మెడికల్‌ కళాశాలకు పరిపాలన అనుమతులు

ABN , First Publish Date - 2022-08-07T06:21:38+05:30 IST

కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది.

మెడికల్‌ కళాశాలకు పరిపాలన అనుమతులు
మంత్రి గంగుల కమలాకర్‌కు కరీంనగర్‌లో మెడికల్‌ కళాశాల పరిపాలనా మంజూరీ పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

- మంత్రి గంగులకు ఉత్తర్వులు అందించిన సీఎం కేసీఆర్‌ 

- నెరవేరుతున్న చిరకాల కోరిక

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఉత్తర్వుల పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గత మార్చి 22న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగంలో ఈ సంవత్సరం కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిలాల్లతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల, అప్‌గ్రేడింగ్‌ ఆఫ్‌ అటాచ్డ్‌ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌కు పరిపాలనా మంజూరు ఇవ్వాలంటూ 2022 జూన్‌ 7న డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, హైదరాబాద్‌ పంపించిన ప్రతిపాదనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 150 కోట్ల రూపాయలతో 100 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు నిర్వహించేలా కరీంనగర్‌ జనరల్‌ హాస్పిటల్‌ను బోఽధనాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ మెడికల్‌ కాలేజీతో అటాచ్డ్‌ చేసింది. మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులను రోడ్లు భవనాలశాఖకు, జిల్లా ఆసుపత్రి భవన అప్‌గ్రేడేషన్‌ పనులను అలాగే అవసరమైన పరికరాలు, ఫర్నిచర్‌ సమకూర్చే బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఉమ్మడి జిల్లా పరిధిలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇప్పటికే మంజూరు చేయగా వాటి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రకటించిన వైద్యకళాశాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన నాలుగు జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి.  ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైతే జిల్లా కేంద్ర ఆసుపత్రి టీచింగ్‌ హాస్పిటల్‌గా మారి ఈ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ ఉద్యమకాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కరీంనగర్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత స్థల పరిశీలన, తదితర ఉత్తర్వులు ప్రత్యుత్తర్వులు జరిగినా కళాశాల ఏర్పాటు మరుగున పడిపోయింది. కరీంనగర్‌ జిల్లాను విభజించిన సమయంలో ఈ జిల్లా కేంద్రాన్ని వైద్య విద్యారంగాలకు హబ్‌ మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  


ఫ మెడికల్‌ కళాశాల ఆశయ సాధన దిశగా మరో అడుగు

- సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు 

- మంత్రి గంగుల కమలాకర్‌ 

ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయసాధన దిశగా వైద్య ఆరోగ్యశాఖ మరో అడుగు వేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లో మెడికల్‌ కళాశాలకు పరిపాలనా మంజూరు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరీంనగర్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు, అనుబంధ హాస్పిటల్‌ అప్‌గ్రేడేషన్‌కు పరిపాలన అనుమతులు జారీ చేసిందని, ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. 

 

Updated Date - 2022-08-07T06:21:38+05:30 IST