవళి అభిప్రాయం అడిగితే తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పడంతో యువతి కుటుంబీకులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అనంతరం రవళికి మరో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో రవళి తన ఇంట్లో వారికి తెలియకుండా భర్తతో  మాట్లాడేది. ఇది తెలిసి.. నారాయణ రెడ్డిని అడ్డుతొలగించుకోవాలని రవళి తండ్రి వెంకటేశ్వర రెడ్డి నిర్ణయించాడు. అప్పటికే నారాయణ రెడ్డితో పరిచయం ఉన్న రవళికి వరుసకు సోదరుడు, తమ ఊరికే చెందిన శ్రీనివాస్‌ రెడ్డికి ఆ బాధ్యతను అప్పగించాడు. 


శ్రీనివాస్‌రెడ్డికి ఏపీకే చెందిన ఆసిఫ్‌, కాశీ స్నేహితులు. వారితో కలిసి శ్రీనివాస్‌రెడ్డి గతనెల 27న కారులో హైదరాబాద్‌లో నారాయణ రెడ్డి ఉంటున్న గదికి వచ్చాడు. మాట్లాడుకుందామని చెప్పి ఆయన్ను ముందుసీట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆసిఫ్‌ వాహనాన్ని నడుపుతుంటే శ్రీనివాస్‌ రెడ్డి, కాశీ వెనుక సీట్లో కూర్చుకున్నారు. అంతా కలిసి జేఎన్‌టీయూ రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ మద్యం తీసుకుని ఖాజాగూడ వైపు వెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగారు. కాసేపటికి ముందుసీటులో ఉన్న నారాయణరెడ్డి మెడకు శ్రీనివా్‌సరెడ్డి నైలాన్‌ తాడును ఉరిబిగించి హత్యచేశాడు. అనంతరం కారును జిన్నారంవైపు తీసుకెళ్లాలని ఆసి్‌ఫను శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించాడు. జిన్నారం మండలం నల్లూరు గ్రామ శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతంలో నారాయణరెడ్డి మృతదేహాన్ని పడేసి వెంట తెచ్చిన పెట్రోల్‌ను మృతదేహంపై పోసి నిప్పటించాడు. గది నుండి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి, తిరిగి రాకపోవడంతో స్నేహితుడు, ఆయన కుటుంబసభ్యులకు చెప్పాడు. ఎక్కడా నారాయణరెడ్డి ఆచూకీ లేకపోవడంతో జూన్‌ 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నారాయణరెడ్డి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా ఆసి్‌ఫను అదుపులోకి విచారించంగా మిస్టరీ వీడింది. ఆసిఫ్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు జిన్నారం మండలం నల్లూరు గ్రామ శివారులో పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో వెంకటేశ్వరరెడ్డిని, శ్రీనివా్‌సరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కాశీ కోసం గాలిస్తున్నారు.  

Updated Date - 2022-07-04T09:10:15+05:30 IST