ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు అంతంతే

ABN , First Publish Date - 2020-10-29T06:44:36+05:30 IST

ఇంజనీరింగ్‌ విద్యపై క్రమేపి ఆసక్తి తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినా 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడం ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది

ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు అంతంతే

ప్రభుత్వ కళాశాలలు కళకళ

ప్రైవేట్‌కు ఆదరణ కరువు

కొత్త కోర్సులపై ఆసక్తి కనబర్చని విద్యార్థులు

జిల్లాలో 5,085 సీట్లకు 2,005 భర్తీ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇంజనీరింగ్‌ విద్యపై క్రమేపి ఆసక్తి తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినా 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడం ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు ప్రభుత్వ జేఎన్టీయూ, 11 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ విభాగాల్లో 5,085 సీట్లు ఉండగా తొలి విడతలో కేవలం 2,005 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. భర్తీ అయిన సీట్లలోనూ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రైవేట్‌ కళాశాలలు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తున్నది. గతంలో కరీంనగర్‌ జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలలన్నీ పూర్తిస్థాయి అడ్మిషన్లతో కళకళలాడేవి.  రెండు, మూడు సంవత్సరాలుగా పలు కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితే కొట్టచ్చినట్లు కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొండగట్టు సమీపంలోని నాచుపల్లి వద్ద, మంథని ప్రాంతంలోని సెంటినరీ కాలనీలో జేఎన్టీయూ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యంలో జ్యోతిష్మతి విద్యాసంస్థలు రెండు కళాశాలలు, శ్రీచైతన్య విద్యాసంస్థలు రెండు కళాశాలలు, హుజురాబాద్‌ కిట్స్‌, నిగమ, ట్రినిటీ, వాగేశ్వరి, విట్స్‌ కళాశాలలు కరీంనగర్‌లో ఉన్నాయి.


పెద్దపల్లిలో ట్రినిటి, మదర్‌ థెరిసా ఇంజనీరింగ్‌ కళాశాలలు విద్యార్థులకు ఇంజనీరింగ్‌ విద్యను అందిస్తున్నాయి. ఈ 13 కళాశాలల్లో నాచుపల్లి జేఎన్‌టీయూలో 300 సీట్లు, మంథని జేఎన్టీయూలో 330 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడత అడ్మిషన్లలో భాగంగా నాచుపల్లి కళాశాలలో 298 సీట్లు, మంథని కళాశాలల్లో 328 సీట్లు భర్తీ అయ్యాయి. ఒక్కో జేఎన్టీయూ కళాశాలల్లో రెండేసి సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.  ప్రభుత్వ కళాశాలల పరిస్థితి ఇలా ఉండగా ప్రైవేట్‌ కళాశాలల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. జిల్లాలోని 11 ప్రైవేట్‌ కళాశాలల్లో 4,455 సీట్లు ఉండగా ఇందులో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వ కళాశాలల్లోని 630 సీట్లు, ప్రైవేట్‌ కళాశాలల్లో 3118 సీట్లు, మొత్తం 3748 సీట్లు భర్తీ చేయాల్సి ఉన్నది.  ఇప్పటి వరకు తొలి విడతలో ప్రభుత్వ యాజమాన్యంలోని 626 సీట్లు భర్తీ కాగా ప్రైవేట్‌లో కన్వీనర్‌ కోటాలో 1,479 సీట్లకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చారు. 


కంప్యూటర్‌ సైన్స్‌పై పెరిగిన ఆసక్తి...

రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కృత్రిమ మేధ-మిషన్‌ లర్నింగ్‌, డాటా సైన్స్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, నెట్‌వర్క్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లాంటి ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. జిల్లాలో ఇందులో మూడు కోర్సులను జిల్లా ప్రైవేట్‌ కళాశాలలకు అనుమతిచ్చినా వాటిపై విద్యార్థులు ఆసక్తి చూపలేదు. కంప్యూటర్‌ సైన్స్‌ప్లై గతంలో కంటే విద్యార్థులు ఎక్కువ ఆదరణ కనబరిచారు. ఈ కోర్సులో జిల్లావ్యాప్తంగా అన్ని కళాశాలల్లో 1,230 సీట్లు ఉండగా 831 సీట్లు భర్తీ అయ్యాయి. ఈఈఈలో 1,065 సీట్లు ఉండగా 290 సీట్లు, ఈసీఈ 1,140 సీట్లు ఉండగా 455 సీట్లు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 540 సీట్లు ఉండగా 154, సివిల్‌ ఇంజనీరింగ్‌లో 540 సీట్లు ఉండగా 145, ఐటీ కోర్సులో 60 సీట్లు ఉండగా 59 భర్తీ అయ్యాయి. కొత్త కోర్సులైన సీఎస్‌ఎంలో 360 సీట్లు ఉండగా 102 సీట్లు భర్తీ అయ్యాయి. మరో రెండు కొత్త కోర్సులైన సీఎఫ్‌లో 60 సీట్లు, సీఎస్‌ఐలో 60 సీట్లు ఉండగా ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో 30 సీట్లు ఉండగా 29 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రధానంగా ప్రైవేట్‌ యాజమాన్యంలో నిర్వహిస్తున్న పలు కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్లు లేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తున్నది. 4,455 సీట్లకుగాను 1,479 సీట్లు  మాత్రమే భర్తీ కావడంతో ప్రైవేట్‌లో 3,076 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలన్నీ రెండో విడత అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నాయి. రెండు వంతుల సీట్లు ఖాళీగా ఉండడంతో కళాశాలల నిర్వహణ ఎలా అనే అంశంలో వారు ఆందోళన పడుతున్నారు.


11 ప్రైవేట్‌ కళాశాలల్లో నాలుగైదు కళాశాలలపైనే విద్యార్థులు మొగ్గు చూపారు. అందులో కూడా ఒకటి రెండు కోర్సులపైనే ఆసక్తి ప్రదర్శించి అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో ఆయా కోర్సులకు సంబంధించిన సీట్ల విషయంలో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయి. అడ్మిషన్లకు ముందే గతంలో డిమాండ్‌లేని కొన్ని సీట్లను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి కొత్త కోర్సులకు అనుమతి తెచ్చుకున్నాయి. ఆ కోర్సులపై అవగాహనలేకనో, మరె ఇతర కారణాల వల్లో కాని వాటిపై కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అడ్మిషన్లు అంతంతమాత్రంగానే జరిగాయి. మొదటి విడత అడ్మిషన్లు పొందిన విద్యార్థులందరు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సిన గడువు బుధవారంతో ముగిసింది. ఎంతమంది విద్యార్థులు రిపోర్టు చేస్తారో వెల్లడైతేనే ఆ సీట్లు భర్తీ అయినట్లుగా భావించవచ్చు. దీంతో మరికొన్ని సీట్లు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ప్రైవేట్‌ యాజమాన్యాలను ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

Updated Date - 2020-10-29T06:44:36+05:30 IST