పెద్దల పాపం.. పిల్లలకు శాపం

ABN , First Publish Date - 2022-04-26T06:08:45+05:30 IST

భార్యాభర్తల సంబంధాలను పెళ్లితంతు కాపాడదు.

పెద్దల పాపం.. పిల్లలకు శాపం

వివాహేతర సంబంఽధం కోసం హత్యలు  

అనాథలైన ఇరువురి పిల్లలు


భార్యాభర్తల సంబంధాలను పెళ్లితంతు కాపాడదు. ఇద్దరి మధ్య ఉండే పరస్పర ప్రేమ, నమ్మకం మాత్రమే పదిలంగా ఉంచుతుంది. నమ్మకం పునాది మీద జీవితమంతా కొనసాగాల్సిన బంధం అది. దాన్ని విస్మరించి వివాహేతర సంబంధాలకు సిద్ధమైతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. పిల్లలు వీధినపడతారు. ఇటీవల సుధాకర్‌ అనే వ్యక్తిని భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు దస్తగిరి కలిసి హత్య చేశారు. ఈ ఘటనతో ముడిపడిన  విషాదకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 


- కోడుమూరు 


వివాహేతర సంబంధం కోసం ఆ ఇద్దరూ జీవిత భాగస్వాములను  హత్య చేశారు. పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు.  రెండు కుటుంబాలూ   చిన్నాభిన్నమయ్యాయి. ఇరువురి పిల్లలు అనాథలయ్యారు. 


కోడుమూరులో వివాహేతర సంబంధం మోజులోపడి లక్ష్మి అనే మహిళ ప్రియుడు దస్తగిరితో కలిసి భర్త సుధాకర్‌ను హత్య చేసిన విషయం విదితమే. అంతక ముందే దస్తగిరి తన భార్య ఖాజాబీని లక్ష్మి కోసం హత్య చేశాడు. దీంతో లక్ష్మి-సుధాకర్‌ల ఇద్దరు పిల్లలు, దస్తగిరి-ఖాజాబీల నలుగురు పిల్లలు అనాథలయ్యారు.   తల్లిదండ్రుల తప్పిదాల వలన పిల్లలు రోడ్డున పడ్డారు. 


సుధాకర్‌, లక్ష్మి కూలిపనులు చేసుకొని జీవించేవారు. వారికి తొమ్మిదేళ్ల కింద పెళ్లయింది. వీరికి  మధుసూదన్‌(8),  మహేంద్ర (6) ఇద్దరు పిల్లలు. మూడేళ్ల కింద లక్ష్మికి దస్తగిరితో  పరిచయం అయింది. అది   వివాహేతర సంబంఽధంగా మారింది. అప్పటి నుంచి లక్ష్మి తరచూ భర్తతో గొడవపడేదని, పిల్లలను నిర్లక్ష్యం చేసిందని, వాళ్లను కొట్టేదని బంధువులు చెబుతున్నారు. చివరికి తన  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త సుధాకర్‌ను ప్రియుడు సహాయంతో ఈ నెల 18న హత్య చేసి కటకటాల పాలు అయింది. తండ్రి మృతి చెందడం, తల్లి జైలు పాలు కావడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారు  ప్రస్తుతం   నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. 


 దస్తగిరి పిల్లల పరిస్థితి దారుణం 


పంచాయతీ బోర్డులో స్వీపర్‌గా పని చేసే దస్తగిరికి 19 సంవత్సరాల కిందట ఖాజాబీతో వివాహం అయింది. వీరికి నలుగు ఆడపిల్లలు. అయితే లక్ష్మితో పరిచయం అయ్యాక వారిది కలహాల కాపురం అయింది.  ప్రియురాలి కోసం దస్తగిరే ఏడాది కింద ఖాజాబీని హత్య చేశాడు. ఆ తర్వాత అతను పిల్లలను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు.  దీంతో  ఖాజాబీ కుటుంబ సభ్యులే ఆడపిల్లలను చేరదీశారు. తల్లిలేని, తండ్రి పట్టించుకోని పెద్దమ్మాయికి ఇటీవల వారు  పెళ్ళి చేశారు.  షరీఫా (12) ఆషియా  (7) రిజ్వానా (5)  బాగోగులు వాళ్లే చూస్తున్నారు. పన్నెండేళ్ల షరీఫా తన చెల్లెళ్లకు పెద్దదిక్కయింది.  

Updated Date - 2022-04-26T06:08:45+05:30 IST