అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారమే పరిపాలన కొనసాగుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఒకరి హక్కును మరోకరు లాక్కోకూడదన్నారు. ప్రాథమిక హక్కుల ఆధారంగానే చట్టాలు ఉంటాయన్నారు. అమరావతిలో చంద్రబాబు రాజధాని కట్టదలుచుకున్నారా, నగరాన్ని కట్టాలని అనుకున్నారా అనేదే ముఖ్యమన్నారు. నగర నిర్మాణం ఐదు పదేళ్లలో సాధ్యమయ్యేనా అని ఆయన ప్రశ్నించారు. ఉప జాతీయవాదం రాకుండా ఉండాలంటే సమానత్వంపై దృష్టి పెట్టాలని గత అనుభవాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. తలసరి ఆదాయంలో కృష్ణా, విశాఖ, గోదావరి జిల్లాలు టాప్ అని, శ్రీకాకుళం, కర్నూలు, విజయనగరంలో తలసరి ఆదాయం తక్కువ అని ఆయన పేర్కొన్నారు. అన్నిరంగాల్లో ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు వెనుకబడ్డాయన్నారు. ప్రాంతాల మధ్య అసమానతల్ని తొలగించాలని రాజ్యాంగంలో ఉందన్నారు.
తెలంగాణ కన్నా కూడా సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో తాగునీరు లేని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరులో తీవ్ర దుర్భిక్షం ఉందన్నారు. 70 వేల మంది కుప్పం వాసులు వలస వెళ్లారన్నారు. సమానత్వంపై ప్రభుత్వానికి ఎంతో బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి