కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2020-07-16T09:44:43+05:30 IST

ప్రజలు ఆందోళన చెందవద్దని, కరోనా కట్టడికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

24 గంటల్లో ప్రైవేటు హాస్పత్రులకు అనుమతి

కొవిడ్‌ హాస్పిటల్‌గా పీఎంఎ్‌సఎ్‌సవై దవాఖాన

ఐసోలేషన్‌ వార్డుగా కేయూ

చికిత్స చేసే డాక్టర్లకు హరిత

ఇళ్లలో ఉండే బాధితులకు వైద్యసేవలు

చికిత్స అందించే డాక్టర్లకు, సిబ్బందికి ప్రోత్సాహకాలు

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కరోనా కట్టడి ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష


హన్మకొండ టౌన్‌, జూలై 15: ప్రజలు ఆందోళన చెందవద్దని, కరోనా కట్టడికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ వేయడంతో పాటు ప్రజాప్రతినిధులం సైతం ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని స్పష్టం చేశారు. హన్మకొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో బుధవారం కరోనా విస్తృతి కట్టడిపై ఎంజీఎం వైద్యశాలలో కరోనా ఏర్పాట్లు, వైద్య సామర్ధ్యం పెంపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంజీఎం వైద్యులు, ప్రైవేటు హాస్పిటల్స్‌ యాజమాన్యాలతో మంత్రి సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. పలు అంశాలపై ఈటల నుంచి హామీ తీసుకున్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి కావాల్సిన ఏర్పాట్లు వరంగల్‌లోనే చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి స్వాస్త్య సంయోజన పథకం నిధులతో సెంట్రల్‌ జైలు ఆవరణలో నిర్మించిన 200 పడకల హాస్పిటల్‌ను కొవిడ్‌ హాస్పిటల్‌గా మార్చి వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. 


ఎంజీఎంను సాధారణ వైద్యశాలగా పరిగణిస్తూ కరోనా ఓపీ, ఇతర వైద్య సేవలు అందించనున్నామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఐసోలేషన్‌ వార్డుగా కాకతీయ యూనివర్సిటీని వినియోగించడంతో పాటు చికిత్స చేసే డాక్టర్ల కోసం హోటల్‌ హరితను వినియోగించనున్నామన్నారు. ఇళ్లలో ఉండే కరోనా బాధితులకు ఫోన్‌ ద్వారా వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రణకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌కు కావాల్సిన రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సీజన్‌, పీపీఈ కిట్లు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ హామీ ఇచ్చారన్నారు.


కరోనా పరీక్షలు, చికిత్స కోసం అనుమతులు కోరే ప్రైవేటు హాస్పత్రులకు 24 గంటల్లో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్లకు, సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు, అవార్డులు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీ బండ ప్రకాశ్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కార్పోరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు వైద్యశాలల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-07-16T09:44:43+05:30 IST